Sunday, 11 February 2018

జనవరి 2018 జాతీయం

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు, ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక. 
ముఖ్య అతిథులు 
1. మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్‌సాన్ సూచీ 
2. వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్ జువాన్ 
3. ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె 
4. థాయలాండ్ ప్రధాని ప్రయుత్ చానోచా 
5. సింగపూర్ చీఫ్ సీన్ లూంగ్ 
6. బ్రూనై సుల్తాన్ హాజీ బోల్‌కయా 
7. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో 
8. మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ 
9. లావోస్ పీఎం థాంగ్‌లౌన్ సిసౌలిత్ 
10. కంబోడియన్ అధ్యక్షుడు హున్‌సేన్ 
ఆసియాన్ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి. 


చైనాకు భారత్-ఆసియాన్ దేశాల గట్టి సందేశం 
చైనాకు భారత్-ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఈ మేరకు 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా-ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను జనవరి 25న విడుదల చేశారు. 
భారత్-ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై మోదీ చర్చలు జరిపారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ.. ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం... గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 


సోషల్ మీడియాలో టాప్‌లో భారత్ అంటే బిజినెస్’ 
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న ‘భారత్ అంటే బిజినెస్’ (#Indiameansbusiness) హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు ప్రస్తావనకు వచ్చిన విషయంగా నిలిచింది. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖంగా వినిపించిన అంశాలపై అమెరికాకు చెందిన టాక్‌వాకర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్ అంటే బిజినెస్’ హ్యాష్‌ట్యాగ్ అత్యధికంగా39,252 సార్లు ప్రస్తావనకు రాగా, తరువాతి స్థానాల్లో వరుసగా మహిళలు (35,837), అమెరికా ఫస్ట్ (31,449), సంపద (22,896), కృత్రిమ మేధ(19,018), ప్రపంచీకరణ (16,513), వాతావరణ మార్పులు (15,477)అనే హ్యాష్‌ట్యాగ్‌లున్నాయి. 
వ్యక్తుల పరంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (2.73 లక్షల సార్లు) అగ్ర భాగంలో నిలిచారు. ఆ తరువాత ప్రధాని మోదీ, ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఎమాన్యుయెల్, బ్రిటన్ ప్రధాని థెరిసా, జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ ఉన్నారు. ఈసారి దావోస్ పేరు సామాజిక మాధ్యమాల్లో 20.20 లక్షల సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు టాక్‌వాకర్ వెల్లడించింది. 

2017 సంవత్సరపు హిందీ పదంగా ఆధార్’ 
ఆధార్ కార్డుతో దేశవాసుల మనసుల్లో బాగా నాటుకుపోయిన ‘ఆధార్’కు 2017 సంవత్సరపు హిందీ పదంగా గుర్తింపు లభించింది. జైపూర్ సాహితీ వేడుకలో భాగంగా జనవరి 27న ‘ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీస్’ అంశంపై జరిగిన చర్చలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధార్ తర్వాత మిత్రోన్(అసలు రూపం మిత్రో), నోట్‌బందీ, గోరక్షక్ అనే హిందీ పదాలు కూడా బాగా ప్రాచుర్యం పొందినట్లు వివిధ రంగాల నిపుణులు పేర్కొన్నారు.


మహారాష్ట్ర శకటానికి ప్రథమ బహుమతి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన శకటాలకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రాష్ట్రాల కేటగిరీలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని చూపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ల శకటాలు వరుసగా రెండో, మూడో బహుమతులు పొందాయి. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 28న ఢిల్లీలో బహుమతులను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కేటగిరీలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉత్తమ శకటం అవార్డు దక్కింది. త్రివిధ దళాల కేటగిరీలో ఆర్మీ పంజాబ్ రెజిమెంట్, పారా-మిలిటరీ దళాల కేటగిరీలో ఐటీబీపీలు ఉత్తమ కవాతు ట్రోఫీని పొందాయి. 

యాసిడ్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా
ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధి మాంద్యంతో పాటు యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగాల్లో 40 శాతానికి పైగా వైకల్యస్థాయి ఉన్న అభ్యర్థులకు మొత్తం ఖాళీల్లో నాలుగు శాతం కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మొత్తం గతంలో మూడు శాతంగా ఉండేది. దృష్టి లోపం, వినికిడి లోపం, సెరిబ్రల్ పాల్సీ, మరుగుజ్జు, కుష్ఠు వ్యాధి నయమైనవారు, యాసిడ్ దాడి బాధితులకు ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం(డీవోపీటీ) అన్ని ప్రభుత్వ విభాగాలకు ఇటీవల లేఖ రాసింది. వీరితో పాటు ఆటిజం, మానసిక అనారోగ్యం, బుద్ధిమాంద్యంతో బాధపడేవారికి కూడా ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కేటాయించాలని కోరింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగం వైకల్యమున్న ఉద్యోగుల ఫిర్యాదులు స్వీకరించడానికి ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందుకునే అధికారులు 2 నెలల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వైకల్యమున్న అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్దుబాటు చేయరాదని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 
 

పాత పద్ధతిలోనే పాస్‌పోర్ట్ 
ఈసీఆర్(ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) హోదా ఉన్న పౌరులకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం విరమించుకుంది. మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జనవరి 29న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాంగ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 
ఆరెంజ్ రంగు కవర్‌తో పాటు చివరి పేజీలో వ్యక్తిగత వివరాలు ముద్రించాలని గతంలో విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకోగా.. దీన్ని వ్యతిరేకిస్తు పలువురు వ్యక్తులు, బృందాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. 

సీజేఐ వేతనం నెలకు రూ.2.80 లక్షలు
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల వేతనాలను దాదాపు రెండు రెట్లు పెంచే బిల్లుపై రాష్ట్రపతి కోవింద్ జనవరి 30న సంతకం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతన, సర్వీసు నిబంధనల) సవరణ బిల్లు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ.1 లక్ష నుంచి రూ.2.80 లక్షలకు పెరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు కూడా రూ.80 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతాయి. 2016 జనవరి 1 నుంచే జడ్జీల వేతన పెంపు అమల్లోకి వస్తుంది. 

జాతీయ ఓటరు దినోత్సవం
అర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకొని భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. దీన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 25న ఏటా జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు.

గీన్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 177వ స్థానం
వాయు కాలుష్య నియంత్రణలో పేలవ పనితీరు, నామమాత్ర అటవీ సంరక్షణ చర్యలు.. భారత్‌ను 2018 గ్రీన్ ర్యాంకింగ్స్‌లో 177వ స్థానంలో నిలబెట్టాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)180 దేశాలతో కూడిన పర్యావరణ పనితీరు సూచీ (ఈపీఐ)ని జనవరి 23న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, డెన్మార్క్, మాల్టా, స్వీడన్ తొలి ఐదు స్థానాల్లో; బురుండీ(180), బంగ్లాదేశ్(179), కాంగో(178), భారత్(177), నేపాల్(176) చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.

దేశంలో తగ్గిన మరణ శిక్షలు
ఉరిశిక్ష ఖరారైన ఖైదీలు 2017 చివరి నాటికి భారత్‌లో 371 మంది ఉన్నట్లు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2016 చివరి నాటికి ఈ సంఖ్య 399గా ఉంది. 2016తో పోలిస్తే 2017లో 27 శాతం తక్కువగా ఉరి శిక్ష ఖారరైనట్లు పేర్కొంది. భారత్‌లో ‘మరణశిక్ష వార్షిక గణాంకాలు’ పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం జనవరి 25న నివేదిక విడుదల చేసింది.

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపురల్లో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతి జనవరి 18న ఢిల్లీలో ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. త్రిపురలో ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్‌ల్లో ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మూడు రాష్ట్రాల ఫలితాలను మార్చి 3న వెల్లడిస్తారు. ఈ మూడింటిలో ప్రతి రాష్ట్రంలోనూ 60 శాసనసభ స్థానాలే ఉన్నాయి. 
ప్రస్తుతం మేఘాలయలో కాంగ్రెస్, త్రిపురలో సీపీఎం, నాగాలాండ్‌లో నాగా పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. 

'ఐ క్రియేట్' కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ, నెతన్యాహుఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గుజరాత్‌లో ఏర్పాటు చేసిన 'ఐ క్రియేట్' ( International Centre for Entrepreneurship and Technology) ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నేరంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో కలిసి జనవరి 17న ప్రారంభించారు. అహ్మదాబాద్ సమీపంలోని దియోధోలేరా గ్రామంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. 


దివ్యాంగుల కోసం మరో 100 వెబ్‌సైట్లు దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దాదాపు 100 వెబ్‌సైట్లను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభించారు. దీంతో తమ శాఖ ‘వెబ్‌సైట్ యాక్సెసిబిలిటీ ప్రాజెక్టు’ కింద దివ్యాంగుల కోసం రూపొందించిన వెబ్‌సైట్ల సంఖ్య 917కు చేరుకుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దివ్యాంగులు సమాజంలో ఒక భాగమని మిగతా వారితో సమానంగా వారు వ్యవహరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు.

