Friday, 1 December 2017

అక్టోబర్ 2017 జాతీయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 9, 14 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అలాగే... హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగానే డిసెంబర్ 18న గుజరాత్ ఎన్నికలకు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ఏకే జోతి అక్టోబర్ 25న వెల్లడించారు. 
182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 50,128 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ధ్రువీకరణ పత్రాల (వీవీపీఏటీ)తో కూడిన ఈవీఎంలతో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక పూర్తిస్థాయి మహిళా పోలింగ్ కేంద్రాన్ని ఈసారి ఏర్పాటు చేయనున్నారు. 

నవంబర్ 8న ‘నల్లధన వ్యతిరేక దినం’నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నవంబర్ 8తో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజును ‘నల్లధన వ్యతిరేక దినం’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నల్లధనం వ్యతిరేక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు పాల్గొంటారని ఆయన మీడియాకు వెల్లడించారు. 
మరోవైపు నవంబర్ 8న ‘బ్లాక్ డే’గా జరుపుకోవాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా 18 పార్టీలు పిలుపునిచ్చాయి. 


బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో ఖరారుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్‌లో గెలిచాడు. ఈ మేరకు సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. 
ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. 
 

ఆధార్ లింక్ గడువు మార్చి 31 వరకు పొడగింపువివిధ పథకాల ద్వారా లబ్ధిపొందడానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును ఇప్పటికీ ఆధార్ లేని వారికి (కొత్తగా నమోదు చేసుకొని లింక్ చేసుకోవాలి) మాత్రమే పెంచుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనానికి అక్టోబర్ 25న వివరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎంకే ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. 


న్యూఢిల్లీలో అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అంతర్జాతీయ వినియోగదారుల వ్యవహారాల సదస్సు అక్టోబర్ 26న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కఠినంగా వ్యవహరించేలా త్వరలోనే కొత్త వినియోగదారుల చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. 


బోర్డింగ్ పాస్‌తో ఆధార్ కార్డు అనుసంధానం బోర్డింగ్ పాస్, తనిఖీల వంటివేవీ లేకుండా నేరుగా విమానం ఎక్కే వ్యవస్థ త్వరలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టికెట్ బుకింగ్‌ను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకోగానే ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా బోర్డింగ్, సెల్ఫ్ చెకిన్, బ్యాగేజ్ వంటివి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు హైదరాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలియజేసింది. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం.. ఫేస్ రికగ్నిషన్, వేలిముద్ర, ఐరిస్ వంటి వాటిని పరిశీలించామని, వీటిల్లో ఆధార్ అనుసంధానం ద్వారా ముఖ గుర్తింపు వ్యవస్థను ఎంచుకున్నామని ఎయిర్‌పోర్టు సీఈఓ కిశోర్ వెల్లడించారు. 2 నెలల్లో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఆరంభిస్తామని, ఫలితాలు పరిశీలించాక, నియంత్రణ సంస్థల అనుమతి తీసుకున్నాక ఈ సేవల్ని ఆరంభిస్తామని తెలియజేశారు. దశల వారీగా బెంగళూరుతో పాటూ ఇతర విమానాశ్రయాలకూ దీన్ని విస్తరిస్తామని చెప్పారు.

అత్యాధునిక ఆయుధాలకు 40 వేలకోట్లుఅత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు భారత ఆర్మీ రూ.40 వేల కోట్లు వెచ్చించనుంది. ఇందులో భాగంగా 7 లక్షల రైఫిళ్లు, 44 వేల తేలికపాటి మెషిన్ గన్లు (ఎల్‌ఎంజీ), దాదాపు 44,600 కార్బైన్లను ఆర్మీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు సరిహద్దులో చైనా, పాకిస్తాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు అవసరమని ఆర్మీ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.


రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్ అనుసంధానం’ పిటిషన్వివిధ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధ్దికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ చివరి వారంలో విచారిస్తుందని సుప్రీంకోర్టు అక్టోబర్ 30న వెల్లడించింది. అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ విజ్ఞప్తి మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది.


పటేల్ 142వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 142వ జయంతి వేడుకలను అక్టోబర్ 31న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం నుంచి.. ఇండియాగేట్ వరకు జరిగిన ఐక్యతా పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోదీ... తొలి కేంద్ర హోం మంత్రి రాజనీతిజ్ఞత, రాజకీయ చతురత కారణంగానే దేశం నేడు ఐక్యంగా ఉందని అన్నారు. 


కర్ణాటకలో ఉపేంద్ర "ప్రజ్ఞావంత జనతా పార్టీ"కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 31న ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు. 


రోడ్డు ప్రమాద కేసులపై వయసు ఆధారంగా పరిహారం రోడ్డు ప్రమాద బాధితులకు అందాల్సిన పరిహారంపై అక్టోబర్ 31న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. బాధితుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి పరిహారం అందాలని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇన్సూరెన్‌‌స సంస్థలు బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై వేసిన పిటిషన్లను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. 
తీర్పు వివరాలు..
  • బాధితుడు పర్మినెంట్ ఉద్యోగి అయి అతని వయసు 40 ఏళ్ల లోపు ఉన్నట్లయితే.. అతడి భవిష్యత్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ వేతనం (యాక్చువల్ శాలరీ) లో 50 శాతం అదనంగా చెల్లించాలి.
  • బాధితుడి వయసు 40-50 ఏళ్లలోపున్నట్లయితే 30 శాతం అదనంగా, 50-60 ఏళ్ల లోపుంటే 15 శాతం అదనంగా చెల్లించాలి.
  • బాధితుడు స్వయం ఉపాధి లేదా నిర్ణీత వేతన జీవి అయి 40 ఏళ్ల లోపు వాడైతే.. ఎస్టాబ్లిష్డ్ ఆదాయానికి అదనంగా 40 శాతం చెల్లించాలి.
  • రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితుడు చనిపోయిన పక్షంలో.. అతని అంత్యక్రియలకు రూ.15వేలు చెల్లించాలి. ఇది కూడా ప్రతీ మూడేళ్లకోసారి 10 శాతం పెరుగుతుంది.

