Thursday, 28 June 2018

మే 2018 జాతీయం

పత్రికా స్వేచ్ఛలో భారత్‌కు 138వ ర్యాంక్త్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 138 ర్యాంకులో నిలిచింది. గత ఏడాది 136 వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది రెండు ర్యాంకులను కోల్పొయింది. సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా నార్వే రెండో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరకొరియా చివరి స్థానంలో ఉంది. వివిధ అంశాల ఆధారంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ 180 దేశాల్లో ఉన్న పత్రికా స్వేచ్ఛకు ర్యాంకులు ప్రకటించింది. భారత్‌లో హిందూమత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువయ్యాయని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక పేర్కొంది. 


ప్రతినెల 30న సివిల్ రైట్స్ డే
జిల్లా కేంద్రాల్లో ప్రతినెల 30న ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీల ఆధ్వర్యంలో ఈ డే నిర్వహించాలని ఏప్రిల్ 28 జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిని మండల, గ్రామ స్థాయిలో నిర్వహించడం వల్ల ప్రజల సమస్యలపై యంత్రాంగానికి స్పష్టత రావడంతో పాటు పథకాల అమలులో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.


దాల్మియాకు ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు
 
చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, గండికోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 28న కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎర్రకోట, గండికోట నిర్వహణకు రూ. 25 కోట్లను ఆ సంస్థ ఖర్చు చేస్తుంది. అందుకు బదులుగా వాటిని దాల్మియా సంస్థ ప్రచారానికి ఉపయోగించుకుంటుంది. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి.
చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకొచ్చెందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి)’ పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఏప్రిల్ 2018 జాతీయం

కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హత రద్దు కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హతను రద్దు చేస్తూ రైల్వేశాఖ ఏప్రిల్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల్లో చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో చనిపోయిన, వైద్య కారణాలతో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భార్యలు, పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం లెవల్-1 లేదా గ్రూప్-డి విభాగంలో కారుణ్య నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.


టైమ్స్ ప్రభావశీలుర జాబితా 2018
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2018 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ఏప్రిల్ 19న ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ యువరాజు హ్యారీ, సౌదీ యువరాజు బిన్ సల్మాన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా అధినేత కిమ్, కెనడా ప్రధాని ట్రూడో, ఐర్లాండ్‌కు తొలి గే ప్రధాని వరద్కర్, ‘మీ టూ’ ఉద్యమకారిణి తరానా బర్క్, బంగ్లాదేశ్ ప్రధాని హసీనా, పాప్ గాయని జెన్నిఫర్ లోపేజ్‌లు కూడా స్థానం సంపాదించారు.


స్త్రీలపై నేరాల కేసుల్లో 48 మంది చట్టసభ్యులు
స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడ్డారన్న వారిలో ప్రస్తుతం 48 మంది దేశంలోని వివిధ చట్టసభల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు కాగా, 45 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 12, శివసేన నుంచి ఏడుగురు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరుగురు ఉన్నారని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎన్నికల్లో పోటీచేసిన 4,845 అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి ఈ మేరకు ఓ నివేదికను తయారుచేసింది. 


లోయాది సహజ మరణం: సుప్రీంకోర్టు
సీబీఐ మాజీ న్యాయమూర్తి బీహెచ్ లోయా మరణం సహజమైనదేనని సుప్రీంకోర్టు ఏప్రిల్ 19న తెలిపింది. ఈ మేరకు లోయా మృతికి సంబంధించిన అన్ని పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాల్జేసేందుకే ఈ పిటిషన్లు వేశారని తెలిపింది. సీనియర్ న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలైన దుష్యంత్ దవే, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ లు లోయా మృతిపై స్వతంత్ర విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
గుజరాత్‌లో 2005లో సోహ్రబుద్దీన్ షేక్, అతని భార్య కౌసర్, వారి సన్నిహితుడు తులసీరామ్ ప్రజాపతిని పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేసిన కేసులో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా గతంలో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్‌గోపాల్ హరికిషన్ లోయా 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో మృతి చెందారు.


సీజేఐ మిశ్రాపై అభిశంసన నోటీసులు
భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీజేఐ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి ఏప్రిల్ 20న నోటీసులు అందజేశాయి. ఈ నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేశారు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయ్యాయి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి.
సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయనపై నోటీసులో 5 ఆరోపణలు పేర్కొన్నారు.
  1. ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.
  2. సుప్రీంకోర్టులో ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్)
  3. రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.
  4. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్ చేశారు. అయితే 1985లోనే ప్లాట్ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.
  5. తనకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.
గతంలో అభిశంసన తీర్మానాలు 
గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై నాలుగు సార్లు అభిశంసన తీర్మానాలిచ్చారు. అవి.
  • జస్టిస్ వి.రామస్వామి 1987-1989 మధ్య హర్యానా, పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అధికార నివాసంలో పరిమితికి మించి ఖర్చు చేశారన్న అభియోగంతో 1991లో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 1993లో లోక్‌సభలో ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది.
  • 2009లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రసేన్ కు వ్యతిరేకంగా రాజ్యసభలో తీర్మానం వచ్చింది. న్యాయవాదిగా ఉన్నప్పుడు కోర్టు రిసీవర్‌గా నియమితులైన ఆయన తన ఆధీనంలో ఉన్న రూ. 33.23 లక్షలను దుర్వినియోగం చేశాడనే ఆరోపణలతో సీపీఎం నేత సీతారాం ఏచూరి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది 2011 ఆగస్టు 18న రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్‌సభకు వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్ సౌమిత్ర సేన్ 2011 సెప్టెంబర్ 1న తన పదవికి రాజీనామా చేశారు.
  • 2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీడీ దినకరన్‌పై భూఆక్రమణ, అధికార దుర్వినియోగం తదితర 16 ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమని తేలింది. దీంతో తనపై వచ్చిన ఆరోపణల విచారణకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పై నమ్మకం లేదని దినకరన్ రాజీనామా చేశారు.
  • అదనపు జిల్లా మహిళా న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. గంగెలేపై 2015 మార్చిలో అభిశంసన నోటీసులు ఇచ్చారు. అయితే విచారణ అనంతర అయనపై వచ్చిన అభియోగాలు రుజువు కాలేదని కమిటీ తేల్చింది.
  • 2016లో తన అధికారాలను దుర్వినియోగం చేసి ఓ దళిత జూనియర్ సివిల్ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్ నాగార్జున్‌రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది.
అభిశంసన ప్రక్రియ సాగే విధానం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. ఈ ప్రక్రియను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు. ప్రతిపాదనపై రాజ్యసభలో అయితే 50 మంది, లోక్‌సభలో అయితే 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి. స్పీకర్ లేదా చైర్మన్ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోతుంది. ఆమోదం పొందితే మాత్రం సుప్రీం జడ్జ్జి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తారు.
ఈ కమిటీ న్యాయమూర్తులపై అభియోగాలను నమోదు చేస్తుంది. విచారణ తుది నివేదికను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు సమర్పిస్తుంది. అనంతరం ప్రతిపాదనలపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది. ప్రతిపాదన సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాలి. ఒక సభలో ఆమోదం పొందిన తరువాత రెండో సభకు పంపుతారు. రెండింట్లోనూ ఆమోదం పొందిన ప్రతిపాదన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది. అనంతరం సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు.