20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటుకు ఈసీ సిఫార్సుఢిల్లీ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు గాను ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. ఒకపక్క ఎమ్మెల్యేలుగా ఉంటూనే మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగారని.. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు సమంజసమేనని సిఫార్సుల్లో ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ సిఫార్సుల్ని సవాలు చేస్తూ అనర్హత జాబితాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసీ సిఫార్సులపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 20 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనా కేజ్రీవాల్ సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలముంది. 


విమానాల్లోనూ మొబైల్, ఇంటర్నెట్టెలికం రెగ్యులేటర్ ట్రాయ్... తాజాగా ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో... శాటిలైట్, టెరిస్ట్రియల్ నెట్‌వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది. విమానం 3,000 మీటర్లకన్నా ఎత్తులో ఉన్నపుడు మాత్రమే వాటిలో మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసులను అనుమతించాలని.. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఈ సేవలుండకూడదని పేర్కొంది. విమాన ప్రయాణం సమయంలో మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచినప్పుడే వై-ఫై సర్వీసులను అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇన్-ఫ్లైట్ కమ్యూనికేషన్‌‌స (ఐఎఫ్‌సీ) సర్వీస్ ప్రొవైడర్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలని ట్రాయ్ నివేదికలో పేర్కొంది. 

ఆప్ ఎమ్మేల్యేల అనర్హతకు రాష్ట్రపతి ఆమోదంలాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఢిల్లీ అసెంబ్లీలోని 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు జనవరి 21న కేంద్ర న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో కొనసాగారంటూ ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నాను’ అని రాష్ట్రపతి తెలిపారు.


కశ్మీర్‌లో సోనమ్ వాంగ్‌చుక్ వర్సిటీత్రీ ఇడియట్స్ సినిమాలో ఆమిర్‌ఖాన్ ‘ఫున్‌సుక్ వాంగ్‌డూ’పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో కీలక ప్రాజెక్టును చేపట్టారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్(ఎస్‌ఈసీఎంవోఎల్) పేరిట ఇప్పటికే లాభార్జన లేని ఓ పాఠశాలను ప్రారంభించిన సోనమ్.. తాజాగా యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లోనే రూ.800 కోట్లతో దాదాపు 200 ఎకరాల్లో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్‌‌స విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్లు సోనమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పెట్టుబడి కోసం క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ‘మిలాప్’ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. 2018, మార్చి ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి రూ.14 కోట్లు అవసరమన్నారు. ఇందులో భాగంగా జనవరి మాసాంతానికి రూ.7 కోట్లను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నుంచి సేకరిస్తామన్నారు. 
 

ఆధార్ భరోసాకు తాత్కాలిక వర్చువల్ ఐడీ ఆధార్ వల్ల ప్రజల సమాచార భద్రత, గోప్యత ప్రశ్నార్థకమవుతోందంటూ భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. సమస్యను అధిగమించేందుకు ఆధార్ ధ్రువీకరణ కోసం కొత్త పద్ధతిని త్వరలోనే అమల్లోకి తేనున్నట్లు జనవరి 10న ప్రకటించింది. నూతన విధానంలో ప్రజలెవరూ తమ 12 అంకెల ఒరిజినల్ ఆధార్ సంఖ్యను ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, ఆధార్ ఎక్కడ అవసరమైతే అక్కడ, దాని స్థానంలో తాత్కాలికంగా ఉండే ఒక వర్చువల్ గుర్తింపు సంఖ్యను మాత్రం ఇస్తే చాలని యూఐడీఏఐ పేర్కొంది. దీనివల్ల వినియోగదారుడి ఆధార్‌లో ఉన్న సమస్త సమాచారం వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కనిపించదనీ, కేవలం ఫొటో, పేరు వంటి నామమాత్రపు వివరాలు మాత్రమే అందేలా కొత్త విధానంలో పలు నియంత్రణలున్నాయని యూఐడీఏఐ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది. 
ఎలా పనిచేస్తుంది? 
ముందుగా వినియోగదారులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు అనుసంధానిస్తూ 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను యూఐడీఏఐ వినియోగదారుడికి కేటాయిస్తుంది. బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ విభాగాలు ఎక్కడైనా సరే...ప్రజలు తమ ఆధార్ నంబర్‌కు బదులుగా ఈ వర్చువల్ నంబర్‌ను ఇచ్చి, గతంలో మాదిరిగానే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వెంటనే వర్చువల్ నంబర్‌కు అనుసంధానమై ఉన్న ఆధార్ నంబర్‌లోని సమాచారం వాణిజ్య సంస్థలు/ప్రభుత్వ విభాగాలకు చేరుతుంది. అయితే ఆధార్‌లోని పూర్తి వివరాలు కాకుండా పేరు, ఫొటో, చిరునామా వంటి నామమాత్రపు సమాచారం మాత్రమే వారికి అందుతుంది. ఆ వివరాలతో కేవైసీ (మీ వినియోగదారుల గురించి తెలుసుకోండి) ధ్రువీకరణను సంస్థలు పూర్తి చేసుకుంటాయి. ఈ వర్చువల్ నంబర్‌ను వినియోగదారులు ఎన్నింటినైనా సృష్టించుకోవచ్చు. ఒక్కో వర్చువల్ సంఖ్య నిర్దిష్ట కాలంపాటు లేదా కొత్త నంబర్‌ను సృష్టించుకునే వరకు యాక్టివ్‌గా ఉంటుంది. సంస్థలకు వినియోగదారుడి ఆధార్ నంబర్‌తో పనిలేదు. అది వారికి తెలియాల్సిన అవసరం ఉండదు. అలాగే పరిమిత సమాచారం మాత్రమే యూఐడీఏఐ నుంచి సంస్థలకు అందుతుంది కాబట్టి ఈ వ్యవస్థ భద్రంగా ఉంటుందని యూఐడీఏఐ చెబుతోంది. వినియోగదారుడి తరఫున కంపెనీలు ఈ వర్చువల్ గుర్తింపు సంఖ్యను సృష్టించేందుకు కూడా అనుమతి ఉండదు. 
మార్చి నుంచి అమలు 
కొత్త విధానాన్ని మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యూఐడీఏఐ నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఆధార్ ధ్రువీకరణలన్నీ కొత్త విధానంలోనే జరుగుతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. నిర్దేశిత సమయం తర్వాత కూడా ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకోని కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ‘ఆధార్ నంబర్ కలిగినవారు ధ్రువీకరణల కోసం ఆధార్ నంబర్‌కు బదులుగా వర్చువల్ గుర్తింపు సంఖ్యను వాణిజ్య సంస్థలకు ఇవ్వొచ్చు. గతంలో ఆధార్ నంబర్ చెప్పి వేలిముద్రలు ఎలా వేసేవారో ఇప్పుడు కూడా అలాగే ఈ తాత్కాలిక నంబర్ చెప్పి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది’ అని సర్క్యులర్‌లో యూఐడీఏఐ పేర్కొంది. 
ఆందోళనలు తగ్గించేందుకే ఆధార్ కార్డు కోసమంటూ ప్రజల మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వేలిముద్రలు, ఐరిస్ సహా ఎంతో సున్నితమైన సమాచారాన్ని యూఐడీఏఐ సేకరిస్తోంది. అయితే ఈ సమాచారానికి రక్షణ కరువైందనీ, ఎవరికి పడితే వారికి ఆధార్ సమాచారం చాలా సులువుగా దొరుకుతోందని నిరూపించేలా పలు ఘటనలు జరిగాయి. ఈ నెల 3న ఆంగ్ల పత్రిక ‘ద ట్రిబ్యూన్’... రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారం కావాలన్నా దొరుకుతోందంటూ ఆధారాలతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించడం, ఆ తర్వాత పత్రిక, ఆ వార్త రాసిన విలేకరిపై ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించేందుకు, ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చూసేందుకే యూఐడీఏఐ కొత్త విధానం ప్రకటించినట్లు తెలుస్తోంది. 
ప్రస్తుత విధానంలో.. 
  • 12 అంకెల ఆధార్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి
  • వాణిజ్య సంస్థల చేతికి ఆధార్‌లోని పూర్తి సమాచారం వెళ్తుంది
  • ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది.
కొత్త విధానంలో..
  • 16 అంకెల వర్చువల్ సంఖ్యను వెల్లడించాలి
  • వేలిముద్ర వేయాలి.
  • వాణిజ్య సంస్థలకు పేరు, ఫొటో, చిరునామాతో పరిమిత సమాచారమే వెళ్తుంది.
  • ఎన్ని తాత్కాలిక సంఖ్యలనైనా సృష్టించుకోవచ్చు.

1984 అల్లర్లపై మరో సిట్సంచలనం సృష్టించిన 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నాటి అల్లర్లకు సంబంధించిన 241 కేసుల్లో 186 కేసులను ఎలాంటి దర్యాప్తు జరపకుండానే మూసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తాజా దర్యాప్తును పర్యవేక్షించేందుకు మళ్లీ త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలోని త్రిసభ్య బృందంలో ఆయనతో పాటు అభిషేక్ దులార్(2006 బ్యాచ్ ఐపీఎస్), రాజ్‌దీప్ సింగ్ (రిటైర్డ్ ఐజీ ర్యాంకు అధికారి)సభ్యులుగా ఉన్నారు. ఈ సిట్ రెండు నెలల్లో నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ అదేశించింది. 
1984 నాటి ఇందిర హత్యానంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. 

