Wednesday, 22 March 2017

మార్చి 2017 జాతీయం

నీటి ఎద్దడిపై నీతిఆయోగ్ ఆందోళన :: దేశంలో పెరిగిపోతున్న నీటిఎద్దడిపై నీతిఆయోగ్ మార్చి 23న ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉపయోగిస్తున్న నీటిలో వ్యవసాయ అవసరాలకే 70 శాతం సరిపోతోందని, జలాల వినియోగ సమర్థతను మరో 20 శాతం పెంచేలా పరిశోధనలు చేయాలని పేర్కొంది.

గోవధకు మరణశిక్ష విధించాలని ప్రైవేటు బిల్లు ::గోవధకు పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాజ్యసభలో మార్చి 24న ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. గోవుల సంఖ్యను స్థిరీకరించేలా ప్రాధికార సంస్థ ఏర్పాటు, రాజ్యాంగంలోని 37, 48 అధికరణలకు అనుగుణంగా చర్యలు, గోవధ నిషేధం ఉండాలని బిల్లులో పొందుపరిచారు. 

ఓబీసీలకు రాజ్యాంగబద్ధ కమిషన్‌కు కేబినెట్ ఆమోదం  :: ఎస్టీ, ఎస్టీలకు ఉన్నట్లుగానే జాతీయ స్థాయిలో ఓబీసీ(ఇతర వెనకబడిన వర్గాలు) లకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్చి 23న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రస్తుతమున్న బీసీ జాతీయ కమిషన్‌ను రద్దు చేసే ప్రతిపాదననూ ఆమోదించింది. 
1993 ఆగస్టు 14న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధ వ్యవస్థగా బీసీ జాతీయ కమిషన్ ఏర్పడింది. అయితే దీనికి ఓబీసీల ఫిర్యాదులను పరిష్కరించే అధికారం లేదు. అందుకోసం ఇప్పుడు కొత్తగా ‘సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్’ (ఎన్‌సీఎస్‌ఈబీసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఒక ఉప చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. 


మానవుల అక్రమ రవాణాలో బెంగాల్ టాప్ :: దేశవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్చి 26న ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి 2016లో బెంగాల్‌లో 3,576, రాజస్తాన్‌లో 1,422 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 61 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. 548 కేసులతో గుజరాత్ మూడోస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 239, తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయి. 
అక్రమ రవాణాను అరికట్టేందుకు భారత్.. బంగ్లాదేశ్, యూఏఈలతో అవగాహనా ఒప్పందాల్ని కుదుర్చుకుంది. 


యూపీలో యాంటీ-రోమియో దళాలు ప్రారంభం  :: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఆ రాష్ట్ర పోలీసులు మార్చి 22న యాంటీ- రోమియో పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈవ్‌టీజింగ్‌ని అరికట్టేందుకు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపారు. అలాగే గోవధపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని తన వ్యక్తిగత వెబ్‌సైట్ www.yogiadityanath.in ద్వారా తెలపాలని సీఎం ఆదిత్యనాథ్ కోరారు. 


దక్షిణాది జలాశయాల్లో తగ్గిన నీటి నిల్వలు :: దక్షిణాది రాష్ట్రాల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని కేంద్ర జలవనరుల శాఖ మార్చి 25న ప్రకటించింది. దక్షిణాదిలోని 31 రిజర్వాయర్లలో మార్చి 24 నాటికి కేవలం 16 శాతం మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొంది. ఇది గతేడాది కంటే 2 శాతం, గత పదేళ్ల సగటు కంటే 13 శాతం తక్కువ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ఉన్న ఈ 31 రిజర్వాయర్ల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 51.59 శతకోటి ఘనపు మీటర్లు (బీసీఎం). ప్రస్తుతం 8 బీసీఎం మాత్రమే నిల్వలున్నాయి. 

శశికళ, పన్నీర్ సెల్వం కొత్త పార్టీలు  :: అన్నాడీఎంకేకు ఉన్న రెండాకుల ఎన్నికల చిహ్నం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల్లో ఎవరికీ చెందదని మార్చి 22న ఎన్నికల సంఘం తేల్చింది. దీంతో ఇరు వర్గాలు కొత్త పార్టీలు పెడుతున్నట్లు ప్రకటించాయి. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పేరుతో పార్టీని ప్రకటించిన పన్నీర్ సెల్వం ఎన్నికల చిహ్నంగా రెండు లైట్ల విద్యుత్ స్తంభాన్ని ఎంచుకున్నారు. అన్నాడీఎంకే అమ్మ పేరుతో పార్టీని స్థాపించిన శశికళ వర్గం ఎన్నికల గుర్తుగా టోపీని ఎంచుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండు పార్టీలు కేటాయించిన గుర్తులతో పోటీ చేయనున్నాయి. 