చిన్నారులపై రేప్‌కు మరణశిక్ష
చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో కఠిన శిక్షలు అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసర ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 21 న జరిగిన కేబినెట్ సమావేశంలో భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), ద ఎవిడెన్స్ యాక్ట్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్(సీఆర్‌పీసీ), లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో) చట్టాల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం అత్యాచార కేసుల విచారణకు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కేసుల దర్యాప్తు కోసం అన్ని పోలీసు స్టేషన్లు, ఆస్పత్రులకు ప్రత్యేక ఫోరెన్సిక్ కిట్లను ఇస్తారు.
ఆర్డినెన్స్‌లో ముఖ్యాంశాలు

  • 12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడితే కనిష్టంగా 20 ఏళ్ల జైలు లేదా గరిష్టంగా మరణించేంత వరకూ జైలు లేదా మరణశిక్ష విధిస్తారు.
  • 12 ఏళ్ల లోపు బాలికపై గ్యాంగ్ రేప్ చేస్తే మరణించేంత వరకూ జైలు శిక్ష లేదా మరణ శిక్ష
  • 16 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే శిక్ష 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంపు లేదా గరిష్టంగా మరణించేంత వరకూ జైలు శిక్ష విధిస్తారు.
  • 16 ఏళ్ల లోపు బాలికపై గ్యాంగ్ రేప్‌నకు మరణించేంత వరకూ జైలు శిక్ష విధిస్తారు.
  • మహిళలపై అత్యాచారం చేస్తే పడే శిక్షను 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంపు లేదా గరిష్టంగా జీవిత ఖైదు అమలు చేస్తారు.


సీజేఐ అభిశంసన నోటీసు తిరస్కరణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. అభియోగాల్ని నిరూపించేందుకు కచ్చితమైన సమాచారం లేనందున నోటీసును తిరస్కరిస్తూ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టికల్ 124(4) ప్రకారం ప్రధాన న్యాయమూర్తి దుష్ర్పవర్తనను నిరూపించాలంటే ఆధారాలు తప్పనిసరి. ‘జడ్జిల విచారణ యాక్ట్’ ప్రకారం సంప్రదింపులు, నిబంధనల అధ్యయనం అనంతరం రాజ్యసభ చైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ నోటీసును అనుమతించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 


అద్భుతంగా సాగిన గగన్ శక్తి విన్యాసాలు
గగన శక్తి పేరుతో ఏప్రిల్ 8 నుంచి 20 వరకు భారీ స్థాయిలో చేపట్టిన విన్యాసాలు అద్భుతంగా సాగాయని వైమానిక దళాధిపతి మార్షల్ బీఎస్ ధనోవా ఏప్రిల్ 23న తెలిపారు. విన్యాసాల్లో భాగంగా పోరాట, రవాణా, గస్తీ విమానాలు 11,000 పైగా చక్కర్లు కొట్టాయని తెలిపారు. 

సాయుధ దళాల ప్రత్యేక చట్టం ఎత్తివేత
కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నుంచి మేఘాలయలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసింది. దీంతోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ పాక్షికంగా తొలగించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్ 23న ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆర్థిక నేరస్తుల ఆస్తుల జప్తుకు ఆర్డినెన్స్
దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని ఇచ్చే ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 21నఆమోదించింది.

సీజేఐ సమానుల్లో ప్రథముడు: సుప్రీంకోర్టుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడు(ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్) అని సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ ఒక వ్యవస్థ అని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం సీజేఐకే ఉంటుందని వెల్లడించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పారదర్శకంగా కేసుల కేటాయింపులు జరపాలని న్యాయవాది అశోక్ పాండే దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పును వెలువరిచింది. సీజేఐ జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 11న అశోక్ పాండే వేసిన పిల్‌పై తీర్పును వెలువరుస్తూ కోర్టులోని న్యాయమూర్తులంతా సమానులేనని, అయితే సీజేఐ వారిలో ప్రథముడని వ్యాఖ్యానించింది.


ఐఈఎఫ్ సదస్సును ప్రారంభించిన మోదీ 
16వ అంతర్జాతీయ ఇంధన సంఘం(ఐఈఎఫ్) మంత్రుల సదస్సును ఏప్రిల్ 11న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోధీ ప్రారంభించారు. దాదాపు 22 సంవత్సరాల అనంతరం ఈ సదస్సుకు భారత్ వేదిక కాగా సౌదీ అరేబియా, ఇరాన్ సహా ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) సభ్య దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా హైడ్రోకార్బన్ మార్కెట్ విధానాలు హేతుబద్ధంగా ఉండాలని మోదీ సూచించారు. వచ్చే పాతికేళ్లలో భారత్‌లో చమురు ఉత్పత్తుల డిమాండ్ 4.5 శాతం, గ్యాస్ డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని మోదీ అన్నారు.


ఆదివాసీల జీవితకాలం 43 సంవత్సరాలు
దేశంలో అన్ని వర్గాల వారికంటే ఆదివాసీల జీవితకాలం చాలా తక్కువగా 43 సంవత్సరాలే ఉందని ఒక నివేదిక తెలిపింది. ఆదివాసీలు అల్పసంఖ్యాక ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారు ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే ముందుగానే మృత్యువాతపడుతున్నారని ‘భారత్‌లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004-14కాలంలో)’ అనే అంశంపై ప్రముఖ ఆర్థిక వేత్త వాణీకాంత్ బారువా జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సరైన స్థాయిలో వైద్య సేవలు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని బారువా పేర్కొన్నారు.
2004 వరకు ఎస్టీల సగటు జీవితకాలం 45 ఏళ్లు కాగా, తర్వాతి దశాబ్దంలో అది 43 కి తగ్గింది. ఎస్సీల సగటు జీవితకాలం 42 ఏళ్లు కాగా 2014 నాటికి అది ఆరేళ్లు పెరిగింది. ముస్లిమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవితకాలం 2004లో 55 ఏళ్లు ఉండగా 2014లో 66 ఏళ్లకు పెరిగింది. తాము అనారోగ్యం బారినపడ్డామని వెల్లడించే ఆదివాసీల సంఖ్య కేవలం 24 శాతం మాత్రమే. అదే ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు.
2004, 2014లలో సామాజిక వర్గాల సగటు జీవితకాలం..
20042014
ముస్లిమేతర ఉన్నత వర్గాలు5560
ముస్లిమేతర ఓబీసీలు4952
ఓబీసీ ముస్లింలు4350
ఉన్నత వర్గ ముస్లింలు4449
షెడ్యూల్డ్ కులాలు4248
షెడ్యూల్డ్ తెగలు4543

తమిళనాడులో డిఫెన్స్ ఎక్స్‌పో 2018
తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్‌పోను ఏప్రిల్ 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంబించారు. ఈ సందర్భంగా శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శమని, సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదని పేర్కొన్నారు.
ఎఫ్‌ఏ-18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్‌లోనే తయారు చేసేందుకు ఎక్స్‌పో లో అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.