ఆధార్ లేదని రేషన్ నిరాకరించొద్దుప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు అందించే రేషన్ సరుకులను ఆధార్ లేదని, రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం కాలేదనే కారణాలతో నిరాకరించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సాకులతో లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించరాదని అక్టోబర్ 26న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. జార్ఖండ్‌లో రేషన్ సరుకులు నిరాకరించడంతో ఓ కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక ఆకలిని తట్టుకోలేక మరణించిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

వినియోగదారుల పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సుయునెటైడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఆధ్వర్యంలో వినియోగదారుల పరిరక్షణపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 26న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సవరించి కొత్త చట్టం తీసుకొస్తామన్నారు.

భారత్‌లో కాలుష్యంతో 25 లక్షల మంది మృతి ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే అత్యధికమని అగ్రశ్రేణి వైద్య పత్రిక ది లాన్సెట్ పేర్కొంది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది చనిపోతే, ఒక్క భారత్‌లోనే 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని వెల్లడించింది. ఈ జాబితాలో 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉందన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు అమెరికాకు చెందిన ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 
ప్రపంచ వ్యాప్తంగా 2015లో వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోతే, నీటి కాలుష్యంతో 18 లక్షల మంది, పని ప్రదేశంలో కాలుష్యంతో 8 లక్షల మంది దుర్మరణం చెందారని నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తున్న భారత్, చైనా, పాక్, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యాల్లో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే మరణించారు. 


కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ అక్టోబర్ 19న దీపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకున్న ప్రధాని మోదీ అక్టోబర్ 20న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథుడికి రుద్రాభిషేకం చేశారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యాలు మెరుగుపరచటం, మందాకినీ, సరస్వతి నదుల రిటైనింగ్ వాల్స్, ఘాట్‌ల నిర్మాణం, దేవాలయానికి వెళ్లే రోడ్డును పునర్నిర్మించటం, వరదల్లో ధ్వంసమైన ఆది గురు శంకరాచార్య సమాధిని పునరుద్ధరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్‌ను అభిమాన పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. 2022 కల్లా ఈ రాష్ట్రం పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
అండమాన్‌లో వేడుకల్లో నిర్మలా బంగాళాఖాతంలోని అత్యంత వ్యూహాత్మక త్రివిధ దళాల కేంద్రమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సైనికులతో కలిసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భద్రతా సన్నద్ధతను సమీక్షించారు. అండమాన్ నికోబార్ కమాండ్ ఏరియా ప్రాంతంలోని కోస్ట్ గార్డ్ బేస్, నౌకాదళ కేంద్రాలనూ ఆమె సందర్శించారు. 


గుజరాత్‌లో రోరో ఫెర్రీ సర్వీసులు ప్రారంభం సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లను జలమార్గంతో అనుసంధానించే ‘రోరో’ ఫెర్రీ సర్వీసులను (రోల్ ఆన్-రోల్ ఆఫ్) ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న ప్రారంభించారు. భరూచ్ జిల్లా ఘోఘా- భావ్‌నగర్ జిల్లా దహేజ్ మధ్య ఈ సేవలు నడుస్తాయి. 100 మంది అంధ విద్యార్థులతో కలిసి ఘోఘా నుంచి దహేజ్ వరకూ ఫెర్రీలో ప్రధాని ప్రయాణించారు. మొదటి దశ ఫెర్రీ సేవల్ని కేవలం ప్రయాణికుల కోసమే ప్రారంభించారు. రెండు నెలల అనంతరం ప్రారంభమయ్యే రెండో దశలో కార్లు వంటి తేలికపాటి వాహనాల్ని కూడా తరలించవచ్చు. ఈ ఫెర్రీ సేవలతో ఘోఘా-భరూచ్‌ల మధ్య రోడ్డు మార్గం ద్వారా ఉన్న దూరం 330 కి.మీ. కాగా, జలమార్గంలో అది కేవలం 30 కి.మీ. మాత్రమే. 


ఎయిర్‌పోర్టుల భద్రతకు సోషల్ మీడియా దేశంలోని ఎయిర్‌పోర్టులు, అణువిద్యుత్, అంతరిక్ష కేంద్రాల వద్ద భద్రత పర్యవేక్షణ, పటిష్టానికి తొలిసారిగా సోషల్ మీడియా సమాచారాన్ని వినియోగించబోతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతా విభాగం(సీఐఎస్‌ఎఫ్) చెన్నై సమీపంలోని అరక్కోణం వద్ద సోషల్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శిక్షణ పొందిన సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు సోషల్ మీడియా ట్రెండ్‌‌స, వార్తలు, నివేదికలు, ఇతర సమాచారాన్ని సమన్వయపరిచి ఎయిర్‌పోర్టులు, ఇతర కీలక సంస్థలకు వాటిని ఎప్పటికప్పుడు చేరవేస్తారు. ఇందుకోసం ట్వీటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఫ్లికర్‌ల సేవల్ని వాడుకోనున్నారు. 