భారత్‌లోని ఐదు నగరాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు  :: భారత్‌లోని ఐదు నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ మేరకు మార్చి 22న రాజ్యసభలో ప్రకటన చేసిన కేంద్రం అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, ముంబై నగరాలకు యునెస్కో వారసత్వ హోదా లభించిందని పేర్కొంది. 

5 ఏళ్లలో వెయ్యి మె.వా. సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయనున్న రైల్వే :: భారతీయ రైల్వే వచ్చే 5 ఏళ్లలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రైల్వే శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మార్చి 25న వెల్లడించారు. 
మొత్తంగా రైల్వేల నిర్వహణ కోసం ప్రస్తుతం వెచ్చిస్తున్న ఇంధన వ్యయంలో పదేళ్లలో రూ.41 వేల కోట్లు ఆదా చేయాలన్నది లక్ష్యం. 


అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరంగా ఢిల్లీ :: 2015-16 గణాంకాల ప్రకారం భారత్‌లో అత్యంత గాలి కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రి అనిల్ దవే మార్చి 27న రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) విలువల ప్రకారం.. ఢిల్లీ, ఫరీదాబాద్, వారణాసి, లక్నో, జైపూర్, కాన్పూర్, పట్నా, ముజఫర్‌నగర్ నగరాల్లో గాలి తీవ్రంగా కలుషితమైంది. 
ఆగ్రా, జోధ్‌పూర్, గుర్గావ్, గయా, సోలాపూర్, చంద్రాపూర్, చెన్నైలలో ఓ మోస్తరుగా కలుషితమైంది. 
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, నవీ ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లాంటి నగరాల్లో వాయు నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉంది. 


సంక్షేమానికి ఆధార్ తప్పనిసరి కాదు : సుప్రీంకోర్టు :: సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆయా పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు ఆధార్ కార్డును తప్పనిసరి చేయలేవని చెప్పింది. ఈ మేరకు ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అవసరమని మార్చి 27న కోర్టు అభిప్రాయపడింది. 
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, ఐటీ రిటర్న్ దాఖలు వంటి సంక్షేమేతర అంశాలకు ఆధార్‌ను అడ్డుకోమని న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ తప్పనిసరి కాదని 2015 ఆగస్టు 11న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 


మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం :: మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు - 2016కు లోక్‌సభ మార్చి 27న ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించడం నేరం కాదు. మానసిక వికలాంగులు మెరుగైన వైద్యం పొందే హక్కు, వారి ఆస్తిని కాపాడుకునే హక్కులను కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.


జాతీయ వైద్య విధానం - 2017 :: జాతీయ వైద్య విధానం-2017ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 16న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటులో ఈ విధానాన్ని ఆవిష్కరించారు. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. ఇందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి. ఆయుర్దాయాన్ని 67.5 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, పాఠశాలలు, పని కేంద్రాల్లో మరింత విసృ్తతంగా యోగాను ప్రారంభించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ప్రజారోగ్యంపై వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.5 శాతం ఉండగా దీన్ని ఒక నిర్దిష్ట కాలక్రమంలో 2.5 శాతానికి పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. 

పాలసీలోని ముఖ్యాంశాలు :: 
  • పేషెంట్లకు సాధికారత కల్పించేలా చికిత్స సరిగా అందని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు.
  • 2025 కల్లా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటును 23కి, ప్రసూతి మరణాల రేటును 2020 కల్లా 100కు తగ్గించాలి.
  • 2019 కల్లా శిశు (ఏడాదిలోపు చిన్నారులు) మరణాల రేటును 28కి, 2025 కల్లా నియోనటల్ (పుట్టిన నెలరోజులోపు చిన్నారులు) మరణాల రేటును 16కు, గర్భస్థ శిశువు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు మార్చాలని లక్ష్యం.
  • సంతాన సాఫల్య రేటును 2025కల్లా ప్రస్తుతమున్న 2.5 నుంచి 2.1కు తగ్గించాలి.
  • 2018 కల్లా కుష్టు వ్యాధి నిర్మూలన.