ఆధార్‌కు ‘బయోమెట్రిక్’ లాక్ఆధార్ సమాచారానికి రక్షణ, గోప్యత కోసం 16 అంకెల వర్చువల్ గుర్తింపు సంఖ్యను మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ వర్చువల్ ఐడీ కన్నా ముందే ఆధార్ వెబ్‌సైట్‌లో మరో సెక్యూరిటీ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి్య, తన బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు. లాక్ ఆన్ చేసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఆధార్ ధ్రువీకరణకు వేలిముద్ర వేసినా పనిచేయదు. వినియోగదారుడు తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మళ్లీ బయోమెట్రిక్ డేటాను అన్‌లాక్ చేయొచ్చు. వేలి ముద్ర వేసి ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాగానే మళ్లీ లాక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో బయోమెట్రిక్ సమాచారం భద్రంగా ఉంటుందనీ, ఆధార్ వివరాలను ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ అవకాశాన్ని కల్పించామని యూఐడీఏఐ సీఈవో తెలిపారు. 

హజ్ సబ్సిడీ రద్దు: కేంద్ర మంత్రి నఖ్వీ ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జనవరి 17న తెలిపారు. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదని.. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తామని వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ చెప్పారు. సబ్సిడీలో భాగంగా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు. 


సివిల్స్, గ్రూపు-1లకు ఉమ్మడి సిలబస్యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1లేదా తత్సమాన ఉన్నత శ్రేణి పరీక్షలకు 60శాతం ఉమ్మడి (కామన్) సిలబస్ ఉండాలన్న ప్రతిపాదనకు గోవాలో జరిగిన రాష్ట్రాల పీఎస్సీల జాతీయ సదస్సు 2018, జనవరి 12న ఆమోదించింది.

జోజిలా పాస్ సొరంగానికి కేబినెట్ ఓకేజమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జనవరి 3న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది. 
హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం-1లోని హల్దియా-వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

మహిళల కోసం ప్రత్యేకంగా నారీ పోర్టల్మహిళలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఓ చోట అందించేందుకు వీలుగా రూపొందించిన "NARI" వెబ్ పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రారంభించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ పోర్టల్‌లో మహిళా సంక్షేమానికి సంబంధించిన 350కి పైగా పథకాల సమాచారాన్ని పొందు పరిచారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఫిర్యాదుల సదుపాయాన్ని కల్పించారు.


రక్తదాతలకు వేతనంతో కూడిన సెలవు ఎదుటివారి ప్రాణాలు నిలపగలిగే శక్తి ఉన్న రక్తదాన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులు ఏడాదిలో ఇలాంటివి గరిష్టంగా నాలుగు సెలవులను వాడుకోవచ్చు. రక్తదానానికి సెలవులు మంజూరు చేసే విధానం కొన్ని విభాగాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో.. రక్తదానంతో పాటు ప్లేట్‌లెట్స్, రక్త కణాలు, ప్లాస్మాను దానం చేసేవారికి కూడా సెలవులు వర్తింపజేసే విధంగా నిబంధనలు సవరించారు. ఉద్యోగులు దీనికి సంబంధించి లెసైన్‌‌సలు కలిగి ఉన్న రక్తనిధి కేంద్రాల్లోనే రక్తదానం చేయడమే కాకుండా.. అందుకు తగిన ఆధారాలను కూడా అందజేయాల్సి ఉంటుంది. 

పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నం ఆవిష్కరణ పశ్చిమ బెంగాల్ అధికారిక చిహ్నాన్ని (రాజముద్ర) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 5న ఆవిష్కరించారు. విశ్వ బంగ్లా, అశోక చక్రంతో కూడిన ఈ రాజముద్రని.. మమతా బెనర్జీయే స్వయంగా రూపొందించారు. అనంతరం ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ రాజముద్రకి ఆమోదం తెలపటంతో.. కోల్‌కతాలో అధికారంగా ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ జీవోలు, అధికారిక కార్యక్రమాల్లో ఇకపై ఈ రాజముద్రను వినియోగించనున్నారు. 

మధ్యప్రదేశ్‌లో ఆలిండియా డీజీపీల సదస్సు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్‌ఎఫ్ అకాడమీలో జనవరి 6-8 వరకు జరిగిన డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో మోదీ విసృ్తతంగా చర్చించారు. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
గతేడాది హైదరాబాద్..ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విసృ్తత చర్చ జరిగింది. 
 

సెక్షన్ 377ను పునఃపరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విసృ్తత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోన్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై అభ్యంతరాల్ని విసృ్తత ధర్మాసనం చర్చించాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది.
పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కంలో పాల్గొనే వయోధికుల్ని శిక్షించేందుకు అనుమతిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసహజ నేరాల్ని పేర్కొంటున్న సెక్షన్ 377 ప్రకారం ‘ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే వారు శిక్షార్హులు. నేరం రుజువైతే వారికి జీవిత ఖైదు, జరిమానాతో పాటు అవసరమైతే శిక్షను గరిష్టంగా పదేళ్ల వరకూ పొడిగించవచ్చు.’ ఐపీసీ 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ నవ్‌తేజ్ సింగ్ జోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ‘377 సెక్షన్‌ను సమర్ధిస్తూ 2013 నాటి సుప్రీం తీర్పుపై క్యూరేటివ్ పిటిషన్ ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్‌ను అదే ధర్మాసనం విచారిస్తుంది’ అని స్పష్టం చేసింది. 
1861నుంచి నేరంగా...ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదంది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయి. 
 

డిసెంబర్‌కల్లా భారత్ నెట్ రెండో దశ పూర్తిదాదాపు 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించే దిశగా తలపెట్టిన భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశ.. 2018 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వాస్తవానికి దీని గడువు 2019 మార్చి దాకా ఉన్నప్పటికీ.. అంతకన్నా ముందే పూర్తి కావొచ్చని తెలిపారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తయిన సందర్భంగా జనవరి 8న జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. రెండో దశను వేగవంతం చేసే దిశగా సకాలంలో పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం... లేకపోతే జరిమానా విధించడం మొదలైన నిబంధనలు కాంట్రాక్టుల్లో చేర్చాల్సి ఉందని ఆయన చెప్పారు. 
తొలి దశలో లక్ష గ్రామ పంచాయతీలకు హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. మరో 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ని అందుబాటులోకి తెచ్చేలా రెండో దశ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అందుబాటు ధరల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తరణ ఈ భారీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 


థియేటర్లలో జాతీయగీతం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్రం ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు సినిమాహాళ్లలో జాతీయగీతం పాడటంపై మార్పులు చేసేందుకు 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కమిటీ ఆరు నెలల కాలంలో తమ నివేదికను సమర్పిస్తుంది.


న్యూఢిల్లీలో ప్రవాస భారత పార్లమెంటేరియన్ల సదస్సు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారత పార్లమెంటేరియన్లతో నిర్వహించిన ‘పర్సన్‌‌స ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐఓ)’ తొలి సదస్సు జనవరి 9న న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఏ దేశ భూభాగంపైగానీ, వనరులపైన గానీ భారత్‌కు కన్ను లేదని పునరుద్ఘాటించారు. దక్షిణాసియాలో ఆధిపత్యానికి ఇటీవల చైనా చేస్తున్న ప్రయత్నాల్ని పరోక్షంగా విమర్శిస్తూ.. ఇతర దేశాలకు అభివృద్ధి సాయం చేసే విషయంలో మానవతా దృక్పథమే తప్ప.. భారత్‌ది ఇచ్చి పుచ్చుకునే ధోరణి కాదని స్పష్టం చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, అభివృద్ధికి సహాయకారిగా ఉండాలని ప్రవాస భారత పార్లమెంటేరియన్లను మోదీ కోరారు.
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మహాత్మాగాంధీ వచ్చినరోజుకు సంబంధించిన 102వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును నిర్వహించారు. 24 దేశాలకు చెందిన 134 మంది ప్రవాస భారతీయ ప్రజా ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. 


జడ్జీల వేతనాల బిల్లుకు లోక్‌సభ ఆమోదంసుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు బిల్లును లోక్‌సభ జనవరి 4న ఆమోదించింది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నెల వేతనం రూ.లక్ష నుంచి రూ.2.80 లక్షలకు; సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు పెరుగుతుంది. అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ.90,000 నుంచి రూ.2.50 లక్షలకు; హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రూ.80,000 నుంచి రూ.2.25 లక్షలకు చేరనుంది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు చేసిన ఈ మార్పులు 2016, జనవరి 1 నుంచి వర్తిస్తాయి.