100 సీసీ లోపు బైక్‌లపై డబుల్స్ నిషేధం100 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఒకవేళ వెనక సీటు ఉంటే కొత్త వాహనాల(100 సీసీ కంటే తక్కువ) రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అక్టోబర్ 13న ఆ రాష్ట్ర రవాణా శాఖ జీవో విడుదల చేసింది. ఒక రోడ్డు ప్రమాదం కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారు. అలాగే 100 సీసీ లోపు వాహనాలకు వెనుక సీట్లు ఉంటే కొత్తగా రిజిస్టర్ చేయవద్దని, ఇప్పటికే రిజిస్టర్ చేసి ఉంటే వెనుక సీట్లలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


జాతీయ గీతం ప్రసార నిబంధనల మార్పునకు సుప్రీంకోర్టు సూచన సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరంది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

లక్నో-ఆగ్రా హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) ‘టచ్ అండ్ గో’ పేరుతో కసరత్తులు నిర్వహించింది. ఈ మేరకు ఐఏఎఫ్ యుద్ధ, రవాణా విమానాలు అక్టోబర్ 24న ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి. లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్ జిల్లా బంగర్‌మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్-2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం పాలుపంచుకున్నాయి. 
సీ-130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఎక్స్‌ప్రెస్ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్-2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ‘టచ్ అండ్ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై ఆరు సుఖోయ్-30 జెట్‌లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి. 


రైతుల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకంరైతులకు దన్నుగా ఉండాలనే లక్ష్యంతో అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘భవంతర్ భుగ్దాన్ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, వ్యాపారి సరకును కొనే మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తుంది.

అఖిల భారత ఆయుర్వేద సంస్థ ప్రారంభంఢిల్లీలో నిర్మించిన తొలి అఖిల భారత ఆయుర్వేద సంస్థను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 17న (ఆయుర్వేద దినోత్సవం) జాతికి అంకితం చేశారు. అనంతరం ప్రసంగించిన ఆయన తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్య విధానాల కిందఆరోగ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగా గత మూడేళ్లలో 65 ఆయుష్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామన్నారు.

ఏడవ వేతన సంఘం సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఆమోదంఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసులను అమలుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అక్టోబర్ 11న సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా యూజీసీ నిధులతో నడిచే 106 యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే 329 యూనివర్సిటీలు, వర్సిటీలకు అనుబంధంగా ఉన్న 12,912 ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లోని 7.58 లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లు, బోధన సిబ్బందికి లబ్ధి జరుగుతుంది. వీరితోపాటుగా 119 కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్‌సీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీఐఈల్లోని ఉపాధ్యాయులకూ వేతనాలు పెరుగుతాయి. 
ఈ వేతన సవరణ అమలు వల్ల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, అకడమిక్ ఉద్యోగుల వేతనాల్లో రూ.10,400 నుంచి 49,800 వరకు పెంపుదల ఉంటుంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే విద్యాసంస్థల్లో వేతన సవరణ మార్పులకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం అవసరం. అయితే.. మార్చిన తర్వాత పెరిగే వేతనాల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,800 కోట్ల భారం పడుతుంది. 
 

సంకల్ప్, స్ట్రైవ్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం రూ.6,655 కోట్ల ప్రపంచబ్యాంకు ఆర్థికసాయంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకొచ్చే సంకల్ప్ (స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్‌‌జ అవేర్‌నెస్ ఫర్ లైవ్‌లీహుడ్ ప్రమోషన్), స్ట్రైవ్ (స్కిల్ స్ట్రెంతెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్‌హాన్‌‌సమెంట్) పథకాలకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 11న ఆమోదం తెలిపింది. అలాగే.. వచ్చే మూడునుంచి ఐదేళ్లలో 3 లక్షల మంది భారత యువతను ఉద్యోగ శిక్షణ కోసం జపాన్‌కు పంపాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ఇందుకు అవసరమైన ఖర్చులను జపాన్ భరిస్తుంది. ప్రభుత్వేతర సంస్థగా ఉన్న అంతర్జాతీయ సముద్రయాన విభాగం ఐఏఎల్‌ఏను ప్రభుత్వ సంస్థగా (వివిధదేశాల మధ్య సముద్ర బంధాలు పెరిగేలా) మార్చాలన్న ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 