గోవా శాసనసభలో బలపరీక్ష నెగ్గిన పరీకర్  :: గోవాలో మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మార్చి 16న జరిగిన బల నిరూపణలో నెగ్గింది. ఈ మేరకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 40 మంది సభ్యులు ఉన్న గోవా అసెంబ్లీలో బలం నిరూపించు కుంది. బీజేపీ నుంచి 12 మంది, గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఎంజీపీల నుంచి ముగ్గురు చొప్పున, ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఎన్సీపీ సభ్యుడు కలిపి మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 ఓట్లు పడ్డాయి. 


టైమ్స్ ఆసియాలో ఐఐఎస్సీకి 27వ ర్యాంకు  :: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో 2017లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ ) 27వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు మార్చి 16న టీహెచ్‌ఈ వెల్లడించిన జాబితాలో ఐఐఎస్సీతో పాటు ఐఐటీ-బాంబే (42వ ర్యాంకు), తమిళనాడులోని వేల్-టెక్ యూనివర్సిటీ (43), ఐఐటీ-ఢిల్లీ (54), ఐఐటీ-మద్రాసు (62) ర్యాంకుల్లో నిలిచాయి. మొత్తంగా ఆసియాలోని టాప్-300 యూనివర్సిటీల జాబితాలో భారత్ నుంచి 33 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. ఇందులో ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 
టీహెచ్‌ఈ ఆసియా ర్యాంకింగ్స్‌లో సింగపూర్ జాతీయ వర్సిటీ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. 


క్యూఎస్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్స్ లో మణిపాల్‌కు చోటు :: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2017లో మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ చోటు దక్కించుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ మార్చి 16న వివరాలను వెల్లడించారు. 2016లో ఫార్మకాలజీ విభాగంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్‌లలో ఈ కళాశాల ప్రథమ స్థానం పొందింది. 


రాజీతోనే ఆయోధ్య వివాదం పరిష్కారం : సుప్రీం కోర్టు  :: అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ మేరకు కేసును తర్వగా విచారించాలంటూ పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి చేసిన అభ్యర్థనపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మార్చి 21న ఈ సూచన చేసింది. ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. 
వివాదాస్పద స్థలానికి సంబంధించిన 2.77 ఎకరాల్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.


ఉచిత గ్యాస్‌కు ఆధార్ తప్పనిసరి  :: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆధార్ లేనివారు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే 2017 ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 
మూడేళ్లలో ఐదు కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు.


ఓన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ జాతికి అంకితం :: గుజరాత్‌లోని ద హేజ్ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్)లో ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ (ఓపాల్)ను ప్రధాని నరేంద్రమోదీ మార్చి 7న జాతికి అంకితం చేశారు. రూ.30,000 కోట్లతో నిర్మించిన ఈ ప్లాంటు దేశంలోనే అతిపెద్ద పెట్రో రసాయనాల ప్లాంటు అని ప్రధాని తెలిపారు. 2018 నాటికి దేశ పాలిమర్ రంగంలో ఓపాల్ వాటా 13 శాతానికి చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ప్రసూతి సెలవుల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం :: ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు-2016కు లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ మేరకు మార్చి 9న కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. దీని ప్రకారం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెరుగుతాయి. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి రెండు కాన్పులకే 26 వారాల ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. మూడో కాన్పుకు 12 వారాలే ఇస్తారు. 
ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. తద్వారా మహిళలకు అత్యధిక ప్రసూతి సెలవులు ఇస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. కెనడా (50 వారాలు), నార్వే (44 వారాల)తో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 
బిల్లులోని ఇతర అంశాలు  :: 
  • చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు.
  • కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని (క్రెచ్) ఏర్పాటు చేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలి.


