Sunday, 9 July 2017

జూన్ 2017 జాతీయం

కర్ణాటకలో రైతు రుణమాఫీఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌ల కోవలో కర్ణాటక ప్రభుత్వం కూడా రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.50 వేల లోపు ఉండి సహకార బ్యాంకులు, సంఘాల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. జాతీయ, గ్రామీణ, ప్రైవేటు బ్యాంకుల్లో అప్పులు పొందిన రైతులకు రుణమాఫీ వర్తించదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. రుణాలను రద్దు చేయడం వల్ల ఖజానాపై రూ.8,165 కోట్ల భారం పడనుంది. ఈ నెల 20 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న 22,27,506 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 


స్మార్ట్ సిటీల మూడో జాబితాలో 30 నగరాలు స్మార్ట్ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధి చేసే నగరాల 3వ జాబితాను కేంద్రం జూన్ 23న విడుదల చేసింది. పట్టణ పరివర్తన అంశంపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మొత్తం 30 నగరాలతో కూడిన జాబితాను వెల్లడించింది. దీంతో ఇప్పటి దాకా ప్రకటించిన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి చేరింది. తదుపరి దఫాలో 20 పట్టణాల నుంచి 10 స్మార్ట్ సిటీలను ఎంపికచేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.
ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం తొలిస్థానంలో, ఆ తరువాత వరుసగా ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయ్‌పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కరీంనగర్ (తెలంగాణ), ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాలకు చోటు దక్కింది. స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన నగరాలకు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి నిధులు అందుతాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 500 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.500 కోట్లు.
తాజా జాబితాలోని ఇతర పట్టణాలుపట్నా, ముజఫర్‌పూర్, పుదుచ్చేరి, గాంధీనగర్, శ్రీనగర్, సాగర్, కర్నల్, సాత్నా, బెంగళూరు, షిమ్లా, డెహ్రాడూన్, తిరుప్తూపర్, పింప్రిచించ్వాడ్, బిలాస్‌పూర్, పాసీఘా ట్, జమ్మూ, దాహోద్, తిరునల్వేలి, తూతుక్కుడి, తిరుచిరాపల్లి, ఝాన్సీ, ఐజ్వాల్, అలహాబాద్, అలీగఢ్, గ్యాంగ్‌టక్.


భారత్ - పోర్చుగల్ మధ్య 11 ఒప్పందాలు మూడు దేశాల(పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్)పర్యటనలో భాగంగా జూన్ 24న పోర్చుగల్ చేరుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో అంతరిక్షం, పర్యావరణంతో పాటుగా ఉగ్రవాద వ్యతిరేక అంశాలపై విసృ్తతంగా చర్చలు జరిపారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలు జరిపేందుకు 4 మిలియన్ యూరోల (దాదాపు రూ.28.8 కోట్లు)తో సంయుక్త నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా ఇరుదేశాల మధ్య 11 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతుంటుందని ఆంటోనియో వెల్లడించారు. 


ఉగ్రవాదంపై అమెరికా-భారత్ సంయుక్త పోరాటం అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జూన్ 26న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మానవాళికి సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేయటంతోపాటు పలు ద్వైపాక్షిక అంశాల్లో మరింత పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. 
ఉగ్రవాదంపై పోరులో..ముంబై దాడులు, పఠాన్‌కోట్ ఘటనలో దోషులపై పాకిస్తాన్ కఠినంగా వ్యవహరించాలని, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటాన్ని మానుకోవాలని ఈ ప్రకటన ద్వారా హెచ్చరించారు. దీంతో పాటుగా వాణిజ్యం,ఆర్థికాభివృద్ధితోపాటు రక్షణ, భద్రత రంగాల్లో వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతోపాటు ఎన్‌ఎస్‌జీ, వాసెనార్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత సభ్యత్వానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకై ఉగ్రవాదం వల్ల అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న అస్థిరతపైనా మోదీ, ట్రంప్ చర్చించారు. ఆ దేశంలో శాంతి, స్థిరత్వం వచ్చేందుకు కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్యం, స్థిరత్వం, భద్రతను పరిరక్షించేందుకు భారత్ తీసుకుంటున్న చొరవనూ ట్రంప్ ప్రశంసించారు. భారత ‘థింక్ వెస్ట్’ విధానానికి అనుగుణంగా మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన చర్చలు జరిపి ఆయా దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇటీవల ఉత్తరకొరియా చేపడుతున్న విధ్వంసక క్షిపణుల ప్రయోగాలు సవాలుగా మారాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉ.కొరియాపై ఆంక్షలు విధించే విషయంలో అమెరికాకు మద్దతు తెలిపిన భారత్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
వ్యూహాత్మక భాగస్వామ్యాలుభారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తింపు దిశగా మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. అత్యాధునిక రక్షణ పరికరాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉన్న దేశాలతో కలిసి పనిచేయనున్నారు. ఇందులో భాగంగానే సముద్రనిఘా కోసం 20 మానవరహిత వాయు భద్రత వ్యవస్థ (గార్డియన్ డ్రోన్‌‌స) ను భారత్‌కు అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో భద్రత కోసం ‘వైట్ షిప్పింగ్’డేటాను మార్పిడి చేసుకోవాలని కూడా మోదీ-ట్రంప్ నిర్ణయించారు. దీని ద్వారా సముద్రతీరంలో సంయుక్తంగా భద్రతను పర్యవేక్షించేందుకు వీలుంటుంది. 

భారత్ - నెదర్లాండ్స్ మధ్య 3 ఒప్పందాలు అమెరికా పర్యటన తర్వాత జూన్ 27న ఐరోపా దేశం నెదర్లాండ్స్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ ప్రధాని మార్క్ రూట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత, నీటి సహకారం, సంస్కృతీ సహకారాలకు సంబంధించిన 3 అవగాహనా ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. భారత్‌కు క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో సభ్యత్వం దక్కడంలో మద్దతు ఇచ్చినందుకు నెదర్లాండ్‌‌సకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీ డచ్ కంపెనీల సీఈవోలతో సమావేశమై తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌లో వ్యాపారం చేయడం సులభమైందన్నారు. భారత్‌లో వాణిజ్య ప్రమాణాలు ప్రపంచ దేశాలతో సమానంగా ఉన్నాయన్నారు.


మహారాష్ట్రలో 34 వేల కోట్ల రుణమాఫీకరువు, పంటలకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న మహారాష్ట్ర రైతుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.34,020 కోట్ల భారీ రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.1.5 లక్షల వరకు ఉన్న రుణాలు రద్దు కానున్నాయి. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన’గా నామకరణం చేసిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జూన్ 24న ప్రకటించారు. పథకంతో 40 లక్షల మంది రైతులకు అప్పుల నుంచి పూర్తి విముక్తి, మరో 49 లక్షల మందికి కొంత ఉపశమనం కలగనుంది. దేశంలో ఒక రాష్ట్రం ఇంత పెద్ద రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి అని ఫడ్నవిస్ తెలిపారు. దీని కోసం రాష్ట్రంలోని అధికార బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని అందిస్తారని వెల్లడించారు. 


మన్‌కీబాత్‌లో విజయనగరం జిల్లాకు ప్రధాని ప్రశంసలు మన్‌కీబాత్ కార్యక్రమంలో జూన్ 24న రేడియోలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంలా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాను ఉదహరించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అధికారులు జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటలు నిర్విరామంగా శ్రమించి 10 వేల మరుగు దొడ్లను నిర్మించారని ప్రశంసించారు. వీటి నిర్మాణం వల్ల 71 గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయన్నారు. అలాగే.. ముస్లింల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ బిజనౌర్ జిల్లాలో 3,500 కుటుంబాలున్న ముబారక్‌పూర్ గ్రామ ప్రజలంతా కలసి రంజాన్ సందర్భంగా మరుగుదొడ్డి నిర్మించారని మోదీ కొనియాడారు. 
మదురై మహిళ సాధికారత..‘గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వస్తువులు అమ్ముతున్నానంటూ తమిళనాడు మదురైకి చెందిన ఓ మహిళ రాసిన ఉత్తరాన్ని ప్రధాని ప్రస్తావించారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని, ఆమె నుంచి ప్రధాని కార్యాలయం కూడా రెండు వస్తువులు కొనుగోలు చేసిందని మోదీ చెప్పారు.


జాతీయ విద్యా విధానంపై కమిటీజాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)పై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన కమిటీని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. భారత విద్యా విధానానికి కొత్తరూపు తీసుకొచ్చే నిర్ణయంలో భాగంగా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ జూన్ 26న ప్రకటించింది. 
జాతీయ విద్యా విధానంపై కొన్నేళ్ల కిందట టీఎస్‌ఆర్ సుబ్రమణియన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2016లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 


దేశీయ తేలియాడే డాక్ ప్రారంభంనౌకా దళం కోసం తొలిసారిగా దేశీయంగా నిర్మించిన తేలియాడే డాక్ (ఎఫ్‌డీఎన్-2)ను జూన్ 20న చెన్నైలో ప్రారంభించారు. ఎల్ అండ్ టీ సంస్థనిర్మించిన ఈ డాక్ పొడవు 185 మీటర్లు కాగా, వెడల్పు 40 మీటర్లు. ఇది అన్ని రకాల నౌకల మరమ్మతులకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని అండమాన్ నికోబార్‌లో ఉంచనున్నారు. ఇప్పటికే ఇలాంటిదొకటి చెన్నైలో ఉంది. 

ఉదయ్ ర్యాంకింగ్స్‌లో గుజరాత్ టాప్ ఉజ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం సంస్కరణల అమల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వజ్ర విధానం ప్రారంభంఅంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 22న వజ్ర(విజిటింగ్ అడ్వాన్స్‌డ్ జాయింట్ రీసెర్చ్) అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ దీనికి సంబంధించిన వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.