మైనర్ భార్యతో కాపురం అత్యాచారమే: సుప్రీం కోర్టుమైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం నేరమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 15-18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీలోని సెక్షన్ 375లోని మినహాయింపు-2 చెబుతోందని.. చట్టంలో ఇలాంటి మినహాయింపునివ్వడం నిరంకుశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం అక్టోబర్ 11న వెలువరించిన తీర్పులో పేర్కొంది. పార్లమెంటు ఏ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించింది. బాలికల హక్కులు కాలరాసినట్లే
‘అన్ని చట్టాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అయితే ఐపీసీలో మాత్రం 18 ఏళ్లలోపు భార్యతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించకుండా మినహాయించడం నిలకడలేని, నిరంకుశ నిర్ణయం. ఇది బాలికల హక్కులను కాలరాసినట్లే’అని జస్టిస్ దీపక్ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. మినహాయింపునివ్వడం రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణలను ఉల్లంఘించడమే అని తెలిపారు. 
చెల్లని వివాహాల రద్దు ఎలా? హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లోని నిబంధనలు బాల్య వివాహ నిషేధ చట్టాన్ని (పీసీఎంఏ) అపహాస్యం చేసేలా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ముస్లిం వివాహాల రద్దు చట్టం - 1939 ప్రకారం.. 15 ఏళ్ల లోపున్న బాలికకు వివాహం జరిగితే, ఆమె 18 ఏళ్లు నిండక ముందే, అది కూడా భర్తతో శృంగార జరగకపోతేనే విడాకులను కోరొచ్చు. ‘బాలిక మేజర్ కాక ముందే, అది కూడా శృంగారం జరగకపోతేనే విడాకులు కోరొచ్చన్న నిబంధన ఈ చట్టాన్ని అపహాస్యం పాలుచేస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇక హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం.. తనకు 15 ఏళ్లలోపు జరిగిన వివాహాన్ని బాలిక 15 ఏళ్లు దాటిన తరువాత, 18 ఏళ్లు నిండక ముందు రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేయొచ్చని తెలిపింది. అసలు 15 ఏళ్లలోపు వివాహం చెల్లదని, దాని రద్దుని కోరే ప్రశ్నే ఉత్పన్నం కావొద్దని పేర్కొంది.
తీర్పులోని ప్రధానాంశాలు
  • భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 375కు ధర్మాసనం సవరణ చేసింది. ఈ సెక్షన్ రాజ్యాంగంలోని అధికరణం 14, 15, 21లను ఉల్లంఘిస్తోందంది.
  • చిన్నారుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన అన్ని చట్టాల్లో సమరూపత ఉండాలని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలితో ఉన్న బంధానికి అతీతంగా ఒక రేపిస్టు ఎప్పటికీ రేపిస్టేనన్న యూరోపియన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యలను ఉటంకించింది.
  • 18 ఏళ్ల లోపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొన్న భర్తను నేరస్తుడిగా పరిగణించనందుకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సామాజిక సంక్షేమ పథకాలపై ఆకట్టుకునే నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదనీ, వాటి అమల్లోనూ చిత్తశుద్ధితో పనిచేయాలంది.
ఇదీ చరిత్ర..
1860:
 వివాహానికి బాలికకు కనీస వయసును నిర్ధారించకున్నా, భర్తతో శృంగారానికి అంగీకరించడానికి కనీస వయసు 10 ఏళ్లుగా నిర్ణయం.
1891: ఈ వయసు 12 ఏళ్లకు పెంపు. 
1925: శృంగారానికి అంగీకరించేందుకు కనీస వయసు 14 ఏళ్లకు పెంపు, ఐపీసీ సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపును 13 ఏళ్లకు పెంచారు. 
1929: బాల్య వివాహ నియంత్రణ చట్టానికి ఆమోదం. వివాహానికి, శృంగారానికి కనీస వయసు 14 ఏళ్లుగా నిర్ధారణ. సెక్షన్ 375లో ఇచ్చిన మినహాయింపుకు ఎలాంటి మార్పు చేయలేదు. 
1940: ఐపీసీకి చేసిన సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లకు పెంపు. సెక్షన్ 375 మినహాయింపు కింద 15 ఏళ్లకు పెంచారు. వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం వివాహానికి బాలికల కనీస వయసు కూడా 15 ఏళ్లుగా నిర్ణయం. 
1978: ఐపీసీ సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లుగా నిర్ణయం. మినహాయింపు కింద వివాహ కనీస వయసు 15 ఏళ్లలో మార్పు లేదు. మహిళకు వివాహ కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
2013: నిర్భయ ఘటన నేపథ్యంలో శృంగారానికి కనీస వయసు 18 ఏళ్లకు పెంపు.
చాలా దేశాల్లో నేరంప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నారు. యూరోప్‌లో 22 దేశాల్లో, ఉభయ అమెరికా ఖండాల్లో 22 దేశాల్లో, ఆఫ్రికాలో 11 దేశాల్లో, ఆసియా, ఆస్ట్రేలియాల్లో కలిపి.. 15 దేశాల్లో మారిటల్ రేప్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు. భర్త బలాత్కారాన్ని నేరంగా పరిగణించిన తొలిదేశం పోలండ్. 1932లో పోలండ్ ఈ మేరకు చట్టం చేసింది. అమెరికాలో 1970లో మొదలై 1993 దాకా మొత్తం 50 రాష్ట్రాలూ దీన్ని నేరం చేశాయి. మహిళలపై హింసకు వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ పార్లమెంటు తీర్మానం చేసి.. మారిటల్ రేప్‌ను నేరంగా చేయాలని పిలుపునిచ్చింది. దాంతో ఫ్రాన్‌‌స, జర్మనీ, నెదర్లాండ్‌‌స, బెల్జియం తదితర దేశాలు మినహాయింపును ఎత్తివేశాయి. 1991లో బ్రిటన్ ఈ పనిచేసింది. మన పొరుగునున్న చిన్నదేశం నేపాల్ 2002లోనే మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని సమాన రక్షణ, వ్యక్తిగత గోప్యత హక్కులను ఈ మినహాయింపు ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తేల్చడంతో నేపాల్ ప్రభుత్వం చట్టాలను మార్చింది.

హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 12న ప్రకటించింది. నవంబర్ 9న ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 68 నియోజకవర్గాలకు ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది. ఆలోపే (డిసెంబర్ 18) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలుంటాయని తెలిపింది. 
హిమాచల్ ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు ఓటు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని 7,479 పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. 