రైల్వే ఫిర్యాదుల కోసం మదద్ యాప్
ప్రయాణికులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు మదద్ అనే మొబైల్ యాప్‌ను రైల్వే శాఖ రూపొందించింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం, అత్యవసర సేవల్ని పొందడంతోపాటు ఇచ్చిన ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే అవకాశముంది. ఇప్పటివరకు ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యల్ని ట్వీటర్, ఫేస్‌బుక్ గ్రీవియెన్స్ సెల్‌లోనే ఫిర్యాదు చేసే అవకాశముంది.


సోలార్ విద్యుత్ కి అనుకూల నగరాలు
సౌరవిద్యుత్ ఉత్పత్తికి పుష్కలంగా అవకాశాలున్న మెట్రో నగరాల్లో న్యూఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. ఢిల్లీలో 2000 మెగాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని గ్రీన్‌పీస్ ఇండియా, గుజరాత్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (జీఈఆర్‌ఎంఐ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఈ జాబితాలో 1750 మెగావాట్లతో ముంబై రెండోస్థానం, 1749 మెగావాట్లతో పట్నా మూడోస్థానంలో నిలిచాయి. 1730 మెగావాట్లతో హైదరాబాద్ నాలుగోస్థానంలో నిలిచింది. బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవంతులపై సౌర ఫలకాలు (రూఫ్‌టాప్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ఆర్‌టీపీవీ) ఏర్పాటుతో దీనిని సాధించవచ్చని గ్రీన్ పీస్ ఇండియా తెలిపింది. ఈ మేరకు రూఫ్‌టాప్ రెవల్యూషన్ : అన్‌లీషింగ్ హైదరాబాద్స్ రూఫ్‌టాప్ పొటెన్షియల్ పేరుతో నివేదిక విడుదల చేసింది.

నో యువర్ పర్సనల్ ను ప్రారంభించనున్న సశస్త్ర సీమాబల్
సశస్త్ర సీమాబల్ లక్షమంది సైనికుల శారీరక దారుఢ్యం, నైపుణ్యాలు, ఆసక్తులు, ఆకాంక్షలు, సమస్యల గురించి వివరించే పెన్ పోట్రేయిట్స్ తయారీకి సిద్ధమైంది. బ్యాంకులు ప్రవేశపెట్టిన ‘నో యువర్ కస్టమర్’ మాదిరిగా ఎస్‌ఎస్‌బీ కూడా నో యువర్ పర్సనల్ (కేవైపీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో ప్రతి జవాన్‌కు సంబంధించిన వివరాలను చేతిరాతతో నమోదు చేస్తారు. ఎస్‌ఎస్‌బీ బలాలు, బలహీనతలు, ఆసక్తులు, దళాల ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని సంస్థ డెరైక్టర్ జనరల్ ఆర్కే మిశ్రా తెలిపారు. బొమ్మలు, చేతిరాతతో కూడిన వివరాలు కలిగిన చిన్న చిత్రాలనే పెన్‌పోట్రేయిట్స్ అంటారు.


900 ఏళ్ల కరువుతో సింధు నాగరికత అంతం
900 ఏళ్ల కరువు కారణాంగానే సింధు నాగరికత అంతమైందని ఐండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు ఏప్రిల్ 16న వెల్లడించారు. గత 5 వేల సంవత్సరాల్లో రుతుపవనాల స్థితిగతుల్ని, సింధు నాగరికత ప్రాంతంలోనే ఉన్న లేహ్, లడక్‌లో రుతుపవనాలను అధ్యయనం చేసి ఈ అంచనాకు వచ్చారు. క్రీ.పూ 2,350 నుంచి క్రీ.పూ 1,450 వరకు రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారడంతోనే సింధు నాగరికత పూర్తిగా కనుమరుగైందని తెలిపారు.


లెఫ్టినెంట్ గవర్నర్ల జీతభత్యాలు పెంపు
లెఫ్టినెంట్ గవర్నర్ల జీతభత్యాలను పెంచుతూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేబినెట్ ఏప్రిల్ 11న నిర్ణయం తీసుకుంది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్‌కు నెలసరి వేతనంగా రూ.2,25,000 అందనుంది. పెరిగిన జీతభత్యాలు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

దళిత్’ అనే పదప్రమోగం వద్దు: కేంద్రంపాలనా వ్యవహారాల్లో దళిత్ అనే పదప్రయోగాన్ని వాడవద్దని కేంద్రం ప్రభుత్వం తాజాగా సూచించింది. అధికారిక వ్యవహారాలన్నింటిలోనూ షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ)ను అలాగే ఉపయోగించాలని పేర్కొంది. ఈ మేరకు 2018 మార్చి 15న సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
భారత రాజ్యాంగంలో దళిత్ అనే పదం ప్రస్తావన లేదని, షెడ్యూల్డ్ కుల ధ్రువీకరణ పత్రాల్లో వ్యక్తి కులాన్ని ప్రస్తావించాలని తెలిపింది. ఒక వ్యక్తిని ఏ అంశం కింద షెడ్యూల్డ్ క్యాస్ట్‌గా గుర్తించారో కూడా పేర్కొనాలి కానీ ‘హరిజన’ అనే పదాన్ని ఉపయోగించకూడదని కేంద్రం 1988లోనే చెప్పింది.


నదుల జాతీయాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టుదేశంలోని నదులు, ఆనకట్టలను జాతీయం చేయాలంటూ తమిళనాడుకు చెందిన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రస్ట్’ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న తోసిపుచ్చింది. కేవలం కొన్ని రాష్ట్రాలు ఘర్షణపడుతున్నాయని నదులను జాతీయం చేయలేమని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కమిటీ
సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ లోపాలపై సమీక్షించేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ఏప్రిల్ 4న ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హెచ్చార్డీ మాజీ కార్యదర్శి వినయ్‌శీల్ ఒబెరాయ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ మే 31 కల్లా సాంకేతికత సాయంతో భద్రంగా పరీక్షలు నిర్వహించేందుకు తగు సూచనలు చేయనుంది.


ఇండియా ట్యుబర్‌క్యులోసిస్-2018 నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లోని క్షయ వ్యాధిగ్రస్తుల్లో (83,118) పది శాతం మంది హెచ్‌ఐవీ బాధితులేనని ఇండియా ట్యుబరిక్యులోసిస్-2018 నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, నాగాలాండ్ 14 శాతంతో మొదటి స్థానం, 8 శాతం మందితో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. హెచ్‌ఐవీ సోకిన క్షయ వ్యాధిగ్రస్తుల్లో క్షయ తీవ్రత మరింత పెరుగుతుంది. 
దేశంలోనే అత్యధికంగా క్షయ బాధితులు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో (3,11,041) హెచ్‌ఐవీ సోకిన క్షయ బాధితులు 1 శాతమే.