కాండ్లాలో తొలి స్మార్ట్ పోర్ట్ సిటీ దేశంలోని తొలి స్మార్ట్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ (ఎస్‌ఐపీసీ) గుజరాత్ రాష్ట్రం గాంధీధామ్ సమీపంలోని కాండ్లాలో ఏర్పాటు కానుంది. కాండ్లా పోర్ట్ ట్రస్ట్ (కేపీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ పారిశ్రామిక కారిడార్ రూ. 10 వేల కోట్లపైగా పెట్టుబడులను ఆకర్షించనుంది. ఇందులో వంట నూనెలు, ఫర్నిచర్, ఉప్పు ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
1,425 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఐపీసీలో 580 ఎకరాల్లో స్మార్ట్ అర్బన్ టౌన్‌షిప్, 845 ఎకరాల్లో ఆధునిక పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. 


యూపీలో సున్నీ, షియా వక్ఫ్ బోర్డులు రద్దుఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 15న నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్ మంత్రి మొహసీన్ రజా తెలిపారు. బోర్డుల రద్దుకు ముందు అన్ని న్యాయపరమైన అంశాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూసీఐ) జరిపిన విచారణలో కూడా ఈ రెండు బోర్డుల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని రజా పేర్కొన్నారు. ఈ అవినీతిలో ఎస్పీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి అజాం ఖాన్‌తో పాటు షియా బోర్డు చైర్మన్ వసీమ్ రజ్వీల పాత్ర ఉన్నట్లు డబ్ల్యూసీఐ నిర్ధారించిందని వెల్లడించారు. 


గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 60వ స్థానంలో భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ)-2017లో భారత్ 6 స్థానాలు మెరుగుపరచుకుని 60వ స్థానంలో నిలిచింది. దీంతో మధ్య, దక్షిణాసియా ప్రాంతంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించడంతో ఆసియా ప్రాంతపు వర్ధమాన ఇన్నోవేషన్ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. 
కార్నెల్ యూనివర్సిటీ, ఇన్‌సీడ్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 130 దేశాలతో ఈ జాబితాను రూపొందించాయి. ఇందులో స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్‌‌స, అమెరికా, యూకే దేశాలు వరుసగా అగ్ర స్థానాల్లో ఉన్నాయి. చైనా 22వ స్థానంలో ఉండగా శ్రీలంక 90, నేపాల్ 109, పాకిస్తాన్ 113, బంగ్లాదేశ్ 114వ స్థానాల్లో ఉన్నాయి. 


పోలీసుల కాల్పుల్లో వారానికి ఇద్దరు మృతి గడిచిన ఏడేళ్లలో పోలీసు కాల్పుల్లో సగటున వారానికి ఇద్దరు పౌరులు మరణించారని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2009 నుంచి 2015 మధ్య దేశంలో 4,747 పోలీసుల కాల్పుల ఘనటలు నమోదు కాగా ఈ కాల్పుల్లో 796 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ భాగం జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘటనలే. రాష్ట్రాలవారీగా చూస్తే 2015లో రాజస్థాన్‌లో అత్యధికంగా 35 పోలీసు కాల్పుల ఘటనలు నమోదు కాగా మహారాష్ట్రలో 33, ఉత్తరప్రదేశ్‌లో 29 రికార్డయ్యాయి. అల్లర్లు, దోపిడీ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదులు, తీవ్రవాదుల వ్యతిరేక చర్యలు.. మొదలైన సమయాల్లో పోలీసు కాల్పులను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే 2009 నుంచి 2015 మధ్య జరిగిన కాల్పుల్లో 471 మంది పోలీసు సిబ్బంది కూడా మరణించారు. 


జవాన్ల శాశ్వత వైకల్యానికి రూ.20 లక్షలువిధి నిర్వహణలో 100 శాతం అంగవైకల్యం పొందిన జవాన్లకు ఇస్తున్న నష్టపరిహారాన్ని రూ.9 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర హోంశాఖ జూన్ 17న నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 తర్వాత వైకల్యం పొందినవారికే ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. వీరితో పాటు విధి నిర్వహణలో గాయపడ్డ జవాన్లకు వైకల్య స్థాయిని బట్టి నష్టపరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. 


ముంబై పేలుళ్ల కేసులో అబూసలేంను దోషిగా తేల్చిన టాడాకోర్టు1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో సూత్రధారి ముస్తఫా దోసా, గ్యాంగ్‌స్టర్ అబూ సలేం సహా ఆరుగురిని టాడా ప్రత్యేక కోర్టు జూన్ 16న దోషులుగా నిర్ధారించింది. అబ్దుల్ ఖయ్యూం అనే మరో నిందితుడిని సరైన ఆధారాల్లేనందున నిర్దోషిగా ప్రకటించింది. 
అబూసలేం, ముస్తఫా , కరీముల్లా ఖాన్, ఫిరోజ్, అబ్దుల్ రషీద్ ఖాన్, తాహిర్ మర్చంట్‌లను నేరపూరిత కుట్ర, భారత శిక్షాస్మృతి, టాడా కింద హత్యానేరం, విధ్వంసక సామాగ్రి, ఆయుధాలు కలిగి ఉండటం, ప్రజల ఆస్తుల విధ్వంసం వంటి కేసుల్లో దోషులుగా తేల్చగా, సిద్దిఖీని అబూసలేం, ఇతరులకు ఆయుధాలు సరఫరా చేయటంలో సహకరించిన నేరంలో టాడా చట్టాల కింద దోషిగా తేల్చారు. 
24 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి రెండో విడత విచారణలో భాగంగా టాడా కోర్టు తాజా తీర్పునిచ్చింది. 2007 నాటి తొలి విడత విచారణలో కోర్టు 100 మందిని దోషులుగా, 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో టైగర్ మెమన్, యాకూబ్ మెమన్, మహ్మద్ దోసా, ముస్తఫా దోసాతో సహా పలువురు ఈ దాడులకు కుట్ర పన్నారు. 


బ్యాంకు ఖాతాకు ఆధార్ తప్పనిసరికొత్త బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర రెవిన్యూ శాఖ జూన్ 16న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ను తెలపాలి. అంతేకాకుండా రూ.50,000 అంతకు మించిన మొత్తాల లావాదేవీలకు సైతం ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి. 
ఇప్పటికే బ్యాంకు ఖాతా ఉన్న వినియోగదారులు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబర్‌ను తెలపాల్సి ఉంటుంది. 


నల్లధనం వెల్లడికి స్విట్జర్లాండ్ ఆమోదంనల్లధనం వివరాల్ని భారత్‌తో పంచుకునేలా ఆటోమెటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని (Automatic Exchange Financial Account) జూన్ 16న స్విట్జర్లాండ్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో ఎటువంటి వివరాలనైనా భారత్ సులువుగా పొందనుంది. 2018 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా తొలి దశ వివరాల్ని 2019లో భారత్‌తో పంచుకునే అవకాశం ఉంది. దీంతో.. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలు బహిర్గతం కానున్నాయి. 


పంజాబ్‌లో రైతు రుణమాఫీఎన్నికల హామీ మేరకు పంజాబ్ రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీలో భాగంగా సన్న, చిన్నకారు రైతులకు(5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు) రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు తీసుకున్న రుణాల్ని కూడా ప్రభుత్వమే చెల్లించడంతో పాటు.. వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈ మేరకు జూన్ 19న అసెంబ్లీలో అమరీందర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 10.25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందులో 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులు 8.75 లక్షలు ఉన్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రకటించిన రుణమాఫీ కంటే రెండింతలు మాఫీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ ఆర్థిక వేత్త టీ హక్యూ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. 
 

జూలై 1 నుంచి డిపార్చర్ కార్డ్స్ విధానం రద్దువిదేశాలకు వెళ్లే భారతీయులకు వచ్చే నెల నుంచి విమానాశ్రయాల వద్ద ప్రయాణానికి ముందు ‘డిపార్చర్ కార్డ్స్’ పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అయితే రైలు, ఓడరేవులు, భూమార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవారు మాత్రం ఈ ప్రయాణ పత్రాల్ని పూర్తి చేయాలని ఒక ఉత్తర్వులో వెల్లడించింది. జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణానికి ముందు పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నెంబరు, చిరునామా, విమానం నెంబర్, ప్రయాణ తేదీ తదితర వివరాలు డిపార్చర్ కార్డ్‌లో పూరించాలి. 