అవినీతి పెండింగ్ కేసులు రైల్వేలోనే అధికం :: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉందని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. మార్చి 10న వెల్లడైన ఈ వివరాల ప్రకారం రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారులపై 193 కేసులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు - 2017 :: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మార్చి 12న వెలువడ్డాయి. యూపీలో 403 స్థానాలకు గాను బీజేపీ 312 స్థానాల్లో గెలుపొందింది. మిత్రపక్షాలైన అప్నాదళ్, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బీఎస్‌పీ) సీట్లతో కలుపుకుంటే ఆ సంఖ్య 325. ఎస్పీ-కాంగ్రెస్ 54, బీఎస్పీ 19 స్థానాలకే పరిమితమయ్యాయి. 1977లో జనతాపార్టీ యూపీలో అత్యధికంగా 352 సీట్లను గెల్చుకుంది. 
పంజాబ్‌లో కాంగ్రెస్ 77 స్థానాలు సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోగా ఉత్తరాఖండ్‌లో బీజేపీ (56 సీట్లు) ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. గోవా, మణిపూర్‌లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 
మణిపూర్‌లో సీఎం ఇబోబిసింగ్‌పై పోటీ చేసిన ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల ఓడిపోయారు. ఆమెకు కేవలం 90 ఓట్లే వచ్చాయి. దీంతో రాజకీయాల నుంచి వెదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 
ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తించే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇరోమ్ షర్మిల 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్ (పీఆర్‌జేఏ) పార్టీ స్థాపించారు. 




రాష్ట్రాల వారీగా ఫలితాలు  :: 
ఉత్తరప్రదేశ్ ( మొత్తం సీట్లు 403 )
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
312
39.7 శాతం
47
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)
47
21.8శాతం
224
కాంగ్రెస్
07
6.2శాతం
28
బీఎస్పీ
19
22.2 శాతం
80
ఆర్‌ఎల్డీ
01
1.8శాతం
09
ఉత్తరాఖండ్ ( మొత్తం సీట్లు 70)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
57
46.5
31
కాంగ్రెస్
11
33.5
32
బీఎస్పీ
00
7.0
03
యూకేకేడీ
00
0.7
01
మణిపూర్ ( మొత్తం సీట్లు 60)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
21
36.3
00
కాంగ్రెస్
28
35.1
42
టీఎంసీ
01
1.4
07
ఎస్‌పీఎఫ్
04
7.2
04
ఎన్‌పీపీ
04
5.1
00
ఎల్‌జేపీ
01
2.5
01
ఎన్‌సీపీ
00
1.0
01
పంజాబ్ ( మొత్తం సీట్లు 117)
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
03
5.4
12
కాంగ్రెస్
77
38.5
46
ఆప్
20
23.7
--
ఎస్‌ఏడీ
15
25.2
56
గోవా ( మొత్తం సీట్లు 40 )
పార్టీ
2017లో సీట్లు
ఓట్ల శాతం
2012లో సీట్లు
బీజేపీ
13
32.5
21
కాంగ్రెస్
17
28.4
09
జీపీఎఫ్
03
3.5
-
ఎంజీపీ
03
11.3
03
జీవీపీ
0
0.6
02
ఎన్‌సీపీ
01
2.3
-

తమిళనాడు జిల్లా మేజిస్ట్రేట్ పర్యావరణ తీర్పు :: బెయిల్‌పై విడుదలయ్యే వారు తప్పనిసరిగా వంద తుమ్మచెట్లు నరకాలని తమిళనాడులోని అరియలూరు జిల్లా న్యాయస్థానం మార్చి 15న వినూత్న తీర్పు ఇచ్చింది. బెయిల్‌పై వచ్చినవారు చెట్లు నరికినట్లుగా గ్రామ నిర్వాహక అధికారి నుంచి నివేదిక తీసుకుని సమర్పించాలని సూచించింది. 
గత కొన్నేళ్లలో తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మ చెట్లు విసృ్తతంగా పెరిగాయి. వీటి వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటడంతో పాటు గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీనిపై స్పందించిన మద్రాసు హైకోర్టు, మదురై హైకోర్టు బెంచ్‌లు భూగర్భజలాల పరిరక్షణ కోసం తుమ్మ చెట్లను తొలగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాయి. దీంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అరియలూరు కోర్టు ఈ విషయంలో పర్యావరణ అనుకూల తీర్పుచెప్పింది. 