ఎస్సీ, ఎస్టీ కేసుల్లో దోషులు 30 శాతానికి మించడం లేదు: ఇండియా స్పెండ్
దళితులు, ఆదివాసీలపై నేరాలకు పాల్పడిన ఘటనల్లో దోషులుగా తేలుతున్నవారి సంఖ్య 30 శాతానికి మించడం లేదని ఇండియా స్పెండ్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. దళితులపై జరిగిన నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 2006లో 28 శాతం ఉండగా, 2016 నాటికి 26 శాతానికి, ఆదివాసీలపై నేరాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 28 శాతం ఉండగా, 2016 నాటికి ఇది 21 శాతానికి పడిపోయిందని తెలిపింది. నివేదిక ప్రకారం 2006-16 మధ్య దేశవ్యాప్తంగా దళితులపై 4,22,799, ఆదివాసీలపై 81,322 నేరాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 కింద నిందితుల్ని తక్షణం అరెస్ట్ చేయరాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఇండియా స్పెండ్ అనే సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2016లో విడుదల చేసిన గణాంకాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.
నివేదిక ముఖ్యాంశాలు
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశజనాభాలో 20.1 కోట్ల మంది(16.6 శాతం) దళితులు, 10.4 కోట్ల మంది(8.6 శాతం) ఆదివాసీలు ఉన్నారు.
  • దేశవ్యాప్తంగా 2006తో పోల్చుకుంటే 2016 నాటికి దళితుల(ఎస్సీ)పై నేరాలు 746 శాతం (8 రెట్లు), ఆదివాసీల(ఎస్టీ)పై 1,160 శాతం(12 రెట్లు) పెరిగాయి.
  • దళితులపై జరిగిన నేరాల్లో మధ్యప్రదేశ్(43.4%), గోవా (43.2%), రాజస్తాన్ (42%) రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఆదివాసీలపై 37.5% నేరాలతో కేరళ తొలిస్థానంలో నిలవగా, అండమాన్-నికోబార్ దీవులు (21%), ఆంధ్రప్రదేశ్ (15.4%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • దళితులకు సంబంధించి పోలీస్‌స్టేషన్లలో 4,311 పెండింగ్ కేసులతో బిహార్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. ఆదివాసీలకు సంబంధించి 405 పెండింగ్ కేసులతో ఏపీ మొదటిస్థానంలో నిలిచింది.
  • 2006-16 మధ్య దళితులు పెట్టిన కేసుల్లో 5,347 తప్పుడు కేసులు కాగా వీటిలో రాజస్తాన్ 2,632 కేసులతో మొదటిస్థానంలో ఉంది.
  • ఈ కేసుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో దోషులుగా తేలినవారి సంఖ్య 10 శాతానికి మించలేదు.
  • పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, విచారణలో జాప్యం, బాధితులకు రక్షణ లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ చట్టంలో సరైన సెక్షన్ల కింద కేసు నమోదుచేయకపోవడం కారణంగానే చాలామంది నేరస్తులు శిక్షపడకుండా తప్పించుకుంటున్నారని విశ్లేషించింది.


చంపారన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ
చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బిహార్‌లోని మోతిహారీలో ఏప్రిల్ 10న జరిగిన కార్యక్రమంలో 20వేల మంది స్వచ్ఛాగ్రహి (స్వచ్ఛత వాలంటీర్లు)లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కతిహార్-పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు. 
మహాత్మగాంధీ ప్రారంభించిన చంపారన్ సత్యాగ్రహం 2017 ఏప్రిల్ 10 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోవడంతో సంవత్సరం పాటు చంపారన్ సత్యాగ్రహ వేడుకలు నిర్వహించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది.


దేశంలో ధనిక పార్టీగా బీజేపీ 
2016-17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఈ మేరకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీల ఆదాయపు పన్ను రిటర్నులను విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2016-17లో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,559.17 కోట్లు కాగా ఇందులో బీజేపీకి రూ. 1,034.27 కోట్ల ఆదాయం లభించింది. రూ. 225.36 కోట్లు ఆదాయం పొంది కాంగ్రెస్ రెండో ధనిక పార్టీగా నిలవగా కేవలం రూ.2.08 కోట్లతో అతి తక్కువ ఆదాయం పొందిన పార్టీగా సీపీఐ నిలిచింది. అలాగే ఏడు పార్టీల మొత్తం వ్యయం రూ.1,228.26 కోట్లు కాగా ఇందులో బీజేపీ వాటా రూ.710.05 కోట్లు. 


జగన్నాథ ఆలయ ఖజానాను పరీక్షించనున్న పురావస్తుశాఖపూరీలోని ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం రత్న భండార్(ఖజానా)ను దాదాపు 34 ఏళ్ల తర్వాత తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ సందర్భంగా రత్న భండార్ పటిష్టత, భద్రతల్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) పరీక్షిస్తుందని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా తెలిపారు. 1984లో ఖజానాలోని 7 గదుల్లో మూడింటిని మాత్రమే తాము తెరవగలిగామని, నాలుగో గది దగ్గరకు వెళ్లగానే పాములు బుసలుకొట్టిన శబ్దాలు విన్పించాయని ఈ ఆలయంలో పనిచేసిన ఆర్.ఎన్.మిశ్రా తెలిపారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 44.16% బీసీలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 44.16 శాతం మంది వెనుకబడిన తరగతుల వారున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ఈ వివరాలు వెల్లడించారు. కేంద్ర ఉద్యోగుల్లో 17.55 శాతం మంది షెడ్యూల్ కులాలు, 8.37 శాతం షెడ్యూలు తెగలు, మిగతా వెనకబడిన తరగతుల వారు 18.24% మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ 2016-17 వార్షిక నివేదిక ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించారు.

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్‌సీ
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స (ఐఐఎస్‌సీ) నిలిచింది. ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్‌సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్, అత్యుత్తమ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం-అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్‌మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ ఏప్రిల్ 3న ర్యాంకులు ప్రకటించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఇండియా ర్యాంకింగ్‌‌స 2018 పేరిట విడుదల చేసిన ఈ ర్యాంకుల కోసం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్‌మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 డిగ్రీ కళాశాలలు మొత్తం 3,954 విద్యా సంస్థలను పరిశీలించారు. టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్‌రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ వంటి అంశాల ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఈ ర్యాంకులను ప్రకటించింది.