మైనర్ భార్యతో శృంగారానికి శిక్షలు ఖరారు 
మైనర్ భార్యతో శృంగారాన్ని నేరంగా ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ నేరానికి శిక్షలను ఖరారు చేసింది. ఈ విధమైన శృంగారంలో పాల్గొన్న వారికి ఐపీసీ ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష లేదా బాలలను అత్యాచార నేరాలనుంచి కాపాడే (పోస్కో) చట్టం ప్రకారం జీవిత ఖైదు విధించాలంది. 15-18 ఏళ్ల వయసున్న భార్యలపై శృంగారం విషయంలో ఐపీసీ 375 సెక్షన్‌లోని మినహాయింపు 2ను (భర్తల శిక్షకు సంబంధించిన) సవరించాలని సుప్రీంకోర్టు సూచించింది.


ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానంఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI) విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ-2017లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మొత్తం 119 దేశాలతో సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ నివేదికలో భారత్ ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఇరాక్ కన్నా వెనుక స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కన్నా కొంచెం మెరుగైన ర్యాంకు సాధించింది. భారత్‌లో ఆకలికి ముఖ్యమైన కారణం పిల్లల్లో అధిక శాతం పౌష్టికాహార లోపమని, దీన్ని తగ్గించాలంటే సమాజం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. గతేడాది భారత్ 97వ స్థానంలో ఉంది. 
2017 జాబితాలో చైనా (29), నేపాల్ (72), మయన్మార్ (77), శ్రీలంక (84), బంగ్లాదేశ్ (88)తో స్థానాల్లో ఉన్నాయి. పాక్(106), అఫ్గానిస్తాన్ 107వ ర్యాంకుతో భారత్ కన్నా వెనుక ఉన్నాయి. ఉత్తర కొరియా 93, ఇరాక్ 78వ స్థానంలో ఉన్నాయి.


ఐలయ్య పుస్తకాన్ని నిషేధించలేం:సుప్రీంకోర్టు కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు- కోమటోళ్లు’ను నిషేధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు అని, రచయితకు వ్యక్తిగతంగా తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. 

పట్నా వర్సిటీ వందేళ్ల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని బిహార్‌లోని పట్నా యూనివర్సిటీ వందేళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తద్వారా వందేళ్ల చరిత్రలో యూనివర్సిటీలో జరిగిన వేడుకలకు హాజరైన తొలి ప్రధానమంత్రిగా మోదీ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... యూనివర్సిటీల సంకెళ్లను తెంచి ప్రపంచంలోనే ఉత్తమ విద్యాకేంద్రాలుగా మార్చేందుకు దేశంలోని 20 వర్సిటీలకు రూ.10వేల కోట్లు కేటాయించనున్నట్లు స్పష్టంచేశారు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు వర్సిటీలకు ఐదేళ్లపాటు రూ.10వేల కోట్లు). పాత పద్ధతిలో కొనసాగే విద్యావిధానాన్ని పక్కనబెట్టి.. యువత ఆలోచనలను అత్యాధునిక సమాచారం, సృజనాత్మకతతో కూడిన విద్యావిధానంపై వర్సిటీలు దృష్టిపెట్టాలని మోదీ కోరారు. ఈ 20 యూనివర్సిటీల ఎంపిక ప్రభుత్వాలు, పార్టీల చేతుల్లో కాకుండా థర్డ్‌పార్టీ ప్రొఫెషనల్ ఏజెన్సీతో జరుగుతుందన్నారు. 

గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ 1.93 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందింది. బీజేపీ ఎంపీ వినోద్ ఖన్నా హఠాన్మరణంతో (ఏప్రిల్‌లో) ఖాళీ అయిన ఈ స్థానానికి అక్టోబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. అక్టోబర్ 15న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కడ్ 4,99,752 ఓట్లు సంపాదించగా.. బీజేపీ అభ్యర్థి స్వరన్ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్ అభ్యర్థి సురేశ్ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయారు. ఆర్నెల్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

ఢిల్లీలో హార్లే డేవిడ్సన్ యూనివర్సిటీ అమెరికాకు చెందిన ఖరీదైన బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ భారత్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ ద్వారా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేసి టెక్నికల్, నాన్‌టెక్నికల్ కోర్సులలో శిక్షణ ఇస్తారు. అంతేకాక శిక్షణ పొందినవారిని ఉద్యోగులుగా చేర్చుకోవడం, డీలర్‌షిప్‌లను ఇవ్వడం వంటివి కూడా అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఏషియా పసిఫిక్ రీజియన్‌లలో మూడు యూనివర్సిటీలు ఉండగా, తాజాగా భారతదేశ రాజధాని ఢిల్లీలో నాలుగో యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు హార్లే డేవిడ్సన్ ఇండియా చైనా సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ పీటర్ మాక్ కెన్‌‌జ తెలిపారు. టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు యూనివర్సిటీ నిర్వహణ, ఫైనాన్‌‌స, బ్రాండింగ్ వంటి కోర్సులను అందిస్తామని, రాబోయే కొన్ని వారాల్లోనే యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. 

పీపీపీ పద్ధతిలో మైక్రో ఇరిగేషన్ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడమే లక్ష్యంగా అన్ని రాష్ట్రాల్లో మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ నీటి పారుదల) సాగు విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో దీనిని అమల్లోకి తేనుంది. ఇందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్‌తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అక్టోబర్ 16న పంపించింది. ఈ మార్గదర్శకాలపై అభిప్రాయాలను నెల రోజుల్లోగా తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. 
69 మిలియన్ హెక్టార్లలో ‘సూక్ష్మ’ సాగే లక్ష్యం ప్రస్తుతం ఒక్కో రైతుకు మైక్రో ఇరిగేషన్ సాగుకు ఐదు హెక్టార్ల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిని పది హెక్టార్లకు పెంచాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అలాగే... దేశంలో 160 మిలియన్ హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉంటే దాదాపు 65 మిలియన్ హెకార్లకు సాగునీరు అందుతోంది. ఇందులో కేవలం 8.6 మిలియన్ హెక్టార్లలోనే మైక్రో ఇరిగేషన్ విధానంలో సాగవుతున్నాయి. మైక్రో ఇరిగేషన్‌లో భాగంగా 4.7 మిలియన్ హెక్టార్లలో స్ప్రింకర్ల ద్వారా, 3.9 మిలియన్ హెక్టార్లలో డ్రిప్ ద్వారా సాగు చేస్తున్నారు. దేశంలో 69 మిలియన్ హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ సాగులోకి తేవాలని లక్ష్యంగా ఈ పీపీపీ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని కేంద్రం రూపొందించింది. 