జూలై 17న రాష్ట్రపతి ఎన్నికభారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం(ఈసీ) జూన్ 7న షెడ్యూలు జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నామని ప్రకటించింది. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీచేసి ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. 
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీ వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 2017, జులై 24తో ముగియనుంది. కాగా, సీఈసీ జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసేనాటికి ఆయన పదవిలో ఉండరు. 
ఎన్నికల షెడ్యూలు
నోటిఫికేషన్14.06.2017
నామినేషన్లకు గడువు28.06.2017
నామినేషన్ల పరిశీలన29.06.2017
అభ్యర్థిత్వాల
ఉపసంహరణ గడువు01.07.2017
పోలింగ్17.07.2017
ఓట్ల లెక్కింపు20.07.2017
ఎన్నికల్లో ఎవరి బలమెంత?ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఆప్, ఐఎన్‌ఎల్‌డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. 
ఎన్డీయే పక్షాల బలం
పార్టీ
మొత్తం ఓట్ల విలువ
ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
బీజేపీ4,42,11740.03
టీడీపీ31,1162.82
శివసేన25,8932.34
- మిగిలిన ఎన్డీయే పార్టీల బలాన్ని కలుపుకుంటే ఎన్డీయే బలం ( ఓట్ల విలువ- 5,37,683, ఓట్ల శాతం - 48.64)
యూపీఏ పక్షాల ఓట్ల శాతం
పార్టీ
మొత్తం ఓట్ల విలువ
ఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
కాంగ్రెస్1,61,47814.62
తృణమూల్63,8475.78
సమాజ్‌వాదీ26,0602.36
సీపీఎం27,0692.45
- మిగిలిన యూపీఏ పార్టీల బలాన్ని కలుపుకుంటే మొత్తం ( ఓట్ల విలువ - 3,91,739, ఓట్ల శాతం -35.47)
తటస్థ పార్టీలు
పార్టీమొత్తం ఓట్ల విలువఎలక్టోరల్‌లో ఓట్ల శాతం
అన్నాడీఎంకే59,2245.36
బీజేడీ32,8922.98
టీఆర్‌ఎస్22,0481.99
వైఎస్సార్‌సీపీ16,8481.53
మొత్తం1,44,30213.06
ఎవరు ఎన్ను కుంటారు?రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికై న లోక్‌సభ సభ్యులు(543), ఎన్నికై న రాజ్యసభ సభ్యులు(233), ఎన్నికై న రాష్ట్ర శాసనసభల సభ్యులు(ఢిల్లీ, పుదుచ్చేరి సహా) ఉంటారు. మొత్తం 4,896 మంది ఓటేయడానికి అర్హులు. వీరిలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు. నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్రాల శాసన మండళ్ల సభ్యులకు ఓటు హక్కు ఉండదు. 
పోలింగ్ ఎలా..?
ఓటింగ్‌ను దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కనుక పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఓటర్లు.. అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అభ్యర్థుల పేర్ల ఎదురుగా 1, 2, 3... ఇలా అంకెలు రాస్తారు. ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యత నమోదు తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతల నమోదు ఐచ్ఛికం. 
ఓట్ల లెక్కింపు ఎలా?రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ను 50 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ద్వితీయ ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు 
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే 
చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. 
ఓట్లకు విలువ ఇలా: ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువను ఇలా లెక్కిస్తారు.. 
ఒక ఎమ్మెల్యే ఓటు విలువ: 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్ర మొత్తం జనాభా / ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై న మొత్తం సభ్యుల సంఖ్య × 1000 
రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ: ఒక ఎమ్మెల్యే ఓటు విలువ × మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 
మొత్తం 31 రాష్ట్రాల్లోని (ఢిల్లీ పుదుచ్చేరి సహా) శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ: మొత్తం 31 రాష్ట్రాల్లోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువ మొత్తం = 5,49,474 
ఎంపీ ఓటు విలువ: అందరు ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ (5,49,474) / మొత్తం పార్లమెంటు సభ్యుల సంఖ్య (776) = 708 
అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ: ఒక ఎంపీ ఓటు విలువ × మొత్తం ఎంపీల సంఖ్య = 5,49,408 
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మొత్తం విలువ: అందరు శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ + అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ = 5,49,474 + 5,49,408 = 10,98,882

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ
రాష్ట్రంఅసెంబ్లీ స్థానాలుఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువమొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ
ఆంధ్రప్రదేశ్17515927,825
తెలంగాణ11913215,708
గమనిక: గత రాష్ట్రపతి ఎన్నికలో ఉమ్మడి ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148 కాగా ఈసారి ఏపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 159కి పెరిగింది. తెలంగాణలో 132కు తగ్గింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ విలువలను ఖరారు చేసింది.


పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి మార్పులు 
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ చమురు సంస్థలకు చెందిన 58 వేల పెట్రోల్ బంకుల్లో జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ మారనున్నాయి. ఈ మేరకు ధరలను రోజూ సమీక్షించాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్ణయించాయి. దీంతో పెట్రోల్ ధరలు రోజూ మారుతూ... ఒకే రోజులో కూడా మూడు కంపెనీల బంకుల్లో మూడు రకాలుగా ఉండనున్నాయి. 
ధరలను ఏరోజుకారోజు దినపత్రికల్లో ముద్రించడంతో పాటు మొబైల్ యాప్‌లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా తెలియపరుస్తారు. 


‘టాప్ 200’లో భారత విద్యాసంస్థలకు చోటు ప్రపంచ వ్యాప్తంగా 200 అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో తొలిసారిగా మూడు భారతీయ ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన క్యూఎస్ వరల్డ్ సంస్థ ‘టాప్ 200 గ్లోబల్ యూనివర్సిటీస్’ పేరుతో విడుదల చేసిన జాబితాలో బెంగళూరులోని ఐఐఎస్సీ, ఢిల్లీ, బొంబాయి ఐఐటీలు ర్యాంకులు దక్కించుకున్నాయి. బెంగళూరు ఐఐఎస్‌సీ ర్యాంకు గత ఏడాది 190 కాగా, ఈసారి 152కు చేరింది. ఢిల్లీ ఐఐటీ ర్యాంకు 185 నుంచి 179కి, బొంబాయి ఐఐటీ ర్యాంకు 219 నుంచి 179కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 వేల యూనివర్సిటీల నుంచి 200 అగ్రశ్రేణి విద్యాసంస్థలను క్యూఎస్ వరల్డ్ ఎంపిక చేసింది. 


పాన్, ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టు పాక్షిక స్టే 
పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై (21వ అధికరణ) రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని జూన్ 9న వెలువరించిన తీర్పులో పేర్కొంది. ఇంతవరకు ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. 
పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకొచ్చింది. 


మహారాష్ట్రలో రైతుకు రుణ మాఫీమహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేస్తామని జూన్ 11న ప్రకటించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో జూన్ 1 నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళనను విరమించారు. 
ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి. 


భారత్-మయన్మార్ సరిహద్దు పరిశీలనకు కమిటీ భారత్ - మయన్మార్‌ల సరిహద్దు ద్వారా జరుగుతోన్న స్వేచ్ఛాయుత రాకపోకల పరిశీలనకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రస్తుతం కేంద్ర అంతర్గత భద్రత శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రీనా మిత్రాను చైర్మన్‌గా నియమించింది. 
మయన్మార్‌తో భారత్‌కు 1,643 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. ఆ దేశంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో సరిహద్దు వెంట రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఈ స్వేచ్ఛాయుత నిబంధనలను కొందరు పౌరులు ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత నియమ నిబంధనలను మరోసారి పరిశీలించేందుకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. 
ఇదే అంశానికి సంబంధించి 2015లో ఆర్. ఎన్. రవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాయింట్ ఇంటలిజెన్స్ కమిటీ.. మయన్మార్ వెంట ఉన్న సరిహద్దు నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం సరిహద్దు వెంట కాకుండా కేవలం కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసుల పర్యవేక్షణలో రాకపోకలను అనుమతించాలని పేర్కొంది. 


మహారాష్ట్రలో అత్యధిక బాల్యవివాహాలు దేశంలోని 10 నుంచి 17 ఏళ్ల వయసు కలిగిన ప్రతి ఐదుగురు బాలికల్లో ఒకరికి నిర్ణీత వయసుకంటే ముందే వివాహం జరుగుతుంది. ఇది గ్రామాల కంటే పట్టణాల్లోనే ఎక్కువగా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్), యంగ్ లివ్స్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
2011కి ముందు దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న టాప్ 70 జిల్లాల్లో 16 మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని 16 జిల్లాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల బాల్య వివాహాల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రాజస్థాన్‌లో అబ్బాయిలు 8.6 శాతం, అమ్మాయిలు 8.3 శాతం మందికి నిర్ణీత వయసులోగానే వివాహం అవుతుంది. మొత్తంగా 13 రాష్ట్రాల్లోని(ఉమ్మడి ఏపీతో కలిపి) 70 జిల్లాల్లో 21.1 శాతం బాలికల వివాహాలు జరగగా.. 22.5 శాతం అబ్బాయిల వివాహాలు జరిగాయి.



దేశంలో బాలికల వివాహాల శాతం
సంవత్సరంగ్రామాల్లోపట్టణాల్లోమొత్తం
20012.75 %1.78%2.51%
20112.43%2.45%2.44%


సియోల్‌లో 5వ భారత్- కొరియా ఆర్థిక సదస్సు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, దక్షిణ కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన భారత్-కొరియా 5వ ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్-యెన్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలను కొరియా అందించనుంది. 


సోమాలియాతో ఖైదీల బదిలీ ఒప్పందానికి ఆమోదం
భారత్, సోమాలియా మధ్య జరిగిన శిక్ష పడ్డ ఖైదీల పరస్పర మార్పిడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ జూన్ 7న ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఖైదీల పరస్పర బదిలీ ఒప్పందానికి అంగీకారం తెలపడంతోపాటు ద్వైపాక్షిక ఆమోదానికి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.


నేతాజీ 1945లో చనిపోయారు: క్రేంద్ర హోంశాఖనేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో చనిపోయారని కేంద్ర ప్రభుత్వం మే 31న స్పష్టం చేసింది. నేతాజీ మృతిపై కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి కేంద్ర హోం శాఖకు సమాచార హక్కు కింద గతంలో దరఖాస్తు చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్‌ల నివేదికల్లోని సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం నేతాజీ చనిపోయారనే నిర్ధారణకు వచ్చామని హోం శాఖ తెలిపింది. నేతాజీ కొన్ని రోజులపాటు గుమ్నమి బాబాగా మారువేషంలో జీవించారనే వాదనననూ అధికారులు కొట్టిపారేశారు. 


ఐరాస సాధారణ అసెంబ్లీ చీఫ్‌గా లాజ్‌కాక్
స్లోవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ లాజ్‌కాక్(54) ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిజి దౌత్యవేత్త పీటర్ థాంప్సన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్‌లో మొదలయ్యే యూఎన్ 72వ సాధారణ అసెంబ్లీ సెషన్‌కు లాజ్‌కాక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. గతేడాది యూఎన్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడ్డ వారిలో లాక్‌జాక్ ఒకరు. 