ఓవరాల్ కేటగిరీలో టాప్-5 1. ఐఐఎస్‌సీ-బెంగళూరు
2. ఐఐటీ-మద్రాస్
3. ఐఐటీ-బాంబే
4. ఐఐటీ-ఢిల్లీ
5. ఐఐటీ-ఖరగ్‌పూర్ 

ఇంజనీరింగ్ విద్యలో టాప్-5 
1. ఐఐటీ-మద్రాస్
2. ఐఐటీ-బాంబే
3. ఐఐటీ-ఢిల్లీ
4. ఐఐటీ-ఖరగ్‌పూర్
5. ఐఐటీ-కాన్పూర్ 

వైద్యవిద్యలో టాప్-5 
1. ఎయిమ్స్-ఢిల్లీ
2. పీజీఐఎంఈఆర్-చండీగఢ్
3. సీఎంసీ-వేలూరు
4. కేఎంసీ-మణిపాల్
5. కేజేఎంయూ-లక్నో 

మేనేజ్‌మెంట్ విద్యలో టాప్-5 
1. ఐఐఎం-అహ్మదాబాద్
2. ఐఐఎం-బెంగళూరు
3. ఐఐఎం-కలకత్తా
4. ఐఐఎం-లక్నో
5. ఐఐటీ-బాంబే 

న్యాయ విద్యలో టాప్-5 
1. ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ-బెంగళూరు
2. ఎన్‌ఎల్‌యూ-ఢిల్లీ
3. నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్
4. ఐఐటీ-ఖరగ్‌పూర్
5. ఎన్‌ఎల్‌యూ-జోధ్‌పూర్ 

ఫార్మసీ విద్యలో టాప్-5 
1. ఎన్‌ఐపీఈఆర్-మొహాలీ
2. జామియా హందర్ద్-ఢిల్లీ
3. పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్
4. ఐసీటీ-ముంబై
5. బిట్స్-పిలానీ 

టాప్-5 విశ్వవిద్యాలయాలు:
1. ఐఐఎస్‌సీ-బెంగళూరు
2. జేఎన్‌యూ-ఢిల్లీ
3. బీహెచ్‌యూ-వారణాసి
4. అన్నా యూనివర్సిటీ-చెన్నై
5. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ.



ఢిల్లీలో యూరో-6 ఇంధనం విక్రయం
దేశంలో తొలిసారిగా న్యూఢిల్లీలో ఏప్రిల్ 1 నుంచి యూరో-6(బీఎస్-6) ప్రమాణాలు కలిగిన పెట్రోలు, డీజిల్‌ను విక్రయిస్తున్నారు. దీంతో యూరో-4 నుంచి నేరుగా యూరో-6 ఇంధన వినియోగానికి వెళ్లిన మొదటి నగరంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.

ఎస్సీ, ఎస్టీ కోటాలో మినహాయింపులు ఉండవుఎస్సీ, ఎస్టీ కోటా ప్రయోజనాల వర్తింపులో ఆయా వర్గాలకు చెందిన సంపన్న శ్రేణిని మినహాయించలేమని కేంద్రం మార్చి 28న సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ‘సంపన్న శ్రేణి’అనే సిద్ధాంతం వీలుకాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో సంపన్న శ్రేణిని సదరు కోటా ప్రయోజనాల నుంచి మినహాయించాలంటూ ‘సమతా ఆందోళన్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది.





మార్చి 2018 జాతీయం

గ్రాట్యుటీ చెల్లింపు బిల్లు(సవరణ)కు ఆమోదం ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ మార్చి 22న రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ మార్చి 15 న ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. 
కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది. 
 

ఆధార్ వ్యవస్థ పటిష్టం: యూఐడీఏఐ
ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఎంత మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారో తమ వద్ద అధికారిక సమాచారం లేదని ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆధార్ వల్ల పౌరులకు పటిష్టమైన, జీవితాంతం ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోగల గుర్తింపుకార్డు లభించిందని ఉద్ఘాటించింది. ఆధార్ నమోదుకు వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, కంటి పాపకు సంబంధించిన వివరాలు మినహా కులం, మతం, భాష లాంటి సమాచారం కోరడం లేదంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు యూఐడీఏఐ సీఈఓ అజయ్ పాండే ఆధార్ నిర్వహణ, అమలు తీరుతెన్నులను వివరిస్తూ మార్చి 22న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రాజ్యసభలో 69కి చేరిన బీజేపీ సభ్యుల సంఖ్య
రాజ్యసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా గెలుచుకోవడంతో బీజేపీ తన సంఖ్యను 69కి పెంచుకుంది. కాంగ్రెస్ నాలుగు సీట్లు చేజార్చుకుని 50కి పడిపోయింది. మార్చి 23న 58 ద్వైవార్షిక రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించక ముందు బీజేపీకి 48, కాంగ్రెస్‌కు 54 సీట్లున్నాయి. వీరిలో బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 14 మంది సభ్యులు పదవీ విరమణ చేశారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది ఎన్నికయ్యారు. అందులో రెండోసారి ఎన్నికైన వారూ కొందరున్నారు.

డౌన్‌లోడ్ స్పీడ్‌లో భారత్‌కు 109వ స్థానం
మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో వెనుకబడింది. గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ యూజర్లు గణనీయంగా పెరిగినా డౌన్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం 9.01 ఎంబీపీఎస్‌తో 109వ స్థానంలో నిలిచింది. ఓక్లా స్పీడ్ టెస్ట్ ఇండెక్స్ ఈ విషయాలను వెల్లడించింది.
మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లో 62.07 ఎంబీపీఎస్‌తో నార్వే అగ్రస్థానాన్ని కై వసం చేసుకోగా, ఫిక్స్‌డ్ బ్రాడ్‌బాండ్ విభాగంలో 161.53 ఎంబీపీఎస్ స్పీడ్‌తో సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. భారత్‌లో ఈ స్పీడ్ 20.72.
మొబైల్ డేటా వినియోగంలో నెలకు 150 కోట్ల గిగాబైట్స్‌తో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. అమెరికా, చైనా రెండు దేశాల డేటా వినియోగం కన్నా ఇది ఎక్కువ.


ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకం: సుప్రీంకోర్టు
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై పరువు హత్యలకు పాల్పడుతున్న ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఖాప్ పంచాయతీల చట్ట వ్యతిరేక చర్యలను పూర్తిగా అదుపుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. పరువు హత్యలకు పాల్పడటమనేది సామాజిక రుగ్మత అని ఇది మనిషి హుందాతనాన్ని, చట్ట సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని పేర్కొంది. 
2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను మార్చి 27న విచారించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.


ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత ఎత్తివేత
లాభదాయక పదవుల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే(20 మంది)లపై అనర్హత వేటువేయడాన్ని ఢిల్లీ హైకోర్టు మార్చి 23న కొట్టేసింది. ఈ మేరకు వెలువరించిన నోటిఫికేషన్ చట్ట ప్రకారం సరికాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ చందర్ శేఖర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ అంశాన్ని మరోసారి విచారించి..తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. 

ఈశాన్య రాష్ట్రాలకు పన్ను రాయితీలు పొడిగింపు
ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకు పొడిగించింది దీనికోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకం-2017 పేరుతో పన్ను ప్రోత్సాహకాలను అందించనున్నారు.