హిమాచల్‌ప్రదేశ్‌కు ఎయిమ్స్ 
హిమాచల్‌ప్రదేశ్‌కు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం జనవరి 3న నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ వద్ద రూ.1,350 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణాన్ని 48 నెలల్లో పూర్తిచేస్తారు.

18వ అఖిల భారత విప్‌ల సదస్సు18వ అఖిల భారత విప్‌ల సదస్సును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ జనవరి 8న ఉదయ్‌పూర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్‌లు పార్టీ సభ్యులను పర్యవేక్షించడంతోపాటు చైతన్యవంతులను చేయాలని సూచించారు. చట్టసభల్లో సభ్యల ప్రవర్తన, క్రమశిక్షణలను పరిశీలించాల్సింది విప్‌లేనన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి దాదాపు అన్ని రాష్ట్రాల విప్‌లు హాజరయ్యారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం 
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. 
బిల్లులో ఏముంది..ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. 
  • రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.
  • బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.
  • మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది. 

ఇక నుంచి భారత సైన్యంలో ఒంటెలుచైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. 

మన్‌కీబాత్’ ట్విటర్‌లో టాప్ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.

లోక్‌సభకు మెడికల్ కమిషన్ బిల్లుకీలకమైన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును ప్రభుత్వం డిసెంబర్ 29న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వైద్య విద్యలో మరింత పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వైద్య విద్య విభాగంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ పలు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు సంస్కరణలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. 
బిల్లులోని ముఖ్యాంశాలు..
  • నేషనల్ మెడికల్ కమిషన్‌కు ఛైర్మన్‌తోపాటు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.
  • ఈ బిల్లు ద్వారా గ్రాడ్యుయేషన్ వైద్య విద్యకు ఒక బోర్డు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్యకు మరో బోర్డు, వైద్య విద్యా సంస్థల గుర్తింపు, సమీక్షకు ఒక బోర్డు, వైద్యుల రిజిస్ట్రేషన్ బోర్డు ఏర్పాటవుతాయి.
  • వైద్య కళాశాలలు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించుకునేందుకు, సీట్లను పెంచుకునేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
  • వైద్య విద్యలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
  • పీజీ చేసిన వారు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రత్యేక పరీక్ష రాయాల్సి ఉంటుంది.


సత్యేంద్రనాథ్ బోస్ జయంత్యుత్సవాల్లో మోదీ ప్రసంగంశాస్త్ర సాంకేతికాంశాలను విసృ్తతపరిచేందుకు వ్యవహారిక భాష వినియోగం పెరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలోనూ సైన్‌‌సపై ఆసక్తి పెరుగుతుందన్నారు. భాష ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కారాదన్నారు. ప్రతి శాస్త్రవేత్త, పరిశోధనకారుడు నవభారత నిర్మాణం దిశగా తన సృజనాత్మకతకు పదునుపెట్టాలన్నారు. ఈ మేరకు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ 125వ జయంతి స్మారక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా జనవరి 1న కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని వాటర్‌షెడ్ సంవత్సరంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినందున శాస్త్రవేత్తలు ఈ దిశగా సృజనాత్మక అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు. 

ఎలక్టోరల్ బాండ్ల విధి విధానాలు ఖరారు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాల్లో పారదర్శకత కోసం అమల్లోకి తేనున్న ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ బాండ్ల జారీకి సంబంధించిన విధివిధానాల్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జనవరి 2న ప్రకటించారు. విరాళాలిచ్చే దాతలు ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుంచి కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఆ బాండ్లను ఈసీకి సమర్పించిన బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము చేసుకోవాలని ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలకిచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న ఈ ఎలక్టోరల్ బాండ్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పది రోజుల పాటు ఎంపిక చేసిన ఎస్‌బీఐ శాఖల్లో అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలున్న సంవత్సరంలో మాత్రం 30 రోజుల పాటూ బాండ్లను విక్రయిస్తారు. కొనుగోలు అనంతరం 15 రోజుల పాటు ఇవి చెల్లుబాటు అవుతాయి. బాండ్లపై విరాళమిచ్చే దాత పేరు ఉండదని, అయితే వాటిని కొనుగోలు చేసే వ్యక్తి లేక కంపెనీ.. బ్యాంకుకు కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని జైట్లీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఖరారు చేసిందని వెల్లడించారు. 
కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకే ప్రామిసరీ నోటును పోలిఉండే ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ ఇవ్వవు. బాండ్లలో పేర్కొన్న మొత్తాన్ని రాజకీయ పార్టీలకు చెల్లించేవరకు వాటిపై పూర్తి హక్కులు దాతకే చెందుతాయి. అయితే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1 శాతం ఓట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీలకు మాత్రమే ఈ బాండ్ల సొమ్మును చెల్లిస్తారు. అందుకోసం పార్టీలు ఎన్నికల సంఘానికి బ్యాంకు ఖాతాను ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 1000, రూ. 10 వేలు, రూ. లక్ష, రూ. 10 లక్షలు, రూ. కోటి మొత్తాల్లో బాండ్లను దాతలు కొనుగోలు చేయవచ్చు. భారతీయ పౌరులు, భారత్‌లోని కార్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను కొనుగోలు చేసేందుకు అర్హులు. అయితే బాండ్లపై కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఉండదు. 15 రోజుల్లోగా పార్టీలు వాటిని సొమ్ము చేసుకోవాలి. 

స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది. 


అసోం తొలి ఎన్‌ఆర్‌సీ ముసాయిదా విడుదలజాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ-నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్) తొలి ముసాయిదాను అసోం జనవరి 1న ప్రచురించింది. రాష్ర్టంలోని మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 1.9 కోట్ల మంది పేర్లను ఇందులో చేర్చారు.

బ్రహ్మపుత్రలో జలరవాణా ప్రారంభంకేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డిసెం బర్ 29న బ్రహ్మపుత్ర నదిలో పాండు-ధుబ్రి మధ్య కార్గో రవాణాను ప్రారంభించారు. ఎగువ అసోంలోని సాదియా నుంచి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని ధుబ్రి మధ్య బ్రహ్మ పుత్ర నదిలో 891 కి.మీ. పొడవున అభివృద్ధి చేసిన జలర వాణా మార్గాన్ని జాతీయ జలమార్గం-2గా ప్రకటించారు. దీన్ని ప్రారంభించడంతో 300 కి.మీ. మేర రహదారి ప్రయా ణం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు ఆదా అవుతాయి.

డిసెంబర్ 2017 జాతీయం

కేంద్ర విభాగాల్లో 4.12 లక్షల ఖాళీలు

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2016, మార్చి 1 నాటికి దాదాపు 4.12 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం డిసెంబర్ 20న లోక్‌సభకు తెలిపింది. కేంద్ర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల వార్షిక నివేదిక’ ప్రకారం 2016 మార్చి నాటికి మొత్తం 36.33 లక్షల ఉద్యోగాలకు గానూ 4.12 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. కేంద్ర సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైల్వేశాఖ భద్రతా విభాగంలో 2017, ఏప్రిల్ నాటికి 1.28 లక్షల ఖాళీలు ఉన్నాయి.

వడోదరలో తొలి రైల్వే వర్సిటీదేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్‌‌సపోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని డిసెంబర్ 20న ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్‌‌సలర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది. 


గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన ప్రణాళిక అంతరాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదులను అనుసంధానం చేయడానికి జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సరికొత్త ప్రణాళిక రచించింది. అంతరాష్ట్ర జల వివాదాలు తలెత్తకుండా, ముంపు సమస్య లేకుండా.. తక్కువ ఖర్చుతో నాలుగు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం గోదావరి నదిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినెపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడ నుంచి 247 టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. నాగార్జునసాగర్ నుంచి సోమశిల రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి తమిళనాడులోని కావేరీ గ్రాండ్ ఆనకట్టలోకి నీటిని తరలిస్తారు. 
మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది.


2జీ స్పెక్ట్రమ్ కేసులో అందరూ నిర్దోషులే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ డిసెంబర్ 21న ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి
ఓపీ సైనీ ఉద్ఘాటించారు. కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని అన్నారు. 
2జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లెసైన్సులు కేటాయించింది. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లెసైన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లెసైన్సులను రద్దు చేసింది.


యూపీలో కల్తీ సారా’కు మరణశిక్షకల్తీ సారా అమ్మి అమాయక ప్రజల మరణానికి కారకులయ్యేవారికి మరణశిక్ష విధించే బిల్లును ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ డిసెంబర్ 22న ఆమోదించింది. యూపీ ఎకై ్సజ్(సవరణ) చట్టం-2017 ప్రకారం కల్తీ సారా వల్ల మరణాలు సంభవిస్తే దాని తయారీతో సంబంధమున్న వారికి మరణశిక్ష లేదా యావజ్జీవంతో పాటు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. కల్తీ సారాతో అంగవైకల్యం సంభవిస్తే సారా తయారీదారుకు గరిష్టంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. రూ.5 లక్షల వరకూ జరిమానా విధించవచ్చు. ఇటీవలి కాలంలో కల్తీసారాతో వరుస మరణాలు సంభవించడంతో సెప్టెంబర్‌లో ఎక్సైజ్ చట్టానికి సవరణలు చేసి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్‌‌స తీసుకొచ్చింది.