భారత్ - స్పెయిన్ మధ్య 7 ఒప్పందాలు ఉగ్రవాదంపై పోరాటంతో పాటు వివిధ రంగాల్లో భారత్ - స్పెయిన్ పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా మే 31న స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల మధ్య 7 ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. 
శిక్షపడ్డ ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్ట్ ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి.


గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న రాజస్థాన్ హైకోర్టుగోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మే 31న సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొంది. జైపూర్‌లోని ప్రభుత్వ గోశాలలో గతేడాది వందకుపైగా ఆవులు మృత్యువాతపడటంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ మహేశ్ చంద్ శర్మ (ఏక సభ్య ధర్మాసనం) తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఐఎండీ పోటీతత్వ జాబితాలో 45వ స్థానంలో భారత్ అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత్ గతేడాదితో పోల్చుకుంటే నాలుగు స్థానాలు పడిపోయి 45వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్స్ (ఐఎండీ) 63 దేశాల ర్యాంకులను వెల్లడిస్తూ జూన్ 3న జాబితాను విడుదల చేసింది. చైనా ఏడు స్థానాలు ముందుకు జరిగి 18వ స్థానం సంపాదించుకుంది. 
ఈ జాబితాలో హాంగ్‌కాంగ్ మొదటి స్థానంలో నిలవగా, స్విట్జర్లాండ్, సింగపూర్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.


యుద్ధరంగంలోకి మహిళలను అనుమతించనున్న భారత్ ఆర్మీ 
భారత సైన్యం భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. లింగపరమైన అడ్డంకులను అధిగమిస్తూ యుద్ధరంగంలోకి మహిళ లను అనుమతించనుంది. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాటంలో పురుషులు మాత్రమే కనిపించగా.. ఇక ముందు మహిళలు సైతం పాలుపంచుకోనున్నారు. ఈ మేరకు మహిళలను యుద్ధంలో అడుగుపెట్టేందుకు అనుమతిస్తామని, దీనికి సంబంధించిన మార్పులకు రంగం సిద్ధం చేశామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ జూన్ 4న వెల్లడించారు. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ హోదాలోకి ఇకపై మహిళలను అనుమతి స్తామన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని, తొలుతగా మహిళలను మిలిటరీ పోలీసులుగా రిక్రూట్‌మెంట్ చేసుకుంటామని చెప్పారు. 
ప్రస్తుతం మిలిటరీ విభాగానికి అనుసంధానంగా ఉండే మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఇప్పటికే మహిళకు అవకాశం కల్పిస్తున్నారు. 
ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్‌, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు మాత్రమే యుద్ధరంగంలోకి మహిళలను అనుమతిస్తున్నాయి.

యూపీలో గోవధపై జాతీయ భద్రత చట్టంగోవధ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై జాతీయ భద్రత చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ సుల్కన్ సింగ్ అన్ని పోలీస్ స్టేషన్లకు జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. గోరక్షక్ పేరుతో దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. 


పెండింగ్ కేసుల పరిష్కారానికి "న్యాయమిత్ర"దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం న్యాయమిత్రలను నియమించనుంది. జూన్ 6న అలహాబాద్ హైకోర్టులో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టెలీ లా సర్వీస్ అందించే విధానాన్ని ప్రారంభించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తులను న్యాయమిత్రలుగా నియమిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో 7.50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలుభారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ నూతన అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో జూన్ 3న సమావేశమయ్యారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, పారిస్ ఒప్పందానికి మించి కృషి చేస్తుందని తెలిపారు. మెక్రాన్ మాట్లాడుతూ భూ తాపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. రక్షణ సహకారం, సముద్ర జలాల భద్రత, ఉగ్రవాదంపై పోరుకు భారత్‌తో కలసి పని చేస్తామని తెలిపారు. 
రష్యా పర్యటన: మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జూన్ 1న భేటీ అయ్యారు. ఈ ఏడాదితో భారత్-రష్యా సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుదుత్పత్తి కేంద్రంలోని 5వ, 6వ యూనిట్‌ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఇంద్ర-2017 పేరిట త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. 
స్పెయిన్ పర్యటన: మోదీ.. స్పెయిన్ అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో మే 31న సమావేశమయ్యారు. భారత్‌లో విస్తరించేందుకు స్పెయిన్ కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని కోరారు. ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర మార్పిడి, దౌత్యపరమైన పాస్‌పోర్టు ఉన్నవారికి వీసా రద్దు, అవయవ మార్పిడి, సైబర్ సెక్యూరిటీ, పునరుత్పాదక శక్తి, పౌర విమానయాన, దౌత్య సేవల రంగాల్లో ఏడు ఒప్పందాలు కుదిరాయి. 
జర్మనీ పర్యటన: మోదీ.. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో మే 30న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో.. సైబర్ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్ మేనేజర్స్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్ శిక్షణ ప్రోత్సాహం తదితర రంగాలు ఉన్నాయి.

Sunday, 28 May 2017

మే 2017 జాతీయం

ఆన్‌లైన్‌లో అకడమిక్ వివరాల కోసం ఈసనద్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండేలా కేంద్రం ప్రభుత్వం ఈసనద్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల వెరిఫికేషన్ కోసం కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ‘ఈసనద్’ అనే పోర్టల్‌ను మే 24న ప్రారంభించింది. దీనిలో సీబీఎస్‌ఈకి చెందిన ‘పరిణామ్ మంజూష’ సహా విద్యార్థుల అకడమిక్ వివరాలు, సర్టిఫికెట్లన్నీ అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలి.

బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్ల సర్వీసులు ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ శాటిలైట్ ఫోన్ సర్వీస్‌ను మే 24న ప్రారంభించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మొబైల్ శాటిలైట్ ఆర్గనైజేషన్ (ఐఎన్‌ఎంఏఆర్‌ఎస్‌ఏటీ) ద్వారా ఈ సేవలను తొలిగా గవర్నమెంట్ ఏజెన్సీలకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది.
స్టేట్ పోలీస్, రైల్వేస్, సరిహద్దు భద్రతా దళం, ఇతర ప్రభుత్వ సంస్థలకు తొలిగా ఫోన్లను అందివ్వనున్నారు. ప్రస్తుతం శాటిలైట్ ఫోన్ల సర్వీసులు అందిస్తోన్న టాటా కమ్యూనికేషన్‌‌స గడువు జూన్ 30 నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని కనెక్షన్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు బదిలీ అవుతాయి. 

ఐదుగురు మావోయిస్టులకు మరణశిక్ష2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిహార్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లను కాల్చిచంపిన కేసులో ఐదుగురు మావోయిస్టులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి ముంగర్ కోర్టు మే 25న మరణశిక్ష విధించింది. దోషులు విపిన్ మండల్, అధికలాల్ పండిట్, రాతు కోడా, వానో కోడా, మను కోడాలకు అడిషనల్ సెషన్‌‌స జడ్జి జ్యోతి స్వరూప్ శ్రీవాత్సవ రూ.25 వేల చొప్పున జరిమానా కూడా విధించారు. 2014 ఏప్రిల్‌లో గంగ్టా-లక్ష్మీపూర్ మార్గంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై 50 మంది నక్సలైట్లు మెరుపు దాడి చేశారు. 


టాప్-10 అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్‌మహల్ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ‘ట్రిప్ అడ్వైజర్’ సంస్థ ‘ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్‌మార్క్స్’ పేరిట ఈ జాబితాను మే 25న విడుదల చేసింది. 
కాంబోడియాలోని అంగ్ కోర్‌వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోగా రెండు, మూడు స్థానాల్లో అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా నిలిచాయి. 


కేరళలో వృద్ధులకు ‘అక్షర సాగరం’అక్షరాస్యతలో ముందుండే కేరళ అక్షరసాగరం పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. తీరప్రాంతాలలోని వృద్ధులకు చదువు చెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. తీరప్రాంతంలో నివసిస్తున్న పెద్ద వయసు వారిని గుర్తించి, చదువు చెప్పి పంచాయతీ స్థాయిలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచనుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వారిలో 86 ఏళ్ల వయస్సుపైబడిన వృద్ధులు కూడా ఉన్నారు.
మొదటి దశలో 81 తీరప్రాంత వార్డులు, 15 పంచాయతిలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మలప్పురం, తిరువనంతపురం, కసరగాడ్ జిల్లాలను దీనికోసం ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పశువుల క్రయవిక్రయాలపై ఆంక్షలు సంతల్లో పశువుల (ఆవు, గేదె, ఎద్దు, ఒంటెలు) క్రయ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పశువుల క్రూరత్వ నిరోధక చట్టం-2017 (పశువుల సంతల నియంత్రణ)లో పలు మార్పులు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మే 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త నిబంధనలు 
  • కొత్త నిబంధనల ప్రకారం ఇకపై సంతలో పశువులను కొని కబేళాలకు తరలించడం కుదరదు. కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే సంతల్లో పశువుల క్రయవిక్రయాలు సాగాలి. ఈ నిబంధనలు వట్టిపోయిన పశువులకూ వర్తిస్తాయి.
  • పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా అమ్మేవ్యక్తి, వాటిని కబేళాలకు తరలించేందుకు కాదంటూ కొనుగోలుదారులు హామీ పత్రం సమర్పించాలి. దీనిని పశువుల సంత నిర్వహణ కమిటీలు ధ్రువీకరించాలి.
  • పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించి దాదాపు ఆరు నెలల రికార్డులు అందుబాటులో ఉంచాలి.
  • అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించకూడదు.