ముంబై ఎయిర్‌పోర్ట్ చిత్రంతో పోస్టల్ స్టాంపుల విడుదల వాణిజ్య రాజధాని ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 75 వసంతాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తపాలాశాఖ విమానాశ్రయం ముఖచిత్రంతో రెండు పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 
1932 అక్టోబరు 15న జంజీర్ రతన్‌జీ దాదాబాయ్ టాటా మొదటి సారి సింగిల్ ఇంజిన్ విమానాన్ని కరాచీ నుంచి ముంబైకి నడిపారు. తరువాత రతన్‌జీ స్నేహితుడు మాజీ పెలైట్ నివిల్ విన్సెంట్ మద్రాసుకు నడిపారు. స్టాంపుపై రద్దీగా ఉన్న విమానాశ్రయ చిత్రంతోపాటు, ప్రయాణికులు దిగే చిత్రాన్ని ముద్రించారు. రూ.5, రూ.15 ముఖవిలువతో ఈ స్టాంపులను విడుదల చేశారు. విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత 1942 నుంచి దీనిని మిలటరీ పనులకు వినియోగించారు. స్వాంతంత్య్రం వచ్చిన తరువాత పౌర సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టెర్మినల్ నుంచి రోజూ 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి నాలుగున్నర కోట్ల మంది దీని ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. 


డెంగీ వ్యాప్తిపై చెన్నైలో 12.5 లక్షల మందికి జరిమానా చెత్తకుప్పలు, మురికిగుంటలు తొలగించకపోవడం ద్వారా ప్రాణాంతక డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 12.5 లక్షల మంది చెన్నై వాసులకు అక్టోబర్ 12న తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. అలాగే 2.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో డెంగీ మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఇకపైనా ఇదే పరిస్థితి కొనసాగితే రూ.5 వేలు, ఆ తరువాత రూ.10 వేల చొప్పున జరిమానా వసూలు చేస్తామని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ కార్తికేయన్ హెచ్చరించారు. 


నియంతృత్వ పాలన కోరుకుంటున్న 55 శాతం భారతీయులు 
భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16-మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్ సేకరించింది. 
మరిన్ని వివరాలు.. 
  • సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు.
  • 27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు.
  • 50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు.
  • కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పారు.
  • పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు.


48వ గవర్నర్ల సదస్సు 48వ గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 12న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ పాల్గొన్నారు. 27 మంది గవర్నర్లు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు హాజరయ్యారు. ‘నవ భారత్-2022’ లక్ష్యాలైన వసతులు, ప్రజాసేవ, రాష్ట్రాల్లో ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై సదస్సులో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

బెంగళూరులో తల్లిపాల నిధి శిశువులకు తల్లి పాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించేందుకు తల్లి పాల నిధిని బెంగళూరులోని మదర్ థెరిసా రోడ్డులో అక్టోబర్ 9న అందుబాటులోకి తెచ్చారు.

జమిలి ఎన్నికలకు సిద్ధం: ఎన్నికల సంఘంశాసనసభ, లోక్‌సభ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించేందుకు 2018 సెప్టెంబరు నాటికి సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషన్ (ఈసీ) అక్టోబర్ 4న పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఏమేం కావాలో తెలపాలని కేంద్రం ఈసీని అడిగింది. దీంతో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీపీఏటీ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) యంత్రాల కొనుగోలుకు నిధులు కావాలని ఈసీ కోరగా ఆ మేరకు వీవీపీఏటీ యంత్రాల కొనుగోలు కోసం రూ.3,400 కోట్లు, ఈవీఎంల కొనుగోలు కోసం రూ.12 వేల కోట్లు కేంద్రం మంజూరు చేసింది. దీంతో అవసరమైన సామాగ్రితో వచ్చే సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంటామని ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ తెలిపారు.


పర్యాటక ప్రచారానికి పర్యటన్ పర్వ్దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం అక్టోబర్ 4న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పర్యాటక శాఖ పర్యటన్ పర్వ్’ పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు పాల్గొంటాయి. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంతో పాటు, పర్యాటక రంగం ప్రయోజనాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు.


సైబర్ వేధింపుల బాధితుల్లో ముంబైది మొదటి స్థానంఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్న బాధితుల సంఖ్యలో ముంబై అగ్రస్థానంలో ఉందని నార్టన్ బై సెమాంటిక్ అక్టోబర్ 5న వెల్లడించింది. ఈ జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. కంప్యూటర్ భద్రత సాఫ్ట్‌వేర్ తయారు చేసే ఈ సంస్థ ఆన్‌లైన్ వేధింపుల తీరుతెన్నులపై ఇటీవల ఓ అధ్యయనం జరిపింది. దేశంలోని ప్రతి 10 మంది ఆన్‌లైన్ వినియోగదారుల్లో 8 మంది ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించింది.