ఢిల్లీ మెట్రో మెజెంటా మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రారంభించారు. అనంతరం.. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. 


అభివృద్ధి ప్రాజెక్టులకు 56,070 హెక్టార్ల అటవీ భూములు గడిచిన మూడేళ్లలో (2014-15 నుంచి 2016-17 వరకు) దేశవ్యాప్తంగా 56,070 హెక్టార్ల అటవీ భూములను వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మళ్లించినట్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అటవీ భూములు మళ్లించిన రాష్ట్రాల్లో హరియాణా మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. హరియాణా 7,944 హెక్టార్ల అటవీ భూములను ఇతర అవసరాల కోసం వినియోగించుకోగా.. తెలంగాణ 7,149 హెక్టార్ల అటవీ భూములను మళ్లించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,343 హెక్టార్ల అటవీ భూములను మళ్లించి 8వ స్థానంలో నిలిచింది. 
కాగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలసి ఈ మూడేళ్లలో 93,400 హెక్టార్లలోనే అడవులను పెంచాయి. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. ఆ మేరకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా-2015 నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 21.60 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 18.80 శాతమే. ఏపీలో 24.42 లక్షల హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం ఉంది. ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 15.25 శాతమే. 
ఇటీవల కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో 2013 నుంచి 2015 మధ్య 168 చదరపు కి.మీ. మేర (16,800 హెక్టార్ల మేర)అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. 


మణిపూర్‌లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. 
ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది. 


వలసల్లో మొదటి స్థానంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో ఎక్కువగా ఉంటున్న వారి జాబితాలో భారతీయులు మొదటి స్థానంలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 18న విడుదల చేసిన అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం- 1.7 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. అత్యధికంగా గల్ఫ్ ప్రాంతంలో 50 లక్షల మంది నివసిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న దేశాలు యూఏఈ(30 లక్షలు), అమెరికా(20 లక్షలు), సౌదీ అరేబియా(20 లక్షలు). మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 25.8 కోట్ల మంది సొంత దేశంలో కాకుండా.. ఇతర దేశాల్లో నివసిస్తున్నారు. ఇది 2000 నాటితో పోల్చితే 49 శాతం ఎక్కువ. 

కంపెనీల చట్టం సవరణకు రాజ్యసభ ఆమోదం కంపెనీల చట్టం సవరణ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 19న ఆమోదించింది. ఇందులో దివాళా తీసే కంపెనీలపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. కొత్తగా కార్పొరేట్ పాలనా ప్రమాణాల పటిష్టత, సరళతర వాణిజ్యానికి ఉపయోగపడేలా కొన్ని నిబంధనలు చేర్చారు. ఈ బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించింది. 

బెంగళూరు నగరానికి అధికారిక చిహ్నం అధికారిక చిహ్నం (లోగో) రూపొందించుకున్న భారత్‌లోని తొలి నగరంగా బెంగళూరు ఘనతను సొంతం చేసుకుంది. కన్నడ, ఆంగ్ల లిపి కలగలిసిన ఈ లోగోనూ ఎరుపు, తెలుపు రంగులో రూపొందించారు. దీనిని కర్ణాటక పర్యాటక, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిసెంబర్ 24న ఆవిష్కరించారు. దీంతో న్యూయార్క్, మెల్‌బోర్న్, సింగపూర్ లాంటి సిటీల సరసన బెంగళూరు నిలిచింది. ఒక పోటీ నిర్వహించి ఈ లోగోను నిపుణుల బృందం ఎంపిక చేసింది. నమ్మూరుకి చెందిన డిజైనర్ వినోద్ కుమార్ చిహ్నాన్ని రూపొందించారు. ఇంగ్లిష్ అక్షరాలను కన్నడ లిపి మాదిరిగా కనిపించేలా డిజైన్ చేశారు. 


మార్చి 1 నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని విచారించేందుకు దేశవ్యాప్తంగా 2018 మార్చి నాటికి 12 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టుల్ని సంప్రదించి రాష్ట్రాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం డిసెంబర్ 14న ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదంట్రిపుల్ తలాక్ (తలాక్- ఇ-బిద్దత్) పై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం డిసెంబర్ 15న ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం నేరం. అందుకు గాను భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేట్లు బిల్లును రూపొందించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి సభ్యులుగా ఉన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
  • రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలైన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • జాతీయ ఆయుష్ మిషన్ (ఎన్‌ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయిపుంచింది.


ఆగ్నేయాసియా గేట్‌వేగా మిజోరాం : మోదీ మిజోరం రాష్ట్రంలోని కొలాసిబ్ ప్రాంతంలో నిర్మించిన 60 మెగావాట్ల తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోం రైఫిల్స్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించిన మోదీ.. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాల అభివృద్ధికి తమ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్‌లోని సిత్వే పోర్టును మిజోరాంతో అనుసంధానించే కలడన్ మల్టీమోడల్ ట్రాన్సిట్ ట్రాన్‌‌సపోర్ట్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి విసృ్తత ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. కంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్‌‌స వంటి 10 ఆసియన్ కూటమి దేశాలకు మిజోరాం ముఖద్వారంగా మారనుందని చెప్పారు.



దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిదివ్యాంగులకు ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే అన్ని ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో 5 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల చట్టం -2016, సెక్షన్ 32 పరిధిలోకి వచ్చే అన్ని విద్యాసంస్థలు ఏటా ఈ నిబంధనను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.

ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపుప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును 2018 మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుంది.


కులాంతర వివాహానికి రూ. 2.5 లక్షల ప్రోత్సాహం కుల విబేధాలను రూపుమాపే దిశగా కులాంతర వివాహాలను ప్రోత్సహించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 5న సవరించింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న వార్షికాదాయ పరిమితి నిబంధనను తొలగించింది. తాజా సవరణ ప్రకారం.. ఇకపై కులాంతర వివాహం చేసుకునే వారిలో ఒకరు దళితులైతే వారికి కేంద్రం నుంచి రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా లభిస్తుంది. 

కుంభమేళాకు సాంస్కృతిక వారసత్వ సంపద గుర్తింపు 
ప్రపంచ వారసత్వ సంస్థ యునెస్కో కుంభమేళాను డిసెంబర్ 7న సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని జెజూలో డిసెంబర్ 4 నుంచి 9 వరకు జరిగిన సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ 12వ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు శాంతియుతంగా హాజరయ్యే సమ్మేళనమే కుంభమేళా. 


హైకోర్టుల్లో 40 లక్షల పెండింగ్ కేసులుదేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో దాదాపు 40.15 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో గత పదేళ్లకు సంబంధించినవే 5,97,650 కేసులున్నాయి. ఈ మేరకు 24 హైకోర్టులకు సంబంధించి 2016 చివరి వరకు పెండింగ్‌లో ఉన్న కేసులపై నేషనల్ జ్యుడీషియల్ డాటా గ్రిడ్ ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం పెండింగ్ కేసుల్లో చివరి పదేళ్లకు సంబంధించిన కేసుల శాతం 19.45గా ఉండగా ఒక్క బాంబే హైకోర్టులోనే లక్షకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


గణతంత్ర వేడుకలకు 10 దేశాల అధినేతలుజనవరి 26న నిర్వహించే భారత 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు పది ఆగ్నేయాసియా దేశాల అధినేతలను ఆహ్వానించనున్నారు. 60 ఏళ్లుగా ప్రతి గణతంత్ర దినోత్సవానికీ ఓ దేశాధినేతను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాధినేతలను ఆహ్వానించనున్నారు. 
ఆగ్నేయాసియా దేశాలతో భారత్ సంబంధాలను ఏర్పరచుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 25న స్మారకోత్సవాలను నిర్వహిస్తారు.


పరువు హత్యకేసులో ఆరుగురికి ఉరిశిక్షకూతురు తక్కువ కులస్తుడిని పెళ్లాడటంతో అల్లుడిని చంపిన కేసులో మామతో సహా ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ తమిళనాడులోని తిరుప్పూరు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అలమేలు నటరాజన్ డిసెంబర్ 12న తీర్పు చెప్పారు. తిరుప్పూరు జిల్లాకు చెందిన శంకర్(22) దిండుగల్లు జిల్లాకు చెందిన కౌసల్య (20)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కౌసల్య తండ్రి మరో ఆరుగురితో కలిసి 2016 మార్చి 13న శంకర్‌ను హతమార్చారు.


ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులుదేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. 2014 వరకు అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారం కోసం కేంద్రం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి రూ.7.80 కోట్లను కేటాయించనుంది.


అత్యధిక మలేరియా కేసుల్లో భారత్‌కు మూడోస్థానం2016 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక మలేరియా కేసులు నమోదైన 15 దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)-2017 నివేదికను నవంబర్ 29న విడుదల చేసింది. 27 శాతం కేసులతో నైజీరియా మొదటి స్థానంలో ఉండగా, 10 శాతంతో కాంగో రెండో స్థానంలో ఉంది. 
ప్రపంచ వ్యాప్తంగా 4.45 లక్షల మలేరియా మరణాలు సంభవించగా, 33,997 మరణాలతో కాంగో మొదటి స్థానం, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. 