ధోలా-సదియా వంతెనను ప్రారంభించిన మోదీ అసోంలోని సదియా ప్రాంతంలో లోహిత్ నది (బ్రహ్మపుత్ర ఉపనది)పై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన వంతెన (9.15 కిలోమీటర్లు)ను ప్రధాని నరేంద్ర మోదీ మే 26న జాతికి అంకితం చేశారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఈ వంతెనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత-గాయకుడు భూపేన్ హజారికా పేరు పెట్టారు. మహారాష్ట్రలోని ముంబయిలో బాంద్రా - వోర్లీ మధ్య ఉన్న 3.5 కిలోమీటర్ల వంతెన ఇంతకముందు భారత్‌లోని అతిపొడవైన వంతెనగా ఉండేది. 
ధోలా-సదియా వంతెన విశేషాలు 
  • ఈ వంతెనతో అసోం - అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం 165 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 5 గంటలు తగ్గుతుంది.
  • 2011లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు వ్యయం రూ.950 కోట్లు. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ దీన్ని నిర్మించింది.
  • యుద్ధ ట్యాంకులు వెళ్లినా తట్టుకునే సామర్థ్యంతో వంతెనను నిర్మించారు. దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లోకి సైనిక బలగాలు సులువుగా చేరేందుకు వీలు కలుగుతుంది.
  • ఈ వంతెన భారత్ - చైనా సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.

ఎన్డీఏ ప్రభుత్వ మూడేళ్ల సంబరాలు 2017 మే 26తో ఎన్డీయే ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తోన్న దేశవ్యాప్త సంబరాలను అసోంలోని గువాహటిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నవభారత నిర్మాణంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాల వ్యాపార కేంద్రంగా మార్చనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా భారత్‌ను సూపర్ పవర్ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. అనంతరం అస్సాంలోని కామరూప్ జిల్లాలో నిర్మించతలపెట్టిన ఏయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు.

‘సంపద’ను ప్రారంభించిన మోదీఅస్సాంలోని ధేమాజీ జిల్లాలో భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.6 వేల కోట్లతో ‘సంపద’ (స్కీమ్ ఫర్ ఆగ్రో-మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆగ్రో-ప్రాసెసింగ్) పథకాన్ని ప్రారంభించారు.

గుజరాత్‌లో ఆవులకు ‘ఆధార్’ గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ఆధార్’ పద్ధతికి శ్రీకారం చుట్టిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం.. ఆవుల చెవుల్లో ఐడీ నంబర్‌తో ఉండే డిజిటల్ చిప్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రమంతా టెక్నిషీయన్ల బృందాలను పంపించింది. తొలిదశలో భాగంగా.. 37వేల ఆవులకు యునిక్ ఐడెంటీ నంబర్లను కేటాయించనుంది. ఆవుల ఆక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ డిజిటల్ చిప్‌లు ఉపయోగపడతాయని ప్రభుత్వం వివరించింది. 
ఈ చిప్‌ల్లో ఆవులకు కేటాయించిన నంబర్, వాటి అడ్రసు, రంగు, ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. 
గోవధకు పాల్పడిన వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే చట్టాన్ని గుజరాత్ ప్రభుత్వం 2017 ఏప్రిల్‌లో తీసుకొచ్చింది. 

అడ్వాణీ, జోషి, ఉమా భారతిపై కుట్ర అభియోగాలుబాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమా భారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రూ. 50 వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. 
ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. 

జయలలిత, శశికళ ఆస్తుల జప్తుఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 30న ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డెరైక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల్లోని 68 ఆస్తుల జప్తుకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగ వేలం వేయొచ్చు.
 

పశువధ నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టేపశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు మే 30న నాలుగు వారాల స్టే విధించింది. ఈ మేరకు నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు మదురై బెంచ్‌కి చెందిన జస్టిస్ ఎంవీ మురళీధరన్, జస్టిస్ సీవీ కార్తికేయన్‌ల ధర్మాసనం ఆదేశించింది. 

‘దంగల్’కు చైనాలో వెయ్యి కోట్లుభారత్‌లో వసూళ్ల రికార్డు సృష్టించిన అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’.. చైనాలో వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తం చైనా సినీ చరిత్రలోనే ఇంత మొత్తాన్ని సాధించిన సినిమాల్లో 33వదిగా మరో రికార్డునూ సొంతం చేసుకుంది. చైనా కరెన్సీలో ఒక బిలియన్ ఆర్‌ఎంబీలను దంగల్ వసూలు చేసిందని ‘మయన్’ వెబ్‌సైట్ తెలిపింది. చైనాలో ‘మయన్’ ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్. 
కాగా చైనాలో దంగల్‌ను మే 5న విడుదల చేశారు. అప్పటి నుంచి 15 రోజుల పాటు ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద తొలి స్థానంలో నిలిచింది. 


భారత్‌లో ఆన్‌లైన్ విద్యకు భారీ మార్కెట్2021 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ విద్యారంగం మార్కెట్ 1.96 బిలియన్ డాలర్ల (రూ.12,544 కోట్లు సుమారు)కు చేరుకుంటుందని గూగుల్-కేపీఎంజీ నివేదిక పేర్కొంది. పెయిడ్ యూజర్లు (డబ్బులు చెల్లించి సేవలు పొందేవారు) 2016లో 16 లక్షల మంది ఉండగా... 2021 నాటికి వీరి సంఖ్య ఆరు రెట్ల వృద్ధితో 96 లక్షలకు చేరుతుందని ‘భారత్‌లో ఆన్‌లైన్ విద్య: 2021’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
ఇతర వివరాలు.. 
  • ఆన్‌లైన్‌లో విద్యా సంబంధిత సమాచారం కోసం అన్వేషించే వారి సంఖ్య గత రెండేళ్లలో రెండు రెట్లు, మొబైల్స్ ద్వారా వెతికే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మొత్తం మీద ఈ విధంగా శోధించే వారిలో 44 శాతం మంది ఆరు మెట్రో నగరాలకు వెలుపలి నుంచే ఉన్నారు.
  • 2016లో ఒక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారానే విద్యా సంబంధిత కంటెంట్ వినియోగంలో నాలుగు రెట్ల పెరుగుదల కనిపించింది.
  • ఆన్‌లైన్‌లో పరీక్షలకు సన్నద్ధమయ్యే విభాగం ఏటా 64 శాతం పెరుగుతూ 2021కి 51.5 కోట్లకు విస్తరించనుంది.

మారిషస్ ప్రధాని భారత పర్యటనమారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ మే 26 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా మే 27న ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మారిషస్‌కు 500 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.3,227 కోట్లు) రుణం ఇవ్వడానికి భారత్ అంగీకరించింది.

ఏడీబీ గ్రూపు 52వ వార్షిక సమావేశంఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) గ్రూపు 52వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని మోదీ మే 22న గాంధీనగర్‌లో ప్రారంభించారు. ఇది మే 26 వరకు జరిగింది. భారత్‌లో ఈ భేటీ జరగడం ఇదే తొలిసారి. ఆఫ్రికాలో సంపద సృష్టికి వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం ఈ సదస్సు ఉద్దేశం.

ప్రసూతి ప్రయోజన పథకానికి కేబినెట్ ఆమోదంగర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రూ.6 వేల ఆర్థిక సాయాన్నందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రూ.1000, ఆర్నెల్ల తర్వాత రూ.2000, ఆస్పత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో రెండు వేల రూపాయలను (మొదటి విడత బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్-బి టీకాలు వేయించుకున్నారన్న ధ్రువీకరణ తర్వాతే) అందజేస్తారు. 

10 అణువిద్యుత్ ప్లాంట్లకు కేబినెట్ ఆమోదం దేశీయ అణు విద్యుదుత్పత్తికి తోడ్పాటునందించేందుకు 10 అణురియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ మే 17న ఆమోదం తెలిపింది. కేంద్రం ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతివ్వటం ఇదే మొదటిసారి. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 700 మెగావాట్లు. వీటి నిర్మాణం పూర్తయితే 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 
ప్రస్తుతం భారత్‌లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6780 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాజస్తాన్, గుజరాత్, తమిళనాడుల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా 2021-22 కల్లా మరో 6700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.

కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్షపై ఐసీజే స్టేకుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసీజే) స్టే విధించింది. ఈ మేరకు మే 15న భారత్, పాకిస్తాన్‌ల వాదనలు విన్న ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్ష అమలుపై స్టే విధిస్తూ మే 18న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తుది తీర్పు వెలువడే వరకూ శిక్షను అమలు చేయరాదంటూ పాక్‌ను ఆదేశించింది. 
ఈ కేసులో పాక్ వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం.. అసలు జాధవ్‌ను అరెస్టు చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాధవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని.. ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి (1977లో భారత్-పాకిస్థాన్‌లు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి) వ్యతిరేకమని స్పష్టం చేసింది. జాధవ్‌కు దౌత్యపరమైన సాయం అందేందుకు వీలు కల్పించాలని.. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కోర్టుకు వివరాలు అందజేయాలని పాకిస్తాన్‌కు సూచించింది. 
జాధవ్ కేసు పూర్వపరాలు 2016 మార్చి 23న బలూచిస్తాన్‌లో భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్ (46)ను అరెస్టు చేసిన పాకిస్తాన్ బలగాలు అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశాయి. దీనిపై స్పందించిన భారత్ జాధవ్ గతంలో నేవీలో పనిచేశారని.. అయితే ఆయన అరెస్టుకు ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నందున నేవీతో అతడికి సంబంధం లేదని ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌లో జాధవ్‌పై విచారణ ప్రారంభించిన పాక్ మిలటరీ కోర్టు భారత్ చెప్పిన అంశాలను పరిగణలోకీ తీసుకోలేదు. అత్యంత వివాదాస్పదంగా కేవలం నాలుగు విచారణల్లోనే జాధవ్‌ను దోషిగా తేల్చిన మిలటరీ కోర్టు.. 2017 ఫిబ్రవరి 10న మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు 2017 ఏప్రిల్ 10న అధికారికంగా ప్రకటించారు. 
దీనిపై భారత ప్రభుత్వం నెదర్లాండ్‌‌సలోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహాం నేతృత్వంలోని 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం మే 15 - 18 వరకూ విచారణ జరిపింది. భారత్‌తోపాటు పాకిస్థాన్ వాదనలు వినిపించాయి ( కేవలం ఒక్క రూపాయి ఫీజుతో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు ). పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జాధవ్‌కు ఎలాంటి దౌత్యసాయం అందకుండా అడ్డుకుంటోందని భారత్ వివరించింది. దీనిపై తాము 16 సార్లు విన్నవించినా కూడా తిరస్కరించిందని కోర్టుకు తెలిపింది. అయితే ఈ వాదనను పాకిస్థాన్ తప్పుబట్టింది. జాధవ్ ఒక గూఢచారి అని.. వియన్నా ఒప్పందం ప్రకారం ఉగ్రవాదులు, గూఢచర్యం చేసేవారికి దౌత్యసాయం ఉండదని వాదించింది. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. తమ తుది తీర్పు వచ్చేవరకు జాధవ్‌కు మరణశిక్ష అమలుకాకుండా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.
పాక్ వాదన వీగిందిలా...‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం (Vienna Convention on Consular Relations, 1963 )అమలులోకి వచ్చింది. దీనిపై భారత్ పాకిస్తాన్ 1969 ఏప్రిల్ 14, 1977 నవంబర్ 28న సంతకాలు చేశాయి. 
ఐసీజే పరిధిపై...‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది.

వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే..
స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా...
  • సొంత దేశానికి చెందిన వ్యక్తులను కలుసుకోవడానికి దౌత్య సిబ్బందికి, తమ దేశ దౌత్యవేత్తలను సంప్రదించడానికి ఆ దేశంలోని విదేశీయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
  • ఏ దేశంలోనైనా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా... సదరు వ్యక్తి కోరుకుంటే తక్షణం ఈ సమాచారాన్ని అతని దేశ రాయబార కార్యాలయానికి చేరవేయాలి.
  • అరెస్టయిన వ్యక్తి రాయబార కార్యాలయానికి రాసే లేఖలను వెంటనే పంపాలి. అతినికున్న హక్కుల గురించి స్పష్టంగా చెప్పాలి.
  • అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు.
ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్ రెండో వాదన వీగిపోయింది.
ఎందుకు కలవనివ్వట్లేదు?జాధవ్‌ను కలవడానికి అనుమతించాలని భారత్ ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పాక్ ఎందుకు ససేమిరా అంటోందంటే, అతనిపై విచారణ మిలటరీ కోర్టులో రహస్యంగా జరిగింది. జాధవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను పాక్ చూపడం లేదు. ఆయనతో బలవంతంగా ఒప్పించిన వీడియో మాత్రమే పాక్ వద్ద ఉంది. ఒకవేళ భారత దౌత్య సిబ్బంది జాధవ్‌ను కలిస్తే అసలు జరిగిందేమిటో ఆయన వివరిస్తాడు. పైగా దౌత్య సిబ్బంది అతనితో మాట్లాడితే న్యాయ సహాయమూ అందుతుంది. అందుకనే పాక్ భారత దౌత్య సిబ్బందికి జాదవ్‌ను కలిసే అవకాశమివ్వడం లేదు. 

అంతర్జాతీయ నాయస్థానం విధులు విధానాలు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది. కుల్‌భూషణ్ జాధవ్ కేసుతో ఈ న్యాయస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఐసీజే ఏర్పాటు, విధి విధానాలపై సమగ్ర విశ్లేషణ మీకోసం.... 
ఐసీజే ఏర్పాటు రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన న్యాయ సంస్థగా 1945 జూన్‌లో నెదర్లాండ్‌‌సలోని దక్షిణ హాలండ్ ప్రావిన్సు, ద హేగ్ నగరంలోని శాంతి సౌధంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఏర్పాటైంది. ఐరాస ఆరు ప్రధాన విభాగాల్లో ఒకటైన ఈ ప్రపంచ న్యాయస్థానం ఒక్కటే న్యూయార్క్ వెలుపల ఉండడం విశేషం. 
ఐసీజే విధులు సభ్య దేశాలు నివేదించిన న్యాయపరమైన వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరిష్కరించడం దీని బాధ్యత. ఐరాస అధికార విభాగాలు, ప్రత్యేక సంస్థలు అడిగిన న్యాయపరమైన అంశాలపై ఇది సలహాపూర్వకమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంది. ఇలా రెండు రకాల విచారణ పరిధి ఐసీజేకు కల్పించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సహా మొత్తం 15 మంది ఎన్నికై న న్యాయమూర్తులతో ఐసీజే పనిచేస్తుంది. ఐసీజే జడ్జీలను ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఎన్నుకుంటాయి. ఈ రెండు సంస్థల సంయుక్త సమావేశాల్లో, విడివిడి సమావేశాల్లో పూర్తి మెజారిటీ వచ్చిన వారే న్యాయమూర్తులుగా ఎన్నికవుతారు. ఐసీజే ప్రస్తుత అధ్యక్షుడు రోనీ అబ్రహాం ఫ్రాన్‌‌సకు చెందిన న్యాయకోవిదుడు. 
ఐసీజే జడ్జీగా ఎన్నికై తే స్వతంత్రులే...ఒకసారి ఐసీజే జడ్జీగా ఎన్నికై న తర్వాత ఎవరూ కూడా వారి దేశాల ప్రభుత్వాలకుగానీ, మరేదైనా దేశాల(ప్రభుత్వాల)కుగానీ ప్రతినిధులు కారు. ఐరాస ఇతర విభాగాల్లో దేశాల ప్రతినిధులుంటారు. ఈ జడ్జీలు మాత్రం స్వతంత్రులు. ఏక కాలంలో ఒకే దేశానికి చెందిన ఇద్దరు జడ్జీలుగా ఉండడానికి వీల్లేదు. భద్రతా మండలిలో సభ్యత్వం మాదిరిగానే ఆఫ్రికా నుంచి ముగ్గురు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాల నుంచి ఇద్దరు, ఆసియా నుంచి ముగ్గురు, తూర్పు ఐరోపా దేశాల నుంచి ఇద్దరు, పశ్చిమ ఐరోపాతోపాటు పలు ఇతర దేశాల నుంచి ఐదుగురు, చొప్పున జడ్జీలు ఐసీజేలో ఉంటారు.
జడ్జీలుగా చేసిన భారతీయులుసుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దల్వీర్ భండారీ ఐసీజే ప్రస్తుత 15 మంది జడ్జీల్లో ఒకరు. ఆయన 2012లో ఎన్నికయ్యారు. ఆయనకు ముందు భారత్‌కు చెందిన సర్ బెనెగళ్ నర్సింగ్‌రావు(1952-53), డా.నాగేంద్రసింగ్(1973-88), ఆర్‌ఎస్ పాఠక్(1988-90) ఐసీజే జడ్జీలుగా పనిచేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కూడా పనిచేసిన నాగేంద్రసింగ్ 1985-88 మధ్య మూడేళ్లు ప్రపంచ కోర్టు ప్రెసిడెంట్‌గా సేవలందించడం విశేషం. 1950లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి ఎంసీ చాగ్లా, 2002లో సుప్రీంకోర్టు మాజీ జడ్జీ బీపీ జీవన్‌రెడ్డిలు ఐసీజే తాత్కాలిక(అడ్‌హాక్) జడ్జీలుగా పనిచేశారు.
ఐసీజే అధ్యక్షుడు - రోని అబ్రహం ( 2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )
ఐసీజే ఉపాధ్యక్షుడు - అబ్దుల్‌కావీ యూసఫ్(2015 ఫిబ్రవరి 6 - 2018 ఫిబ్రవరి 5 )

జనసాంద్రత లో ముంబైకి మొదటి స్థానం జనసాంద్రత పరంగా ముంబై దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు నగరాలు నిలిచాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. హెచ్‌ఎండీకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సంస్థ లీ అసోసియేట్స్ మే 20న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. 
నివేదిక ప్రకారం ముంబైలో చదరపు కిలోమీటర్‌కు 21,000 మంది నివసిస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 20,932 మంది, హైదరాబాద్‌లో 10,263 మంది నివసిస్తున్నారు. సింగపూర్‌లో చ.కి.మీ.కు 7,801, టొరంటోలో 4,334 మంది మాత్రమే ఉన్నారు.
నగరాల వారీగా జనసాంద్రత
నగరంవిస్తీర్ణం (చ.కి.మీ.)జనాభాజన సాంద్రత (చ.కి.మీ.కు)
ముంబై6031.24 కోట్లు21,000
ఢిల్లీ7821.63 కోట్లు20,932
బెంగళూరు70984 లక్షలు11,909
హైదరాబాద్68069 లక్షలు10,263
సింగపూర్71956 లక్షలు7,801
టోరంటో63027 లక్షలు4,334

అమర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలటరీ జవాన్ల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారాన్ని అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) శరాతంగ్ పోస్ట్‌లో మే 20న నిర్వహించిన ‘సైనిక్ సమ్మేళన్’లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పారామిలిటరీ బలగాల్లోని 34,000 కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించామని వెల్లడించారు. 

దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగం సోషల్ మీడియా వినియోగంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ 4వ స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగంపై సర్వే నిర్వహించిన సోషల్ మీడియా ట్రెండ్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 
కోటి జనాభాకు చేరువైన హైదరాబాద్ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. హైదరాబాద్ నగరవాసులు ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్ సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారు. 