గాంధీజీ హత్య కేసులో అమికస్ క్యూరీ నియామకంమహాత్మా గాంధీ హత్య కేసును పునర్విచారించేందుకు సుప్రీంకోర్టు అక్టోబర్ 6న అంగీకరించింది. ఈ మేరకు మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అమరేందర్ శరణ్‌ను అమికస్ క్యూరీగా నియమిస్తున్నట్లు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది.
గాంధీ హత్యపై పునర్విచారణ జరపాలంటూ అభినవ భారత్ సంస్థ ట్రస్టీ డా.పంకజ్ ఫడ్నీస్ పిటిషన్ దాఖలు చేశారు. 1949లో గాడ్సేతో పాటు నారాయణ్ ఆప్టేల పిటిషన్లను తూర్పు పంజాబ్ హైకోర్టు తిరస్కరించిన అనంతరం ఈ కేసును సుప్రీం కోర్టు అసలు విచారించనేలేదని, 1966లో ఏర్పాటు చేసిన జేఎల్ కపూర్ కమిషన్ తన నివేదికను అత్యున్నత ధర్మాసనానికి సమర్పించలేదని ఫడ్నీస్ తెలిపారు.


అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంగా బుడ్గె బుడ్గె కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో జైపూర్‌లోని బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం తొలి స్థానంలో నిలిచింది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్‌ఎఫ్‌తో రికార్డు సాధించింది. తెలంగాణలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది. 
ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్‌ఎఫ్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్‌ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 


ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై తాత్కాలిక నిషేధంఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో నవంబర్ 1 వరకు టపాసులు అమ్మడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. దీంతోపాటే టపాసులు విక్రయించే వ్యాపారులకు జారీ చేసిన తాత్కాలిక లెసైన్సులను కూడా రద్దు చేస్తున్నామని, అక్టోబర్ 9 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 1 తర్వాత బాణసంచా అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తామని, టపాసుల విక్రయాలకు అనుమతి ఇస్తామని ధర్మాసనంలోని మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం సప్రే, జస్టిస్ అశోక్ భూషణ్ తెలిపారు. 


గోధ్రా’ దోషులకు శిక్ష తగ్గింపుగోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు శిక్ష తగ్గిస్తూ గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరణ శిక్ష పడిన 11 మంది దోషులకు ఆ శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. అలాగే జీవిత ఖైదు పడిన మరో 20 మందికి అదే శిక్షను ఖరారు చేసింది. ఆ ఘటన సమయంలో శాంతి భద్రతలను సరిగా పరిరక్షించలేకపోయారంటూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖలపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ గోధ్రా ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అనంత్ ఎస్ డేవ్, జస్టిస్ జీఆర్ ఉద్వానీ ఆదేశాలు జారీ చేశారు. 
2002, ఫిబ్రవరి 27న సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైలులో అయోధ్య నుంచి వస్తున్న ప్రయాణికులపై కొందరు ఆందోళనకారులు గోధ్రా స్టేషన్‌లో దాడిచేశారు. ఎస్-6 కోచ్‌కు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. వీరిలో చాలా మంది కరసేవకులు ఉన్నారు. ఈ ఘటన అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో సుమారు 1,200 మంది మరణించారు. ఈ మారణహోమంపై విచారణ జరిపేందుకు అప్పటి గుజరాత్ ప్రభుత్వం జస్టిస్ నానావతి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. గోధ్రా ఘటన వెనుక కుట్ర దాగి ఉందని విచారణలో కమిషన్ తేల్చింది. 


విపత్తు నిర్వహణ’ తప్పనిసరిఉగ్రదాడులు, భూకంపాల వంటి విపత్కర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరును విద్యార్థులకు బోధించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అన్ని వర్సిటీలకు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ కోర్సును తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

పోటీతత్వ సూచీలో భారత్‌కు 40వ స్థానంఅత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 40వ ర్యాంకు దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం దిగజారింది. మొత్తం 137 దేశాలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రూపొందించిన అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (Global Competetive index) ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానాన్ని స్విట్జర్లాండ్ సాధించింది. ఈ జాబితాలో పొరుగు దేశం చైనా 27వ ర్యాంకులో ఉండగా, భారత్ 39వ ర్యాంకు నుంచి 40వ స్థానానికి పడిపోయింది. 
12 విభాగాల్లో ఆయా దేశాల పనితీరు ప్రాతిపదికగా వాటి ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ నిర్ణయిస్తుంది. దీని ప్రకారం .. ఇన్‌ఫ్రా విభాగంలో భారత్ 66వ ర్యాంకు, ఉన్నత విద్య.. శిక్షణలో 75వ స్థానాన్ని దక్కించుకుంది.