హ్యాపినెస్ ఇండెక్స్’లో 133వ స్థానంలో భారత్ప్రపంచంలో సంతోషమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల్లో భారత్ స్థానం దిగజారింది. 156 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 133వ స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ ర్యాంకు 122 కావడం గమనార్హం. సార్క్‌దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్తాన్ (145 ర్యాంక్) కన్నా మాత్రమే ఈసారి మెరుగైన స్థితిలో ఉంది. పొరుగుదేశాలైన పాకిస్తాన్-75, భూటాన్-97, నేపాల్-101, బంగ్లాదేశ్-115, శ్రీలంక-116 భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్’ను పురస్కరించుకుని ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్‌‌స నెట్‌వర్క్(ఎస్‌డీఎస్‌ఎన్) ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది. 
అత్యంత సంతోషమయ దేశంగా ఫిన్‌లాండ్ నిలవగా ఆ తరువాతి స్థానాల్లో వరసగా నార్వే, డెన్మార్క్ ఉన్నాయి. వలసదారుల స్థితిగతులు, తలసరి ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, దాతృత్వం, అవినీతిరాహిత్యం, ఆరోగ్యకర ఆయుఃప్రమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. 
సంతోషంలో తొలి ఐదు

  1. ఫిన్లాండ్
  2. నార్వే
  3. డెన్మార్క్
  4. ఐస్‌లాండ్
  5. స్విట్జర్లాండ్
చివరి ఐదు ర్యాంకులు 
156. బురుండి
155. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
154. దక్షిణ సూడాన్ 
153. టాంజానియా
152. యెమెన్ 


ఆర్మీలో ఐదేళ్లు చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణరంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిటీ తెలిపింది. ఈ సమస్య తీవ్రతను రక్షణశాఖ డీవోపీటీ దృష్టికి సరిగ్గా తీసుకెళ్లలేకపోయిందని ఆక్షేపించింది. 
ప్రస్తుతం భారత ఆర్మీలో 7,679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్‌‌డ అధికారులు, నేవీలో 1,434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్‌మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. 

అమ్మ’ పేరుతో దినకరన్ పార్టీ 
అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో మార్చి 15ననిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 


న్యూస్ 18 సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగం 
‘న్యూస్ 18’ గ్రూప్ ఢిల్లీలో మార్చి 16న నిర్వహించిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. రైజింగ్ ఇండియా అంటే ఆర్థిక వ్యవస్థ, జీడీపీ, విదేశీ పెట్టుబడులు మొదలైనవి మాత్రమే కాదని.. రైజింగ్ ఇండియా అంటే 125కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. నోట్లరద్దు తర్వాత దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు. 
చాలా తక్కువ సమయంలోనే స్వచ్ఛభారత్ మిషన్ ఓ ప్రజా ఉద్యమంగా మారిందని.. నేడు దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. నాలుగేళ్లలో దేశంలో పారిశుద్ధ్య పరిధి 38 శాతం నుంచి 80 శాతానికి పెరిగిందని చెప్పారు. 


ఇంఫాల్‌లో 105 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌నుమార్చి 16 నుంచి 20 వరకు జరిగింది. దీన్నిప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు.. ప్రజలకు మరింత మేలుకలిగేలా పరిశోధనల పరిధిని విసృ్తతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి ఈ పరిశోధనలు మారాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని పునర్నిర్వచించి.. దేశాభివృద్ధికి ప్రయోగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒక్కో శాస్త్రవేత్త.. ఏడాదిలో 100 గంటల సమయాన్ని కనీసం 100 మంది 9-12 తరగతుల విద్యార్థులతో గడిపి వారిని ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.
"శాస్త్ర, సాంకేతికత ద్వారా ఇప్పటికీ చేరుకోలేని వర్గాలను చేరుకోవటం"అనేది ఈ సారి సైన్‌‌స కాంగ్రెస్ ఇతివృత్తం. భారతీయ సైన్‌‌స కాంగ్రెస్ సభలకోసం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా హైదరాబాద్ కాకుండా చివరి నిమిషంలో ఇంఫాల్‌కు మారింది. 


దేశంలో పొగతాగుతున్న పిల్లలు 6.25 లక్షలు
దేశంలో 6.25 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు రోజూ సిగరెట్ తాగుతున్నారు. భారత్‌లో ధూమపానం దురలవాటు వల్లే ప్రతివారం 17,887 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ రూపొందించిన ‘గ్లోబల్ టొబాకో అట్లాస్’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. స్మోకింగ్ వల్ల ఏటా భారత్‌కు వాటిల్లుతున్న నష్టం సుమారు రూ. 1,81,869 కోట్లుగా తేల్చింది. 
నివేదిక ప్రకారం, భారత్‌లో రోజూ సుమారు 4 లక్షల మంది బాలురు, 2 లక్షల మంది బాలికలు సిగరెట్ తాగుతున్నారు. వయోజనుల్లో పురుషులు 9 కోట్లు, మహిళలు సుమారు కోటిన్నర మంది పొగతాగుతున్నారు. 


చరిత్రలో అవిశ్వాస తీర్మానాలు
ప్రస్తుతం దేశంలో అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంటులో వివిధ ప్రభుత్వాలు ఎదుర్కొన్న విశ్వాస పరీక్షలు, అవిశ్వాస తీర్మానాలను ఓసారి పరిశీలిద్దాం. 
తొలి పదేళ్లలో అవిశ్వాసం రాలేదు.. 
పార్లమెంటు 66 ఏళ్ల చరిత్రలో లోక్‌సభలో ఇప్పటి వరకు అనేక విశ్వాస, అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగింది. మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోయిన ఐదుగురు ప్రధానులు రాజీనామా చేశారు. 
  • తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం మొదటి పదేళ్లలో(1952-62) ప్రతిపక్షాల నుంచి ఎటువంటి అవిశ్వాస తీర్మానాలనూ ఎదుర్కొనలేదు.
  • 1963 ఆగస్ట్‌లో మొదటిసారి నెహ్రూ సర్కారుపై లోక్‌సభలో సోషలిస్ట్ నేత జేబీ కృపలానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
  • లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న ఏడాదిన్నర కాలంలో ఆయన ప్రభుత్వంపై ఏకంగా మూడు అవిశ్వాస తీర్మానాలను (1964లో ఒకటి, 65లో రెండు) ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. అయితే నెహ్రూ, శాస్త్రిల హయాంలో కాంగ్రెస్‌కు పార్లమెంటులో భారీ మెజారిటీ ఉన్న కారణంగా ఆ అవిశ్వాసాలన్నీ వీగిపోయాయి.
  • ఇందిరాగాంధీ ప్రభుత్వంపై రికార్డు స్థాయిలో 15 అవిశ్వాస తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి.
ఓడి రాజీనామా చేసిన వాజ్‌పేయి 
1999 ఏప్రిల్‌లో బీజేపీ నేతృత్వంలోని కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు వెళ్లిపోవడంతో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా వాజ్‌పేయిని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయింది. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 1987లో తెలుగుదేశం నేత సి.మాధవరెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అది మూజువాణి ఓటుతో వీగిపోయింది. పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (1991-96) మూడు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని ఐదేళ్లు నిలబడగలిగింది. చివరగా 2003లో వాజ్‌పేయి ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోయింది. 

ఢిల్లీలో కృషి ఉన్నతి మేళాని సందర్శించిన ప్రధాని మోదీ 
ఢిల్లీలో మార్చి 16-18 వరకు జరిగిన వ్యవసాయ సదస్సు ‘కృషి ఉన్నతి మేళా-2018’ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. మార్చి 17న ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని.. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడాలన్నారు. పంట పెట్టుబడి కంటే మద్దతు ధర కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేందుకు.. పంట పండించడానికి అయ్యే అన్ని ప్రధాన ఖర్చులనూ పెట్టుబడి కింద లెక్కలోకి తీసుకుంటామని మోదీ భరోసానిచ్చారు. 
మద్దతు ధర పెట్టుబడి కంటే కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా చూస్తామని 2018-19 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
కృషి ఉన్నతి మేళాలో దాదాపు 800 స్టాళ్లు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులు, నూతన విధానాలపై అవగాహన కల్పించారు. 


చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్ 
దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను క్రై అనే ఎన్జీవో సంస్థ డెరైక్టర్ కోమల్ గనోత్రా విశ్లేషించారు. చిన్నారులపై నేరాల్లో 15 శాతంతో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఆయన తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. వృద్ధులపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణ 5వ స్థానాల్లో నిలిచాయి. 


ఐఎస్ అపహరించిన 39 మంది భారతీయులు మృతికేంద్రం 
ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది భారతీయులు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణం సమీపంలోని బదోష్ అనే గ్రామంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం వారు అపహరణకు గురైన భారతీయులేనని నిర్ధారణకు వచ్చినట్లు మార్చి 20న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభకు తెలిపారు. 
2014లో మోసుల్ పట్టణం ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉండగా.. మొత్తం 40 మంది భారతీయులు అపహరణకు గురవగా, వారిలో ఒకరు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింనని చెప్పుకుని సురక్షితంగా బయటపడ్డాడు. 

ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రామ్‌కు 2 మిలియన్ డాలర్లు
దేశీయంగా స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రెండో విడత ఇండియా ఇన్నోవేషన్ గ్రోత్ ప్రోగ్రాం (ఐఐజీపీ) 2.0కి టాటా ట్రస్ట్స్, లాక్‌హీడ్ మార్టిన్, కేంద్ర సైన్‌‌స అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు కేటాయించాయి. వ్యవసాయం, వైద్యం, నీరు, ఇంధనం మొదలైన రంగాల్లో సమస్యలకు సంబంధించిన సాంకేతిక పరిష్కారాల కనుగొనే ఔత్సాహిక వ్యాపారవేత్తలను తోడ్పడేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. డీఎస్‌టీ ప్రోగ్రామ్ హెడ్ (ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగం) హర్కేష్ మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. 


ఆయుష్మాన్ భారత్’కు కేంద్ర కేబినెట్ ఓకే 
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా భావిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఈ పథకం ద్వారా ఏటా 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అలాగే, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.2,161 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 21న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులతో అమలవుతున్న రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై), సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్‌‌స స్కీం(ఎస్‌సీహెచ్‌ఐఎస్) పథకాలను ఆయుష్మాన్ భారత్‌లో విలీనం చేయనున్నారు. 
ఇతర నిర్ణయాలు.. 

  • దేశంలో సెరీకల్చర్‌ను ప్రోత్సహించడానికి పట్టు పరిశ్రమ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ.2,161.68 కోట్లు వెచ్చించాలని నిర్ణయం. అలాగే ఈ రంగంలో ఉత్పాదక ఉద్యోగుల సంఖ్య 85 లక్షల నుంచి కోటికి పెరిగే అవకాశాలున్నాయి.
  • ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ జి.రోహిణి కమిటీ పదవీ కాలం జూన్ 20 వరకు పొడిగింపు.
  • వాణిజ్య సరోగసీని నిషేధించి, షరతులకు లోబడి పిల్లలు లేని దంపతులకు నైతిక సరోగసీకి వీలుకల్పించేలా చట్టంలో సవరణ చేయడానికి ఆమోదం.


ఆయుధాల దిగుమతిలో భారత్‌కు మొదటి స్థానం
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాల దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2008-12; 2013-17 మధ్యకాలంలో భారత్ ఆయుధాల దిగుమతి 24 శాత ం పెరిగనట్లు స్టాక్‌హోమ్‌కు చెందిన ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సిప్రీ) మార్చి 13న వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్ల దిగుమతులను పరిశీలిస్తే భారత్ వాటా 12 శాతంగా ఉంది. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా నుంచి భారత్ ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.

అత్యంత చౌకైన నగరంగా బెంగళూరు 
భారత్‌లో జీవించడానికి అత్యంత చౌకైన మెట్రో నగరంగా బెంగళూరు గుర్తింపు పొందింది. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) మార్చి 15న విడుదల చేసిన గ్లోబల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్-2018లో బెంగళూరు ప్రపంచంలోనే ఐదో చౌకైన నగరంగా నిలిచింది. ఈ సర్వేను ప్రపంచంలోని 139 మహానగరాలపై నిర్వహించారు. 

జాతీయ గీతం సవరణకు తీర్మానం 
జాతీయ గీతంలోని ‘సింధ్’ స్థానంలో ‘ఈశాన్యం’ అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా మార్చి 16న రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్‌లో ‘ఈశాన్యం’ కీలక ప్రాంతమైనా..దానికి జాతీయ గీతంలో చోటు లేకపోవడం దరుదృష్టకరమన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నామన్నారు.

కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు సమ్మతి కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం మార్చి 9న కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
కారుణ్య మరణం అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు.
చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డెరైక్టివ్ అంటారు. 
2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.
ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ
అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు. 2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు. 
యుథనేసియా రకాలు.. 
స్వచ్ఛంద(వాలంటరీ): 
రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్‌‌సలో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం. 
స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ): 
రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్‌‌సలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు. 
బలవంతపు(ఇన్‌వాలంటరీ): 
పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్‌వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు. 
పాసివ్, యాక్టివ్: 
పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు. 

న్యూఢిల్లీలో వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు 
మార్చి 10న పార్లమెంటు సెంట్రల్ హాలులో ‘వియ్ ఫర్ డెవలప్‌మెంట్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాలకు చెందిన శాసన సభ్యుల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అత్యంత వెనకబడ్డ జిల్లాల అభివృద్ధికి పాటుపడటం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడమేనని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆ క్రమంలో దేశంలోని 115 వెనకబడ్డ జిల్లాల అభివృద్ధి కోసం చట్ట సభ్యులు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో చట్టసభ్యులు నిజాయతీగా ఒక ఏడాది పనిచేస్తే.. గొప్ప మార్పు సాధించవచ్చని, మానవ అభివృద్ధి సూచీలో భారత్ పైకి ఎగబాకుతుందని చెప్పారు. 


న్యూఢిల్లీలో అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు

అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) వ్యవస్థాపక సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా ఆరుదేశాల ఉపాధ్యక్షులు, ఉప ప్రధానులతో పాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు సదస్సులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడతూ.. ప్రపంచంలోని అన్ని దేశాలకు చవకైన సౌరవిద్యుత్ సులువుగా అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో సోలార్ ఉత్పత్తి వాటాను పెంచాలని, అందుకోసం సోలార్ ప్రాజెక్టులకు రాయితీలపై రుణాలు సమకూర్చాలని ఆయన సూచించారు. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా భారత్ 175 గిగావాట్స్ విద్యుదుత్పత్తిని సాధించగలదని, ప్రస్తుత సామర్థ్యానికి అది రెండింతలని పేర్కొన్నారు. అలాగే... సోలార్ లక్ష్యాల్ని సాధించేందుకు 10 కార్యాచరణ సూత్రాల్ని ఈ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. చవకైన సోలార్ ఇంధనాన్ని అందుబాటులోకి తేవడం, కూటమి సమర్థంగా పనిచేసేలా నిబంధనలు, ప్రామాణికాల రూపకల్పన తదితర అంశాల్ని ఆయన ప్రస్తావించారు. 
సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో 121 దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న మోదీ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ(ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్).  