భారీ నౌకాదళ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం రూ. 20వేల కోట్లకు పైగా వ్యయంతో ప్రైవేటు రంగంలో నాలుగు ఉభయచర యుద్ధ నౌకల నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు 30వేల టన్నుల నుంచి 40 వేల టన్నుల సామర్థ్యంతో ఈ నౌకలు ఉండనున్నాయి. ప్రైవేటు రంగంలో చేపట్టనున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అనుమతులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెండు నౌకల నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు, మరో రెండు నౌకల బాధ్యతలను ఇతర సంస్థలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

తలాక్‌కు సంఘ బహిష్కరణ : ఐఏఎంపీఎల్‌బీ ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఈ మేరకు ట్రిపుల్ తలాక్ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని మే 22న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపింది. షరియత్ ప్రకారం ట్రిపుల్ తలాక్ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. 
భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ
  • వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. చేసిన తప్పులను మరచిపోయేందుకు యత్నించాలి. ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి.
  • అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్ (వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్ ముగిశాక వివాహం రద్దు అవుతుంది.
  • ఇద్దత్ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
  • విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్ చెప్పి తద్వారా విడాకులు పొందొచ్చు. మూడో తలాక్ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు.

దేశంలో తొలి లగ్జరీ రైలు తేజస్ ప్రారంభం 
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్, గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 200 కి.మీ. వేగంతో వెళ్లగల ఈ రైలు ప్రస్తుతానికి 130 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ 630 కి.మీ దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకుంటుంది. వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ముంబై-గోవాల మధ్య వారానికి ఐదు రోజులు, వర్షాకాలంలో వారానికి మూడు రోజులు ఈ రైలు నడవనుంది. మొత్తం 20 బోగీలు ఉంటాయి. రైలు బోగీలను పంజాబ్‌లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. భారతీయ రైల్వేలో ఇప్పటికి ఇదే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు.
తేజస్ రైలు ప్రత్యేకతలు
  • భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన రైలు. ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్‌‌స, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు.
  • ఇది పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారైంది. ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు. దుమ్ము, ధూళి కూడా అంటుకోదు.
  • ముంబై నుంచి గోవా వరకు చార్జీ రూ. 2,585. ఆహారంతో కలిపి అయితే రూ. 2,740. సాధారణ చెయిర్‌కార్‌లో రూ. 1,185, ఆహారంతో కలిపి అయితే రూ. 1,310.
  • సీట్లను అత్యంత అధునాతన డిజైన్‌తో తయారు చేశారు. రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులుండవు. అలసట ఉండదు.
  • ఈ రైల్లో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీ ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేందుకు అవకాశం.
  • ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ద్వారా రైలు ఎక్కడుందో సులభంగా తెలుస్తుంది. వికలాంగులకు బ్రెయిలీ లిపిలో సమాచారాన్ని ఏర్పాటు చేశారు.

యూపీలో హెల్మెట్ ఉంటేనే పెట్రోల్

రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా హెల్మెట్ లేనివారికి పెట్రోల్ విక్రయించొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని లక్నోలో మే 22 నుంచి నో హెల్మెట్ - నో ఫ్యూయల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. హెల్మెట్ లేకుండా వచ్చే వారికి ఇంధనం విక్రయించకూడదని లక్నోలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ప్రభుత్వం.. అలా వచ్చే వారి బైక్ నంబర్లను నోట్ చేసి పోలీసులకు ఇవ్వాలని సూచించింది. ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొస్తారు. 
2016లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఉపసంహరించుకుంది. 

పరిశోధనకు ‘వజ్ర’ కార్యక్రమం భారత శాస్త్ర, పరిశోధన సంస్థల్లో ఎన్‌ఆర్‌ఐ, విదేశీ శాస్త్రవేత్తలు మూడు నెలలు పనిచేసేలా కేంద్రం కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. ‘విజిటింగ్ అడ్వాన్‌‌సడ్ జాయింట్ రీసెర్చ్’(వజ్ర)గా పిలిచే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తారు. విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో పనిచేసేలా ప్రోత్సహించడంతో పాటు, మన పరిశోధక విద్యార్థులకు ఇది మార్గదర్శిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ‘మన విద్యార్థులకు విదేశీ పరిశోధన సంస్కృతిని పరిచయం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. శాస్త్రవేత్తలు తొలి నెల్లో 9.72 లక్షలు, తర్వాత నెలకు 6.48 లక్షలు వేతనంగా పొందుతారు.

దేశీయ వలసల్లో 3వ స్థానం 
అంతర్గత వలసలు అధికంగా నమోదవుతున్న మూడో దేశంగా భారత్ నిలిచింది. 2016లో దాదాపు 24 లక్షల మంది స్వదేశంలోని(భారత్‌లో) వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారని అంతర్గత వలసల పర్యవేక్షణ కేంద్రం(ఐడీఎంసీ), నార్వేజియన్ శరణార్థుల మండలి(ఎన్‌ఆర్‌సీ).. మే 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. దీని ప్రకారం అత్యధికంగా చైనాలో 74 లక్షల మంది స్వదేశంలో వలస వెళ్లగా, 59 లక్షల మందితో ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానంలో ఉంది.

సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ప్రారంభంసుప్రీం కోర్టులో సమగ్ర కేసు సమాచార నిర్వహణ వ్యవస్థ (integrated case management system) అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మే 10న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా డిజిటల్ ఫైలింగ్ చేసిన కేసు వివరాలను దేశంలో ఉన్న 24 హైకోర్టులతో పాటు సబార్డినేట్ కోర్టులతో అనుసంధానం చేస్తారు. 
ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్‌లైన్‌లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. 


ట్రిపుల్ తలాక్‌పై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టుదేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా పద్ధతుల రాజ్యాంగ బద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మే 11న విచారణ ప్రారంభించింది. ముస్లింలలోని బహుభార్యత్వానికి ట్రిపుల్ తలాక్‌తో సంబంధం లేనందున ఈ అంశాన్ని చర్చించమని తెలిపింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాం ప్రాథమికాంశమా? కాదా? అనే దానిపై చర్చ జరుగుతుందని.. ఇది ఇస్లాంలోని మూలసూత్రమే అని నిర్ధారణ అయితే దీని రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్ (సిక్కు) తోపాటుగా జస్టిస్ కురియన్ జోసెఫ్ (క్రిస్టియన్), జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ (పార్శీ), జస్టిస్ యుయు లలిత్ (హిందు), జస్టిస్ అబ్దుల్ నజీర్ (ముస్లిం) సభ్యులుగా (ఒక్కో మతం నుంచి ఒక్కరు) ఉన్నారు.
ట్రిపుల్ తలాక్ ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకం అని సైరా బానో అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. 

శ్రీలంక పర్యటనలో ప్రధాని మోదీభారత్-శ్రీలంక మధ్య బౌద్ధమతానికి సంబంధించి అవినాభావ సంబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 11న శ్రీలంక చేరుకున్న ప్రధాని బౌద్ధులకు అత్యంత కీలక పండుగ అయిన అంతర్జాతీయ వేసాక్ దినోత్సవాల్లో పాల్గొననున్నారు. భారత ఆర్థిక సాయంతో శ్రీలంకలో రూ.150 కోట్లతో నిర్మించిన వైద్యశాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

విద్యుదీకరణపై ప్రధాని సమీక్షవిద్యుదీకరణ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 9న సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం 18,452 గ్రామాలకుగాను 13 వేల గ్రామాలకు విద్యుదీకరణ పూర్తైదని, లక్ష్యం ప్రకారం 1000 రోజుల్లో అన్ని గ్రామాలకు విద్యుదీకరణను పూర్తి చేస్తామని ప్రధానమంత్రికి అధికారులు వివరించారు.

చార్‌ధామ్‌కు రైలు మార్గంపై సర్వే పూర్తి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ (యమునోత్రి-గంగోత్రి-కేదార్‌నాథ్- బద్రీనాథ్) పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే రైల్వే మార్గం ఏర్పాటు కానుంది. ఈ మేరకు రైల్వే వికాస్ నిగమ్ దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. మొత్తం 327 కి.మీ. ఈ ప్రాజెక్టును రూ.43292 కోట్ల వ్యయంతో (అంచనా) నిర్మించనున్నారు.

ఫిట్ ఇండియా సర్వే - 2017 దేశంలో 20 - 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ సంస్థ వెల్లడించింది. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించిన సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20-25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది. 

సర్వే వివరాలు 
  • ఫిట్‌నెస్‌పై అవగాహన విషయంలో పుణె అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం స్కోరు 7.6 కాగా చండీగఢ్ 7.3 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. కోల్‌కతా (6.71), ఢిల్లీ/ఎన్‌సీఆర్ (6.68), హైదరాబాద్ (6.6), బెంగళూరు (6.34), చెన్నై (6.21) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • ఈ తరం యువత అత్యధికంగా పాల్గొనే ఫిట్‌నెస్ కార్యక్రమం ‘యోగా’. బెంగళూరులో అత్యధికులు (74 శాతం) యోగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంఖ్య చెన్నైలో 71 శాతంగా, హైదరాబాద్‌లో 67 శాతంగా ఉంది.
  • వ్యాయామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అత్యధికులు యూట్యూబ్‌పై ఆధారపడుతున్నారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు యూట్యూబ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య బెంగళూరులో 68 శాతం.. చెన్నైలో 58 శాతం మాత్రమే.

‘ట్రిపుల్ తలాక్’ చెత్త విధానం : సుప్రీంకోర్టు ముస్లిం సమాజంలో వివాహ రద్దుకు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్ అత్యంత చెత్త, అవాంఛనీయ విధానమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మే 12న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ అంశం న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదగింది కాదని, నిఖానామా ప్రకారం ట్రిపుల్ తలాక్‌ను తిరస్కరించే హక్కు మహిళలకు ఉందని కోర్టు సలహాదారు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నివేదించడంతో ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. 

పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ ఇండెక్స్ - 2017పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ తేల్చింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన సంస్థ 10 అంశాలను నేపథ్యంగా తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్-2017ను విడుదల చేసింది. ఈ నివేదికలో పాలనాపరంగా కేరళ, తమిళనాడు, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో నిలవగా.. తెలంగాణ 20వ స్థానంలో ఉంది. 
అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహిళలు-పిల్లలు, న్యాయ పరిష్కార సేవలు, నేరా లు-శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శకత-జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థిక స్వేచ్ఛ అంశాలతో కూడిన 10 నేపథ్యాలను పరిశీలించి ఈ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. 