జాతీయ అంతర్గత భద్రతా పథకానికి కేబినెట్ ఆమోదం దేశంలో శాంతిభద్రతల వ్యవస్థను మెరుగుపరచడానికి.. పోలీసు బలగాలను ఆధునీకరించడానికి.. ఉగ్రవాదంపై సమర్థవంతంగా పోరాటానికి ఉద్దేశించిన భారీ అంతర్గత భద్రతా పథకానికి కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపింది. ఈ మేరకు పోలీసు బలగాలను ఆధునికీకరించేందుకు ‘మాడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ (MPF)’ పేరిట 2017-18 నుంచి 2019-20 వరకు మూడేళ్ల పాటు రూ.25,060 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. అలాగే... మొబైల్ ఫోన్ కనెక్టివిటీని పెంచేందుకు ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 
ఎంపీఎప్ పథకం వివరాలు...
  • పథకం మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.18,636 కోట్లు కాగా.. రాష్ట్రాల వాటా రూ.6,424 కోట్లుగా ఉంటుంది.
  • ఎంపీఎఫ్ పథకంలో భాగంగా అంతర్గత భద్రత కోసం జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రూ.10,132 కోట్లు వెచ్చిస్తారు.
  • పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అధునాతనమైన ఫోరెన్సిక్ సైన్‌‌స లేబొరేటరీని ఏర్పాటు చేస్తారు. జైపూర్ లోని సర్దార్ పటేల్ గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ, కౌంటర్ టైజమ్‌ను, అలాగే గాంధీనగర్‌లోని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్‌‌స యూనివర్సిటీని ఆధునీకరిస్తారు.
 

కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపు కేంద్ర ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ సెప్టెంబర్ 27న నిర్ణయం తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖల్లో పనిచేస్తున్న వారికిఇది వర్తిస్తుంది. ప్రస్తుతం కేంద్ర వైద్యుల రిటైర్మెం ట్ వయసు కొన్ని విభాగాల్లో 60 ఏళ్లుగా, మరికొన్నింటిలో 62 ఏళ్లుగా ఉంది. దీంతో వివిధ విభాగాల్లోని 1,445 మంది వైద్యులకు లబ్ధి చేకూరనుంది. 


వైద్యులకూ ఆధార్ తరహా ఐడీడిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వైద్యులకు ఆధార్ తరహాలో యునిక్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ (యూపీఆర్‌ఎన్) ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన వారికి ఆ రాష్ట్రంలో కేటాయించే నంబర్.. మరో రాష్ట్రంలో మరొకరికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే నంబర్‌పై పదుల సంఖ్యలో వైద్యులు ఉంటున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఎంసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఎంసీఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి్య యూపీఆర్‌ఎన్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ప్రైవేటుతో పంచాయతీల అనుసంధానంగ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు దాదాపు కోటి మందికిపైగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గ్రామ పంచాయతీలను ప్రైవేటు సంస్థలకు అనుసంధానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) చురుగ్గా ఉండి బ్యాంకు ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఉన్న 50,000 పంచాయతీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. మిషన్ అంత్యోదయ పథకం కింద చేపడుతున్న ఈ చర్యల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలకు ఎలాంటి సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించబోదని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జిత్ సిన్హా చెప్పారు. 
ఈ విధానంలో కేంద్రం కేవలం పంచాయతీలకు, ప్రైవేటు సంస్థలకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుంది. వేర్వేరు గ్రామాల్లో వ్యాపారాలకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించి ఆ వివరాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పంచుకుంటుంది. 


గన్ లెసైన్సుల్లో యూపీ టాప్ఎక్కువ మంది పౌరులు తుపాకీ లెసైన్సులు పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో 12.77 లక్షల మందికి గన్ లెసైన్సు ఉంది. వేర్పాటువాదంతో సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్‌లో 3.69 లక్షల మంది గన్ లెసైన్సు పొందారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,69,444 మంది గన్ లెసైన్సులు సంపాదించారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తమ వ్యక్తిగత భద్రతను కారణంగా చూపి యూపీలో ఎక్కువ మంది లెసైన్సులు పొందారు. పంజాబ్‌లో 3,59,349 మంది, మధ్యప్రదేశ్‌లో 2,47,130 మంది, హరియాణాలో 1,41,926 మంది గన్ లెసైన్సులు పొందారు. అత్యంత తక్కువగా దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చెరో 125 మంది గన్ లెసైన్సులు సంపాదించారు. 


ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి ఓబీసీ రిజర్వేషన్ల వ ర్గీకరణ కమిషన్ చైర్ పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2న ఏర్పాటు చేసింది. 
కమిషన్‌లో సభ్యులుగా డాక్టర్ జేకే బాలాజీ, ఆంథ్రోపాలజికల్ సర్వే ఇండియా డెరైక్టర్, భారత రిజిస్ట్రార్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఉంటారు. ఈ కమిషన్‌కు సామాజిక న్యాయశాఖలో జాయింట్ సెక్రెటరీ హోదా అధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్ 12 వారాల్లో ఓబీసీ వర్గీకరణపై రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాలి.


మధుమేహంలో పుదుచ్చెరి ఫస్ట్దేశంలో మధుమేహం (షుగర్/డయాబెటిస్)తో బాధపడుతున్నవారు పుదుచ్చెరిలో ఎక్కువ మంది ఉన్నట్లు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తెలిపింది. రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఉండగా తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయి. 

‘దివ్యాంగ్ సారథి’ ప్రారంభందివ్యాంగులకు అనేక అంశాల్లో ఉపకరించే దివ్యాంగ్ సారథి అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లట్ సెప్టెంబర్ 26న ప్రారంభించారు. ఈ యాప్.. దివ్యాంగుల సంక్షేమ పథకాలు, ఉపకారవేతనాలు, సంస్థాగత మద్దతు వ్యవస్థల వివరాలను అందిస్తుంది. దివ్యాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ సమాచారం మొత్తం ఈ యాప్ ద్వారాపొందొచ్చు. ఇది ఇంటర్నెట్ లేకుండా కూడా పని చేస్తుంది. 

కర్ణాటకలో మూఢనమ్మకాల నిషేధ చట్టానికి తీర్మానంకర్ణాటకలో మూఢ నమ్మకాల నిషేధ చట్టం తేవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సెప్టెంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.