కోపర్డీ’ దోషులకు ఉరిశిక్ష ఖరారుమహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపేసిన కేసులో దోషులకు అహ్మద్‌నగర్ సెషన్‌‌స కోర్టు నవంబర్ 29న మరణశిక్ష విధించింది. జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 2016, జూలై 13న ఈ ముగ్గురు రేప్‌చేసి చంపేశారు. దీంతో అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి నవంబర్ 18న వీరిని దోషులుగా నిర్ధారించారు.


ఎన్‌సీబీసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదంజాతీయ బీసీ కమిషన్ (ఎన్‌సీబీసీ)కు రాజ్యాంగ బద్ధత కల్పించే బిల్లుకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఓబీసీల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును లోక్‌సభ యథాతథంగా ఆమోదించగా, రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1993లోనే ఏర్పాటుచేసిన ఎన్‌సీబీసీకి కేంద్ర జాబితాలో ఏఏ వర్గాలను చేర్చాలో, తొలగించాలో అన్న విషయమై సిఫార్సుచేసే అధికారం మాత్రమే ఉంది.


నేరాల్లో ఉత్తరప్రదేశ్ టాప్ : ఎన్‌సీఆర్‌బీ నివేదికహత్యలు, మహిళలపై నేరాలు వంటి వాటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాలపరంగా చూస్తే ఢిల్లీలో ఎక్కువగా రేప్‌లు (40%) జరిగినట్లు తెలిపింది. 2016లో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్ 30న విడుదల చేశారు.
నివేదిక ముఖ్యాంశాలు
  • యూపీలో 2016లో అత్యధికంగా 4889 హత్యలు జరిగాయి. ఇది దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం హత్యల్లో 16.1 శాతం. బిహార్ 2581 (8.4%) హత్యలతో తరువాతి స్థానంలో ఉంది.
  • మహిళలపై నేరాలకు సంబంధించి యూపీలో 49,262 (14.5%) కేసులు నమోదవగా, పశ్చిమ బెంగాల్‌లో 32,513 (9.6) కేసులు నమోదయ్యాయి.
  • దేశవ్యాప్తంగా రేప్ కేసులు 2015తో పోల్చితే 12.4 శాతం పెరిగాయి. ఈ విషయంలో మధ్యప్రదేశ్(4882), యూపీ (4816), మహారాష్ట్ర(4,189) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
  • ఐపీసీ కింద నమోదైన కేసులు యూపీలో 9.5 శాతం ఉన్నాయి. తరువాతి స్థానంలో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ (8.7%) ఉన్నాయి.
  • అపహరణ కేసులు దేశవ్యాప్తంగా 6 శాతం పెరగగా.. పిల్లలపై నేరాలు 13.6 శాతం పెరిగాయి.
  • షెడ్యూల్డ్ కులాలపై దాడులు 5.5%, షెడ్యూల్డ్ తెగలపై 4.7 శాతం పెరిగాయి.
  • ఎస్సీలపై దాడులు యూపీలో అత్యధికంగా 25.6% నమోదవగా, తరువాతి స్థానంలో బిహార్ (14%), రాజస్తాన్ (12.6%) ఉన్నాయి.
  • ఎస్టీలపై దాడుల కేసుల్లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 1823(27.8 శాతం) కేసులు నమోదయ్యాయి.
  • మెట్రో నగరాల్లో మహిళలపై జరిగిన నేరాల్లో ఢిల్లీలోనే 33 శాతం చోటుచేసుకోగా, ముంబైలో 12.3% కేసులు నమోదయ్యాయి.


‘ట్రిపుల్ తలాక్’కు మూడేళ్ల జైలుట్రిపుల్ తలాక్ చెప్పిన వారికి మూడేళ్ల జైలుతోపాటు భారీగా జరిమానా విధించేలా ముసాయిదాను కేంద్రం రూపొందించింది. ఈ మేరకు ముస్లిం మహిళల (రక్షణ, విడాకులపై హక్కులు) చట్టం 1986కు పలు మార్పులు చేస్తోంది. 
ముస్లిం మహిళల హక్కుల చట్టాన్ని ‘షా బానో చట్టం-1986’గా కూడా పిలుస్తారు. షా బానో కేసు నేపథ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో విడాకులు పొందిన తర్వాతే మహిళలకు రక్షణ వర్తించేలా నిబంధనలుండటంతో విడాకులకు ముందే న్యాయం జరిగేలా మార్పులు చేస్తున్నారు.


8 వేల మానవ అక్రమ రవాణా కేసులు నమోదుదేశవ్యాప్తంగా 2016లో 8132 మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే. వీటిల్లో 3,579 కేసుల (44 శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్ (1,422 కేసులు), గుజరాత్ (548), మహారాష్ట్ర (517), తమిళనాడు (434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.




నవంబర్ 2017 జాతీయం

బ్రిక్స్ టాప్-20 వర్సిటీల్లో నాలుగు భారతీయ విద్యాసంస్థలు బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లోని టాప్-20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్‌‌స(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్‌‌సలో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్‌‌స-బెంగళూరు (10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) నిలిచాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన 8 విద్యాలయాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో 920 ప్రధాన మంత్రి మహిళా శక్తి కేంద్రాల’ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గ్రామీణ మహిళల్లో ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ఇవి దోహదపడతాయి. నవంబర్ 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతున్న బేటీ బచావో-బేటీ పడావో పథకాన్ని 640 జిల్లాలకు విస్తరించారు. లైంగిక హింస బాధితులకు సాంత్వన చేకూర్చేలా మరో 150 వన్‌స్టాప్ కేంద్రాల’ ఏర్పాటుకూ కేంద్రం ఆమోదం తెలిపింది. విస్తృత పథకమైన ది నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’లో మరో ఏడు కార్యక్రమాల అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకాలన్నింటికి 2017-20 మధ్య కాలంలో రూ.3,636.85 కోట్లు వెచ్చిస్తారు. 


సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాల పెంపు సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న అంగీకరించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతామని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. జడ్జీల వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ 2016లో అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదన ప్రకారం...సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2.80 లక్షలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ. 2.50 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తికి రూ.2.25 లక్షల చొప్పున వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. 


దివాళా చట్టాన్ని సవరించిన కేంద్రంరుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ)లో మార్పులు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్‌‌సకు కేంద్ర కేబినెట్ నవంబర్ 22న ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. 
దేశ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) నానాటికీ పెరిగిపోతుండడంతో ఆయా కేసుల త్వరితగతిన పరిష్కారం కోసం ఐబీసీని గతేడాది డిసెంబర్ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఐబీసీలో పలు సవరణలు చేస్తూ ఆర్డినెన్‌‌స రూపొందించింది. ఈ ఆర్డినెన్‌‌స స్థానంలో సవరణలతో కూడిన చట్టాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. 


భారత అటవీ చట్టం ఆర్డినెన్‌‌సకు రాష్ట్రపతి ఆమోదం భారత అటవీ చట్టం-1927కు సవరణలు చేస్తూ కేంద్రం పంపిన ఆర్డినెన్‌‌సను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 23న ఆమోదించారు. తాజా సవరణల్లో అటవీ ప్రాంతానికి బయట పెరిగే వెదురు చెట్లను వృక్షాల జాబితా నుంచి తొలగించారు. దీంతో అటవీ ప్రాంతం కాని చోట్ల పెరిగే వెదురు చెట్లను నరకడానికి, రవాణా చేయడానికి అనుమతులు అక్కర్లేదు. వెదురు చెట్ల సాగును పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. 


న్యూఢిల్లీలో జాతీయ న్యాయ దినోత్సవ సదస్సు నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా నవంబర్ 25, 26 తేదీల్లో న్యూఢిల్లీలో సదస్సు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకే కుటుంబానికి చెందినవనీ, అవి మూడు ఒకదానినొకటి బలోపేతం చేసుకునేలా పనిచేయాలని ఉద్ఘాటించారు. ఈ మూడు వ్యవస్థల మధ్య ఉండే సమన్వయమే రాజ్యాంగానికి వెన్నెముకని ఆయన పేర్కొన్నారు. సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. 
జాతీయ న్యాయ దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవంగాను నిర్వహిస్తారు. 