భవిష్యత్ ఆణిముత్యాల కోసం రిలయన్స్ యూనివర్సిటీ
పరిశోధన, ఆవిష్కరణలతోపాటు భవిష్యత్తు నేతలు, సంగీత విద్వాంసులు, శాస్త్రవేత్తలు, ఒలింపిక్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ఆమె క్రీడలు, విద్యకు సంబంధించిన అంశంపై మాట్లాడుతూ... ఈ రెండూ రేపటి రోజున భారత్ ఎదిగేందుకు గల శిఖరాలుగా పేర్కొన్నారు. 

యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం 
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. అనంతరం వారణాసి-పాట్నాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు, మోదీ, మాక్రాన్ కలిసి ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మిర్జాపూర్ జిల్లా ఛాన్వే బ్లాక్‌లో ప్రారంభించారు. 75 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ సోలార్ ప్లాండ్‌ను రూ.500 కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ఎంజీ (ఈఎన్‌జీఐఈ) సాంకేతిక సహకారంతో నిర్మించారు. 


ప్రపంచ స్మార్ట్ సిటీల్లో భువనేశ్వర్‌కు 20 వ స్థానంఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో 20వ స్థానం దక్కింది. జునిపర్ రీసెర్చ్ అనే సంస్థ ఇంటెల్ సాయంతో ‘గ్లోబల్ స్మార్ట్‌సిటీ పర్ఫామెన్స్ ఇండెక్స్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
ఈ జాబితాలో చోటు సాధించిన ఏకై క భారతీయ నగరం భువనేశ్వర్. రవాణా సౌకర్యాలు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత, ఉత్పాదకత అనే నాలుగు అంశాల్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. భద్రతలో ప్రపంచంలోనే 13వ ర్యాంకు దక్కించుకున్న భవనేశ్వర్.. రవాణా, ఆరోగ్యం, ఉత్పాదకత సూచీల్లో 20 స్థానంలో నిలిచింది. 2016లో భారత ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలోనూ భువనేశ్వర్ తొలిస్థానంలో నిలిచింది.
ఈ సర్వేలో సింగపూర్ నాలుగు అంశాల్లోనూ తొలిస్థానం సాధించింది. రెండో స్థానం రవాణా అంశంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు, ఆరోగ్యంలో సియోల్‌కు, భద్రతలో న్యూయార్క్‌కు, ఉత్పాదకతలో లండన్‌కు దక్కింది. ఇక మూడో స్థానంలో రవాణా, ఆరోగ్య రంగాల్లో లండన్.. భద్రత, ఉత్పాదకతల్లో షికాగో నగరాలు నిలిచాయి. 


ఆధార్ అనుసంధానం గడువు పొడిగించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలకు, ఆధార్ అనుసంధాన గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ముందుగా నిర్ణయించినట్లుగా మార్చి 31 తో అనుసంధానం పూర్తి కాలేదన్న కారణంతో ఈ తీర్పు వెలువరించింది. ఆధార్ చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేవరకు, మార్చి 31 తరువాత కూడా ఈ గడువు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే సంఘటిత నిధి నుంచి నిధులందే ఉపాధి హామీ, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆధార్ సంఖ్యను యథావిధిగా కోరవచ్చు.


ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో భాజపా ఓటమి
ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. గోరఖ్‌పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి విజయం సాధించింది. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ 21 వేల ఓట్లతో ఓడించగా, ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ బీజేపీ అభ్యర్థి కుశలేంద్ర సింగ్‌పై 59,613 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలుఈశాన్య భారతదేశంలోని త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడ్డాయి. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోట అయిన త్రిపురలో భారీ విజయాన్ని సాధించింది. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
త్రిపురలో బీజేపీ విజయం 
60 స్థానాలు ఉన్న త్రిపురలో బీజేపీ కూటమి (బీజేపీ 35, ఇండిజినెస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీటీఎఫ్)-8 ) 43 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. మాణిక్ సర్కార్ నేతృత్వంలోని సీపీఎం 16 స్థానాలకే పరిమితమైంది. మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా 20 ఏళ్లు కొనసాగారు. 
మేఘాలయలో హంగ్ 
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 60 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 59 స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 2, యునెటైడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ) 6, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) 4 చోట్ల గెలుపొందాయి. మేఘాలయలో ఏ పార్టీ లేదా సంకీర్ణ కూటమైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 30 స్థానాలు అవసరం. 
నాగాలాండ్‌లో అతిపెద్ద పార్టీగా ఎన్‌పీఎఫ్
నాగాలాండ్‌లో.. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్), బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ) కూటములు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. 60 సీట్లున్న నాగాలాండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ 31 కాగా, ఆ మార్కును ఏ పార్టీ, కూటమి చేరుకోలేక పోయింది. 

బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం 
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను మార్చి 5న ప్రారంభించారు. కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్ సంస్థ ఈ సేవలను ప్రవేశపెట్టింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్‌లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు. 


గ్రామీణ విద్యార్థుల కోసం "C మైనస్ 4 "
గ్రామీణ విద్యార్థుల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. చదువులో ముందు నిలిచేవారిని, ఆత్మవిశ్వాసం కలిగిన గ్రామీణ విద్యార్థుల్నే ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘ C మైనస్ 4’ అని నామకరణం చేశారు. ఇక్కడ సీ అంటే.. క్లాస్, మైనస్ 4 అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్నవారు. మొత్తానికి ‘ C మైనస్ 4’ అంటే.. తమకంటే నాలుగు తరగతులు తక్కువగా ఉన్న పిల్లలకు.. పిల్లలే బోధించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం ఎంపిక చేసిన పిల్లలను మంచి బోధకులుగా తీర్చిదిద్దుతారు. 
పలువురు ఐఐటీ ప్రొఫెసర్ల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘C మైనస్ 4’ ప్రాజెక్టు 2016లోనే ప్రారంభమైంది. దక్షిణ బెంగాల్‌లోని 12 పాఠశాలల్లో, చెన్నైలోని 11 పాఠశాలల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలుచేశారు. దీనివల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం స్థాయి పెరిగినట్లు స్పష్టంగా గుర్తించారు. 


ఎంపీల అలవెన్సుల పెంపునకు ఆమోదం
పార్లమెంటు సభ్యులకుఅందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2018, ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం-ఎంపీలకు ప్రతినెలా చెల్లించే నియోజకవర్గ అలవెన్స్ రూ.45వేల నుంచి రూ.70వేలకు చేరుకోనుంది. 
అలాగే ఆఫీస్ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్‌‌స రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నిచర్ అలవెన్‌‌సను రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.