ద్రవ్య నిర్వహణలో తెలంగాణ ఫస్ట్.. ఏపీకి 28రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయాలతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది. 
ఏ అంశంలో ఏ స్థానం..
  • పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర ‘ఆర్థిక స్వేచ్ఛ’ అంశంలో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి.
  • విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర ‘అవసరమైన మౌలిక వసతులు’ అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి.
  • విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన ‘మానవ అభివృద్ధికి చేయూత’లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం దక్కాయి.
  • ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక న్యాయం-సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర ‘సామాజిక భద్రత’ అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో నిలిచాయి.
  • పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర ‘మహిళలు-పిల్లలు’ అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి.
  • అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే ‘నేరాలు, శాంతిభద్రతలు’ అంశంలో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి.
  • కేసుల పెండెన్సీ, న్యాయాధికారుల ఖాళీలు, అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన ‘న్యాయ సేవల పరిష్కారం’లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి.
  • కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి.
  • ఈ-గవర్నెన్స్‌ సేవలు, ఆర్‌టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

నమామి దేవి నర్మదే సేవా యాత్ర ముగింపు నర్మదా నది పరిరక్షణ కోసం చేపట్టిన నమామి దేవి నర్మదే సేవా యాత్ర మే 15న ముగిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని అన్నూపూర్ జిల్లాలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నర్మదా నది సంరక్షణకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడాన్ని ‘భవిష్యత్ దృష్టితో చేసిన సరైన కార్యక్రమం’ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి ముందు నర్మదా నది జన్మస్థానమైన అమర్‌కంఠక్ వద్ద మోదీ పూజలు నిర్వహించారు. 
నమామి దేవి నర్మదే సేవా యాత్రను 2016 డిసెంబర్ 11న అమర్‌కంఠక్‌లో ప్రారంభించారు. సుమారు 150 రోజుల పాటు సాగిన ఈ యాత్ర 1100 ఊళ్ల మీదుగా 3,344 కి.మీ., పాటు సాగింది. 

స్వతంత్ర పాలస్తీనాకు భారత్ మద్దతు
శాంతికోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో మే 16న సమావేశమైన మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌తో శాంతియుత సహజీవనం సాగిస్తూనే సార్వభౌమాధికారం, స్వాతం త్య్రం కలిగిన ఐక్య పాలస్తీనాను చూడాలని భారత్ ఆకాంక్షిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వీసా మినహాయింపులు, వ్యవసాయ రంగం, ఆరోగ్యం, క్రీడలు తదితర అంశాలకు సంబంధించి ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. 

చెన్నైలో భూగర్భ మెట్రో రైలు సేవలు ప్రారంభం
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయడు మే 14న చెన్నైలో (తిరుమంగళంలో) భూగర్భ మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ప్రజలు తరలివెళ్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మెట్రోరైలు సేవలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.

చక్కెర సబ్సిడీ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం పేదలకు అంత్యోదయ అన్న యోజన కింద ఇచ్చే చక్కెర సబ్సిడీని కేంద్రం పునరుద్ధరించింది. ఈ మేరకు మే 3న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కేజీ చక్కెరపై రూ.18.50 సబ్సిడీని రాష్ట్రాలకు అందించడానికి ఆమోదం తెలిపింది. దీనివల్ల కేంద్రంపై రూ.550 కోట్ల భారం పడనుంది. 

దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ప్రారంభం భారత్‌లోనే తొలి ప్రైవేటు ఆయుధ కార్మాగారం మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు భిండ్ జిల్లా మలన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కర్మాగారాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మే 4న ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పుంజ్ లాయిడ్ రక్ష సిస్టమ్స్ (భారత్), ఇజ్రాయిల్ వెపన్ సిస్టమ్స్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన ఈ కర్మాగారం ద్వారా ఎక్స్95 కార్బైన్ అండ్ అసాల్ట్ రైఫిల్, గాలిల్ స్నైపర్ రైఫిల్, తావోర్ అసాల్ట్ రైఫిల్, నెగేవ్ లైట్ మెషిన్‌గన్‌లను ఉత్పత్తి చేయనున్నారు. 

బిల్కిస్ బానో కేసులో 12 మందికి జీవిత ఖైదుగుజరాత్‌లో సంచలనం రేపిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 12 మందికి జీవిత ఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు మే 4న తీర్పు వెలువరించిన న్యాయస్థానం దోషుల్లో ముగ్గురికి ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అదేసమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులు, వైద్యులను నిర్దోషులుగా ప్రకటించిన కింది కోర్టు తీర్పును పక్కనబెట్టింది. కాగా, ఈ ఏడుగురూ ఇప్పటికే అనుభవించిన జైలు జీవితాన్ని శిక్షాకాలంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. 
2002 గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్‌లోని బిల్కిస్ ఇంటిపై దాడి చేశారు. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులైన ఏడుగురిని హతమార్చారు. ఈ కేసులో 2008లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. 

‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష విధించిన సుప్రీం కోర్టునిర్భయ కేసులో నలుగురు హంతకులకు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు దోషులు ముకేశ్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ మే 5న తీర్పు వెలువరించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది. 
2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి దోషులు ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషులకు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుని తీర్పుని సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా ఈ రెండు కోర్టుల తీర్పులని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో మరో దోషి రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా బాలనేరస్తుడు మూడేళ్ల జైలుశిక్ష అనంతరం జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు.

హెచ్‌ఐవీ చిన్నారుల కోసం నోటిఫికేషన్ జారీకి సుప్రీం ఆదేశం ప్రాణాంతకర హెచ్‌ఐవీ సోకిన చిన్నారులను సైతం బలహీనవర్గాల జాబితా (డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్)లో చేరుస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కొత్త నోటిఫికేషన్ జారీచేయాలని సుప్రీంకోర్టు మే 5న ఆదేశించింది. చిన్నారులకు ఉచిత, నిర్భంద విద్యా హక్కు కల్పిస్తూ 2009లో తెచ్చిన చట్టం ప్రకారం హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను డిస్‌అడ్వాంటేజ్ గ్రూప్‌లో చేర్చాల్సి ఉంది. అందుకనుగుణంగా ఇప్పటికే 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కొత్త నోటిఫికేషన్ తెచ్చాయని, మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు అదేబాటలో నడవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌మినహా మిగతావన్నీ వచ్చే ఎనిమిది వారాల్లో నోటిఫికేషన్ జారీచేయాలని కోర్టు నిర్దేశించింది. 

దాణా కేసులో 9 నెలల్లో విచారణ ముగించాలన్న సుప్రీంకోర్టు దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నాలుగు కేసుల్లో వేర్వేరుగా విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు లాలూపై నేరపూరిత కుట్ర అభియోగాలను కొట్టేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతూ మే 8న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 
లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకుంది. 

మావోయిస్టుల అణచివేతకు ‘సమాధాన్’ వ్యూహంమావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సదస్సు రెండ్రోజుల పాటు ( మే 8 - 9 ) న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. మావోయిస్టుల అణచివేసేందుకు ‘సమాధాన్’ (SAMADHAN) వ్యూహాన్ని వివరించారు. నక్సల్స్ విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే ప్రధాన లక్ష్యమని రాజ్‌నాథ్ చెప్పారు. 
సమాధాన్ వ్యూహం..S- Smart Leadership 
A - Agressive Strategy
M - Motivation and Training 
A - Actionable Intelligence
D - Dashboard Key Performance Indicators (KPI), Key Resuly Area (KRA)
H - Harnessing Technology
A - Action Plan for Each Theatre
N - No Access to Finance 

మధ్యప్రదేశ్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో మార్పురాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌తో కాకుండా.. జనవరితో మొదలుపెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మే 2న నిర్ణయించింది. ఇటీవల నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని జనవరి-డిసెంబర్ విధానానికి మార్చాలనే ఆలోచనకు ప్రధాని నరేంద్రమోదీ మద్దతు పలికిన నేపథ్యంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

10 ఏళ్లలో 2.37 కోట్లు పెరిగిన పత్రికల ప్రతులుభారత్‌లో పదేళ్లలో పత్రికల ప్రతుల సంఖ్యలో ఏకంగా 2.37 కోట్ల పెరుగుదల నమోదైందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) వెల్లడించింది. ఈ మేరకు మే 8న ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పత్రికల వార్షిక వృద్ధిరేటు 4.87 శాతంగా ఉంది. 2006లో ప్రతుల సంఖ్య రోజుకు 3.91 కోట్లు ఉండగా.. 2016 నాటికి అది 6.28 కోట్లకు చేరింది. 
అక్షరాస్యత పెరగడం, పత్రికా పఠనం దైనందిన జీవితంలో ఓ భాగంగా మారడం, పత్రికలు, వాటి ధరలు అందుబాటులో ఉండడంతో ప్రింట్ మీడియాకు ఆదరణ పెరుగుతోందని ఏబీసీ పేర్కొంది. 

రామానుజాచార్య స్టాంప్ ఆవిష్కరణరామానుజాచార్య సహస్రాబ్ది (1000వ జన్మదిన వేడుకలు) ఉత్సవాల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూపొందించిన తపాలా బిళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మే 1న ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రామానుజాచార్య తొలి తపాలాబిళ్లను ప్రధాని చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అందుకున్నారు.

రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణదేశంలోనే రెండో ఎత్తైన జెండాను మే 1న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో నెలకొల్పారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్ కేఎస్‌బీపీ ట్రస్టు ఏర్పాటు చేసిన 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా పొడవు 90 అడుగులు కాగా వెడల్పు 60 అడుగులు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్ సరిహద్దులో అట్టారి వద్ద (360 అడుగులు) ఉంది.