హైదరాబాద్ చేరుకున్న షురువాత్’ బస్సు యాత్ర ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)-2017 నేపథ్యంలో రోడ్ టు జీఈఎస్’ పేరిట ప్రారంభించిన దేశవ్యాప్త షురువాత్’ బస్సు యాత్ర హైదరాబాద్ నగరానికి చేరుకుంది. ఈ యాత్ర నవంబర్ 26న గచ్చిబౌలిలోని ఉర్దూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు చేరింది. నీతిఆయోగ్, యునెటైడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ సంయుక్త ఆధ్వర్యంలో ది గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్‌షిప్ ఫౌండేషన్ చైర్మన్ శివ్‌విక్రమ్ ఖేమ్కా, సీఈవో గౌరీ ఈశ్వరన్, స్పెషల్ ప్రాజెక్ట్స్ లీడ్ క్షితిజ్ శరణ్ నేతృత్వంలో పది మంది సభ్యుల బృందం ఈ బస్సులో ప్రయాణం సాగిస్తోంది. ఐఐటీ ఢిల్లీలో ప్రారంభమైన ఈ షుర్వాత్ బస్సు ఐదు నగరాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ చేరుకుంది. 14 రోజుల పర్యటనలో ఢిల్లీ, అహ్మదాబాద్, పుణే, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించి 500 వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను షురువాత్’ బస్సులోని బృందం సేకరించింది. వీటిలో అత్యుత్తమమైన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

2030 నాటికి పట్టణాల్లోనే 40 శాతం జనాభా2030 నాటికి దేశం మొత్తం జనాభాలో పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 40 శాతం ఉంటారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ బ్రూకింగ్‌‌స ఇన్‌స్టిట్యూషన్ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో భారత్, చైనా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్‌‌స దేశాల నుంచి దాదాపు 30 కోట్ల జనం గ్రామాలను విడిచి పట్టణాలకు వలస వెళతారని తెలిపింది.
మధ్యతరగతి జనాభా విషయంలో 2027 కల్లా ఇండియా చైనాను వెనక్కు నెట్టనుందని అంచనా. 2014-50 మధ్య కాలంలో చైనా, భారత్‌లలో కలిపి కొత్తగా 70 కోట్ల జనం పట్టణాలకు తరలిపోయి మధ్య ఆదాయవర్గంగా ఎదుగుతారని బ్రూకింగ్‌‌సకు చెందిన హోమీ ఖరాస్ అంచనా వేస్తున్నారు. ఆసియాలో 2016 నాటికి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలు 275. 2030 నాటికి వాటి సంఖ్య 354కు పెరుగుతుందని భావిస్తున్నారు.


నెట్ న్యూట్రాలిటీకి ట్రాయ్ మద్ధతువివక్ష లేని ఇంటర్నెట్ సేవలను అందించే నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చిచెప్పింది. సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఏ సంస్థలైనా ఇంటర్నెట్ సేవలు అందించడంలో వివక్ష చూపడాన్ని నిషేధించాలని సూచించింది. ఈ మేరకు నెట్‌న్యూట్రాలిటీపై సిఫార్సుల నివేదికను ట్రాయ్ నవంబర్ 28న కేంద్రానికి అందచేసింది.
ట్రాయ్ సిఫార్సులు
  • టెలికం కంపెనీలు, ఐఎస్‌పీలు ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు ఉండకూడదు.
  • ఆన్‌లైన్ వీడియోలను ఎక్కువ-తక్కువ స్పీడ్‌తో చూపకూడదు.
  • ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్‌‌స నిబంధనలను మార్చాలి.
  • కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం లేదా పెంచడం వంటివి వివక్షగా పరిగణించాలి.
  • ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్‌తో అనుసంధానించడం) వంటి సేవల విషయంలో నిబంధనలు సడలించవచ్చు.
  • కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్‌పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారుల ప్రతినిధులకు చోటు కల్పించాలి.
  • టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి.
నెట్ న్యూట్రాలిటీ అంటే?ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు (టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని వెబ్‌సైట్‌లకు డేటా చార్జీలు వసూలు చేయడం, కొన్నింటిని ఉచితంగా అందించడం లేదా కొన్నింటిని అధిక వేగం, కొన్నింటిని తక్కువ వేగంతో చూపించడం వంటి అసమానతలు నిరోధించడమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం.
రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు ఇంటర్నెట్.ఆర్గ్ పేరుతో టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ కూడా ‘ఎయిర్‌టెల్ జీరో’ ను ప్రకటించింది. 


ఆధార్ గడువు పొడిగింపునకు కేంద్రం రెడీ సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ ఖాతాలతో ఆధార్‌సంఖ్యను అనుసంధానించుకోవడానికి మరింత గడువు దొరికింది. వచ్చే ఏడాది మార్చి దాకా ఈ గడువును పొడగిస్తున్నట్టు కేంద్రం నవంబర్ 27న సుప్రీంకోర్టుకు తెలిపింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందడానికి ప్రజలు తమ ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనపై నవంబర్ 27న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2018 మార్చి 31 వరకు వినియోగదారులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తామని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఈ ఏడాది డిసెంబరు 31 చివరి తేదీ కాగా మొబైల్ నంబర్లకు 2018 ఫిబ్రవరి 6 వరకు ఉంది. 

ఢిల్లీ రాష్ర్టం కాదని సుప్రీంకు తెలిపిన కేంద్రంకేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ, రాజ్యాంగం ప్రకారం రాష్ర్టంగా పరిగణించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్‌సింగ్ 2017 నవంబర్ 21న ఈ మేరకు వాదనలు వినిపించారు. 

సిక్కిం అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదనసిక్కిం రాష్ర్ట శాసనసభ స్థానాల పెంపును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 నవంబర్ 23న ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 32 అసెంబ్లీ స్థానాలు 40కి చేరుతాయి. 1975లో సిక్కిం భారత్‌లో భాగమైన తర్వాత తొలిసారి ఆ రాష్ర్ట శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి.

ఇంటర్నెట్ స్వేచ్ఛలో 41వ స్థానంలో భారత్ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమ్ ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది. 
నివేదిక ప్రధాన అంశాలు 
  • సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లోని కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు.
  • ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
  • వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్‌షిప్‌ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు.
  • ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది.
  • రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు.
  • వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి.
ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే! ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలిచింది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్‌లాండ్ ప్రథమస్థానంలో ఉండగా, కెనడా 2, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. 


ప్రజాదరణలో తొలిస్థానంలో ప్రధాని మోదీ దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ నవంబర్ 15న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరుసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి. 
ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు.


నితీశ్ కుమార్‌కే జేడీ(యూ): ఈసీజేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు నవంబర్ 17న ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది. 
బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది.


భారత్‌లో 73 కోట్ల మంది మరుగుదొడ్లకు దూరంప్రపంచంలో అత్యధిక మంది మరుగుదొడ్లకు దూరంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉందని వాటర్ ఎయిడ్ సంస్థ వెల్లడించింది. నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ఔట్ ఆఫ్ ఆర్డర్: ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ టాయ్‌లెట్స్-2017 పేరిట మూడో వార్షిక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం భారత్‌లో ఏకంగా 73.22 కోట్ల మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అంటే 130 కోట్లకుపైగా ఉన్న దేశ జనాభాలో సగానికిపైగా (56 శాతం) ప్రజలు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. 
ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 34.35 కోట్ల మంది(జనాభాలో 25%)కి టాయిలెట్ సౌకర్యం లేదని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వరుసగా నైజీరియా(12.28 కోట్లు- దేశ జనాభాలో 67%), ఇథియోఫియా(9.24 కోట్లు- జనాభాలో 93%), బంగ్లాదేశ్(8.55 కోట్లు- జనాభాలో 85.5%) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 230 కోట్ల మందికి టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేదని నివేదిక తెలిపింది. 


విశాఖ, ముంబైలో సీఈఎంఎస్ సంస్థలు షిప్పింగ్ అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముంబై, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్‌‌స ఇన్ మారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) సంస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కేంద్ర షిప్పింగ్‌శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొచ్చిన్‌లో ప్రకటించారు. సాగర్‌మాల పథకంలో దీనిని ప్రధాన అంశంగా తీసుకోనున్నారు. షిప్పింగ్ పరిశ్రమ సంబంధిత నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు రూ.766 కోట్లతో ఈ రెండు క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నారు. బహుళజాతి సంస్థ సిమెన్‌‌స, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్‌ఎస్) సంస్థల భాగస్వామ్యంతో కేంద్ర షిప్పింగ్ శాఖ వీటిని ఏర్పాటు చేయనుంది. షిప్ డిజైన్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు తదితర సేవల్లో అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ క్యాంపస్‌ల ప్రధాన లక్ష్యం. 
సాంకేతికత, నైపుణ్యాలతో పాటు 87 శాతం నిధులను సిమెన్‌‌స సంస్థ గ్రాంటుగా అందిస్తోంది. విశాఖపట్నం క్యాంపస్ కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ) స్థలం, భవనం సమకూర్చింది. క్యాంపస్‌లను తొలి రెండేళ్లపాటు సీమెన్‌‌స సంస్థ నిర్వహిస్తుంది. తదుపరి ఐఆర్‌ఎస్ ఏర్పాటు చేసే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నిర్వహిస్తుంది. 


వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 51వ స్థానం ప్రముఖ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఐఎండీ’ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ 51వ స్థానంలో నిలిచింది. నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవడం, విదేశీ నిపుణులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను మెరుగుపరచుకోవడం వంటి అంశాల పరంగా భారత్ ఈ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇక స్విట్జర్లాంట్ అగ్రస్థానం దక్కించుకుంది. దీని తర్వాతి స్థానంలో డెన్మార్క్, బెల్జియం ఉన్నాయి. ఆస్ట్రియా, ఫిన్‌లాండ్, నెదర్లాండ్‌‌స, నార్వే, జర్మనీ, స్వీడన్, లక్సెంబర్గ్ వంటివి టాప్-10లో నిలిచాయి. 
ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, అప్పీల్, రెడీనెస్ వంటి అంశాల్లో భారత్ వరుసగా 62, 43, 29 ర్యాంకులను సొంతం చేసుకుందని ఐఎండీ తెలిపింది. 


యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చెన్నై ప్రతిష్టాత్మక యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో భారత్‌లోని చెన్నై నగరం చోటు దక్కించుకుంది. ఈ మేరకు చెన్నైతో కలిపి 44 దేశాల నుంచి 64 నగరాలకు ఈ నెట్‌వర్క్‌లో చోటు కల్పిస్తూ యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకొవా నవంబర్ 8న నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ జాబితాలో స్థానం పొందిన నగరాల సంఖ్య 180కి చేరింది. 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(సిటీ ఆఫ్ మ్యూజిక్), రాజస్తాన్‌లోని జైపూర్(సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్) నగరాలు 2015 డిసెంబర్‌లోనే ఈ జాబితాలో స్థానం పొందాయి. యూనెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సంగీతం, పర్యావరణ అంశాల్లో గుర్తింపు పొందిన నగరాల అభివృద్ధి కోసం ఈ వేదికను ప్రారంభించారు. 


ఢిల్లీలో వాతావరణ అత్యవసర పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. పాఠశాలలకు ఐదు రోజులు సెలవు ప్రకటించారు. ఢిల్లీ మీదుగా వెళ్లే కాలుష్య కారక భారీ వాహనాలను నియంత్రిస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువ. అందువల్ల అక్కడ అధిక క్యూబిక్ సెంటీ మీటర్ డీజిల్ వాహనాల వాడకంపై ఆంక్షలు అమలవుతున్నాయి. పదేళ్లు పైబడిన వాహనాలను నిషేధించారు. కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది దీపావళికి టపాసులను సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పొలాల్లోనే తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లో 74% పోలింగ్హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.45 శాతం పోలింగ్ నమోదయిందని ప్రధాన ఎన్నికల అధికారి పుష్పేందర్ రాజ్‌పుత్ తెలిపారు. మొత్తం 68 నియోజకవర్గాల్లోని 7,525 పోలింగ్ కేంద్రాల్లో 11,283 రసీదు ఇచ్చే ఓటింగ్ యంత్రాల (వీవీపీఏటీ)ను ఏర్పాటు చేశారు. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటిస్తారు. 

విపత్తు నిర్వహణకు ఫేస్‌బుక్ సాయం విపత్తు నిర్వహణకు సాయం అందించేందుకు సిద్ధమని ఫేస్‌బుక్ ప్రకటించింది. భారత దేశంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎమ్‌ఏ)తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించిది. ఇందుకోసం డిజాస్టర్ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇప్పటికే ఇది ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా, దక్షిణ, మధ్యఆసియా దేశాల ప్రాజెక్ట్ అధికారిగా వ్యవహరిస్తున్న రితేష్ మెహతా వెల్లడించారు. 
సాధారణంగా విపత్తుల సమయంలో అందరూ ఆన్‌లైన్‌లో ఉంటారన్న గ్యారెంటీ లేదు, ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉన్నా సర్వీసులన్నీ బిజీ అని రావచ్చు, అయితే ఇటువంటి సమయాల్లో కూడా సమాచారం అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఫేస్‌బుక్ కొత్త సాధనాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ మ్యాపులను జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. 


హోం శాఖ కింద రెండు కొత్త విభాగాలు ఉగ్రవాదంవైపు యువత ఆకర్షితులు కాకుండా చూసేందుకు, సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. హోం శాఖ కింద పనిచేసే పలు విభాగాల్లో శుక్రవారం కొన్ని మార్పులు జరిగాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు CTCR (కౌంటర్ టైజం, కౌంటర్ ర్యాడికలైజేషన్)ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్ వంటి సైబర్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (CIS) కొత్తగా ఏర్పాటైంది. మరికొన్ని విభాగాలను ఒకదానిలో మరొకటి విలీనం చేశారు. ఇకపై హోం మంత్రిత్వ శాఖ కింద 18 విభాగాలు ఉంటాయి. 

జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్ దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 10న జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు. 


ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఎగ్జిబిషన్ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్-పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. 


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. 


కశ్మీర్‌లోని కౌరిలో భూకంపాలను తట్టుకునే వంతెనఅత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్‌లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్‌తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. 
నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్‌లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్-రేసి-అనంత్‌నాగ్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.


వైష్ణోదేవీ ఆలయంలో రోజుకు 50 వేల మందికే దర్శనంకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ నవంబర్ 13న ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని నవంబర్ 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ఆదేశించింది. 


పశ్చిమ బెంగాల్‌కు రసగుల్లా జీఐ గుర్తింపు రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. 


న్యూఢిల్లీలో 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ఖండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్‌లో ప్రదర్శనకు ఉంచారు.


దంతెవాడలో భారత తొలి గిరిజన ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సు భారత తొలి ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సుని ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో నవంబర్ 14న నిర్వహించారు. భారత్‌లో జరుగుతున్న 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ సదస్సులో భాగంగా.. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. గిరిజన యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు నిర్వహించారు. 


ఢిల్లీలో పేపర్ పరిశ్రమల అంతర్జాతీయ సమ్మేళనంపేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. సదస్సులో 22 దేశాల నుంచి ప్రముఖ సంస్థలు పొల్గొని పేపర్ తయారీలో ఆయా సంస్థలు అనుసరిస్తున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై చర్చించారు.


తొమ్మిది ప్రధాన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన తొమ్మిది కీలకమైన బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. వీటిలో పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ అమెండ్‌మెంట్ బిల్లు, గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తదితరాలు ఉన్నట్లు రాష్ట్రపతిభవన్ వర్గాలు నవంబర్ 5న వెల్లడించాయి. గుజరాత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నిర్బంధ ఖైదీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. దీంతో కీలక కేసుల్లో శిక్ష పడిన ఖైదీల రక్షణ, వారిని కోర్టులకు తీసుకొచ్చే ఇబ్బందులు పోలీసులకు ఉండవు. 

అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పునరుద్ధరణ 2016లో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘం పదవీ కాలం ముగియడంతో దాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర హోం శాఖ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటైంది. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, తావర్‌చంద్ గెహ్లట్; పంజాబ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇతర సభ్యులు. 

భారతీయ కిచిడీకి గిన్నిస్ రికార్డు భారతీయుల సంప్రదాయ వంటకాల్లో ఒకటైన కిచిడీ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఢిల్లీలో నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో నవంబర్ 4న దాదాపు 918 కేజీల కిచిడీని తయారుచేసి చరిత్ర సృష్టించారు. అక్షయ పాత్ర అనే స్వచ్ఛంద సంస్థ, సంజీవ్ కపూర్ అనే పాకశాస్త్ర ప్రవీణుడి నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారుచేసింది. 

లడఖ్‌లో అత్యంత ఎత్తయిన రహదారి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈశాన్య ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దులోని చిసూమ్లే, డెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ 86 కి.మీ. పొడవుగల రోడ్డును భూ ఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో నిర్మించింది. 
వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 నుంచి 20 డిగ్రీలు ఉంటుంది. ఎత్తయిన ప్రాంతం కావడంతో ఆక్సిజన్ స్థాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే 50 శాతం తక్కువగా ఉంటుంది. తద్వారా ఇక్కడ పనిచేసేవారు ప్రతి పది నిమిషాలకు ఓసారి ఆక్సిజన్ కోసం కిందకు వెళ్లాల్సి వచ్చేది. చాలామంది జ్ఞాపక శక్తి లోపం, కంటిచూపు మందగించడం, అధిక రక్తపోటు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని రహదారి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ హిమాంక్ అధికారి డీఎమ్ పుర్విమత్ తెలిపారు. 


ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ పరికరం తప్పనిసరి డిసెంబర్ 1 నుంచి విక్రయించే కొత్త ఫోర్ వీలర్ వాహనాలన్నింటికి ‘ఫాస్టాగ్’ పరికరం తప్పనిసరిగా అమర్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ నవంబర్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 
వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చే ఈ డివైజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఆయా వాహనదారుల సేవింగ్‌‌స ఖాతా లేదా ప్రీపెయిడ్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. టోల్ గేట్ల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ ఫాస్టాగ్‌లలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 370 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమల్లో ఉంది. 
 

ఎత్తయిన వంతెనకు ఇండియన్ రైల్వే శ్రీకారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే నవంబర్ 6న ప్రారంభించింది. దీన్ని కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఉధమ్‌పూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం రూ.5,005 కోట్లు. 1,315 మీటర్ల పొడవుగల వంతెన నిర్మాణానికి 25 వేల మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉపయోగిస్తున్నారు.