శత్రు ఆస్తుల బిల్లుకు లోక్‌సభ ఆమోదం :: 1968 నాటి శత్రు ఆస్తుల (Enemy Properties) చట్టంలో సవరణలకు లోక్‌సభ మార్చి 14న ఆమోదం తెలిపింది. ఈ మేరకు సభలో ప్రవేశపెట్టిన శత్రు ఆస్తుల (సవరణ, చెల్లుబాటు) బిల్లు - 2016 మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దీని ప్రకారం దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనాకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలివెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. అలాగే ఇక నుంచి ఈ ఆస్తులు ‘Custodian of Enemy Properties of India’ విభాగం అధీనంలో ఉంటాయి. 


రద్దయిన పాత నోట్లు పది కంటే ఎక్కువుంటే జరిమానా :: రద్దయిన రూ. 500, రూ. 1,000 నోట్లను 10 కంటే ఎక్కువ కలిగి ఉంటే ఇకపై జరిమానా పడుతుంది. ఈ మేరకు ఇలా కలిగి ఉండటాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ కేంద్రం తీసుకొచ్చిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్(సెసెషన్ ఆఫ్ లయబిలిటీస్) బిల్లు-2017కు ఫిబ్రవరి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీంతో అదే రోజు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది.

చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.10 వేలు, లేదా కలిగి ఉన్న నోట్ల ముఖ విలువకు ఐదు రెట్లు, వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. అధ్యయనం, పరిశోధన కోసం 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు.

రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ :: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో 29వ అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ మార్చి 1న ప్రారంభమైంది. గంగానది ఒడ్డున వారం రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలను ఉద్దేశించి మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యోగా ఫెస్టివల్‌లో వెయ్యి మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 


తమిళనాడులో కోలా, పెప్సీలపై నిషేధం :: విదేశీ సంస్థలైన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాల అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు వర్తక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిషేధాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. అమెరికా సంస్థ అయిన పెటా వల్లే జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించిందన్నది తమిళనాడు వర్తక సంఘం ఆరోపణ. అందుకే అమెరికాకు చెందిన కోకా కోలా, పెప్సీ శీతల పానీయాలను రాష్ట్రంలో నిషేధించామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

గ్రామాల్లో లింగ నిష్పతి 1,009 :: 2015-16 నాటికి దేశ వ్యాప్త లింగ నిష్పత్తి (ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) 991గా నమోదైంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 1,009గా తేలింది. ఈ మేరకు 2015-16 సంవత్సరానికి నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 (NFHS-4) ఈ వివరాలు వెల్లడించింది. 

లింగనిష్పత్తి వివరాలు  :: 
  • జనన సమయంలో లింగనిష్పత్తి దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో 914 నుంచి 919కి పెరగ్గా పట్టణ ప్రాంతాల్లో 899గా నమోదైంది.
  • ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,018కాగా పట్టణ ప్రాంతాల్లో 1,027 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 880 కాగా, పట్టణ ప్రాంతాల్లో 1,010 గా నమోదైంది.
  • తెలంగాణ మొత్తం జనాభాలో లింగనిష్పత్తి గ్రామీణ ప్రాంతాల్లో 1,035కాగా పట్టణ ప్రాంతాల్లో 976 గా నమోదైంది. అదే జనన సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లింగనిష్పత్తి 865 కాగా, పట్టణ ప్రాంతాల్లో 884 గా నమోదైంది.
  • హరియాణాలో జనన సమయంలో లింగ నిష్పత్తి 762 (2005-06) నుంచి 836కి పెరిగింది. అక్కడి గ్రామాల్లో మాత్రం ఇది 785కే పరిమితమైంది.

ప్రపంచంలోనే ఉన్న సింహాల్లో 70 శాతం భారత్‌లోనే :: ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3న న్యూఢిల్లీలో ప్రపంచ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ దవే మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న మొత్తం సింహాల్లో 70 శాతం మేర భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. సుమారు దేశంలో 2400 సింహాలు ఉన్నాయని తెలిపారు.

కేంద్ర, సమగ్ర జీఎస్‌టీ బిల్లల ముసాయిదాకు ఆమోదం :: కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), సమగ్ర జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) బిల్లుల తుది ముసాయిదాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ (11వ సమావేశం) జీఎస్టీ పరిధి నుంచి రైతులు, చిన్న వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం వ్యవసాయదారులు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరం లేదు. ఏడాదికి రూ. 20 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారులకు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. జీఎస్టీ ముసాయిదా చట్టంలో 40 శాతం వరకు పన్ను (కేంద్రం 20 శాతం, రాష్ట్రం 20 శాతం) విధించాలన్న నిబంధన ఉంటుందని, అయితే అమల్లోకి వచ్చే సగటు పన్ను రేట్లు గతంలో ఆమోదించిన 5, 12, 18, 28 శాతాలుగానే ఉంటాయని కేంద్రం పేర్కొంది. 

అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం :: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన అత్తారీలో దేశంలోనే అత్యంత ఎత్తయిన జాతీయ పతాకాన్ని మార్చి 5న ఆవిష్కరించారు. స్తంభం పొడవు 110 మీటర్లు (360 అడుగులు) కాగా బరువు 55 టన్నులు. జెండా పొడవు 120 అడుగులు, వెడల్పు 80 అడుగులు. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి కూడా జెండాను చూడొచ్చు.

మొదట జార్ఖండ్ రాజధాని రాంచీలో దేశంలోనే ఎత్తయిన జాతీయ జెండాను (293 అడుగులు) నెలకొల్పారు. ఈ ఘనతను అధిగమిస్తూ తెలంగాణలోని హైదరాబాద్‌లో 300 అడుగుల ఎత్తయిన స్తంభం ఏర్పాటు చేశారు.


తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా తిరువనంతపురం :: కేరళ రాజధాని తిరువనంతపురం దేశంలోనే తొలి ప్లాస్టిక్ రహిత నగరంగా నిలవనుంది. ఈ మేరకు నగర పాలక పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై మార్చి 1 నుంచి నిషేధాన్ని విధించింది. ఇకపై నగరంలో నిర్వహించే ఏ వేడుక, ఉత్సవంలోనూ ప్లాస్టిక్‌తో తయారయ్యే సంచులు, ప్లేట్లు, గ్లాసులు, పాలిథీన్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. 


పంచాయతీల్లో లింగ సమానత్వానికి కేబినెట్ ఆమోదం :: పంచాయతీల్లో మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా భారత్-ఐక్యరాజ్యసమితి మధ్య జరిగిన అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్చి 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ (మంత్రిత్వ శాఖ) ద్వారా పాలనా సంస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఎన్నికై న మహిళా ప్రతినిధుల సామర్థ్య నిర్మాణానికి, సాధికారత కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడతారు. మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలను అమలు చేస్తారు. 


ఐఐఎస్సీకి ప్రపంచ ఎనిమిదో ర్యాంకు ::యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) మార్చి 6న ప్రకటించిన ఉత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్‌‌సలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్సీ) 8వ ర్యాంకు సాధించింది. 2017లో ‘ఉత్తమ చిన్న విశ్వవిద్యాలయాలు’ విభాగంలో ఐఐఎస్సీకి ఈ ర్యాంకు దక్కింది. తద్వారా ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీలో జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్న భారతీయ విశ్వవిద్యాలయంగా ఐఐఎస్సీ గుర్తింపు పొందింది. 5 వేల మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలను చిన్న వర్సిటీలుగా పరిగణిస్తారు. 

మొదటి మూడు స్థానాల్లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అమెరికా), ఎకోలే నార్మలే సుపీరియర్ (ఫ్రాన్‌‌స), పొహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (దక్షిణ కొరియా)లు ఉన్నాయి. 2015-16లో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో టీహెచ్‌ఈ ప్రకటించిన టాప్ 100 వర్సిటీల్లో దేశం నుంచి మొదటి సారి ఐఐఎస్సీ చోటు దక్కించుకొని 99వ స్థానంలో నిలిచింది. 


వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభించిన ఎస్‌బీఐ ::ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పిస్తూ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) మార్చి 7న కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర సమయాల్లో మొబైల్ పరికరాల ద్వారా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేందుకు తోడ్పడే ఈ విధానాన్ని బ్యాంక్ బోర్డు ఇటీవలే ఆమోదించింది. ఇందుకోసం ఉపయోగించే మొబైల్ డివైజ్‌లలోని యాప్స్, డేటా సురక్షితంగా ఉండేలా మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీలను వినియోగించుకోనుంది. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ఫిర్యాదుల పరిష్కార అప్లికేషన్‌‌స మొదలైన వాటిని కూడా వర్క్ ఫ్రం హోమ్ సర్వీసుల్లో పొందుపర్చనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

దేశంలో మహిళల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాంకు ఐసీసీఐ.