Wednesday, 23 August 2017

ఆగస్టు 2017 జాతీయం

ప్రధానికి సలహాలు ఇవ్వనున్న సీఈవో గ్రూప్‌లుప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నీతి ఆయోగ్ సీఈవో బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరు బృందాలుగా ఏర్పడిన 200 మంది సీఈవోలు.. ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సరళ వ్యాపారం, పరిపాలన తదితర అంశాల్లో ప్రధాని, కేంద్ర మంత్రివర్గానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 2022 నాటికి సరికొత్త భారత్, మేక్ ఇన్ ఇండియా, రేపటి నగరాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రైతుల ఆదాయం రెట్టింపు అంశాలపై ఈ ఆరు బృందాలు పనిచేస్తాయి. 

మెంటార్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభం దేశవ్యాప్తంగా 900కుపైగా ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌లోని విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన మెంటార్ ఇండియా క్యాంపెయిన్‌ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆగస్టు 23న ప్రారంభించారు. ఇందులో భాగంగా నీతిఆయోగ్ ఎంపిక చేసిన వివిధ రంగాల్లోని నాయకులు(లీడర్స్) వారంలో రెండు గంటల పాటు విద్యార్థులతో సమావేశమవుతారు. తద్వారా విద్యార్థుల్లో డిజైన్, కంప్యూటేషనల్ నైపుణ్యాలు పెంపొందిస్తారు. 
అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో విద్యార్థులు ఇన్నోవేషన్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడే ఆలోచనలకు రూపు ఇస్తారు. 


సివిల్స్ అధికారుల కేటాయింపునకు జోనల్ విధానం సివిల్ సర్వీసెస్ అధికారులకు కేడర్ల కేటాయింపులో నూతన విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఓఎస్) అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులుగా జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను 5 జోన్లుగా విభజించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం ప్రకారం అభ్యర్థి ప్రతి జోన్‌లోనూ ఒక రాష్ట్రాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఇకపై ఒకే జోన్‌లో రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇవ్వడం కుదరదు.
ఏ జోన్లో ఏ రాష్ట్రాలు... జోన్-1: అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్తాన్, హరియాణా, కేంద్రపాలిత ప్రాంతాలు 
జోన్-2: ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా
జోన్-3: గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ 
జోన్-4: పశ్చిమబెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ 
జోన్-5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ 

ఓబీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ రిజర్వేషన్ ఫలాలను ఓబీసీలకు మరింత సమర్థవంతంగా అందేలా ఓబీసీ వర్గీకరణ చేపట్టేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిషన్ ఓబీసీ కేటగిరీల్లో (కేంద్ర జాబితాలోని)ని కులాలు, వర్గాలకు అందుతున్న రిజర్వేషన్లను పరిశీలించి 12 వారాల్లో వర్గీకరణకు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలను ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఓబీసీల వర్గీకరణ జరిగింది.
 

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే 
వ్యక్తిగత గోప్యతపై దేశ అత్యున్నత ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం ‘రైట్ టు ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విసృ్తత ధర్మాసనం ఆగస్టు 24న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ అంశంపై గతంలో ఇచ్చిన రెండు తీర్పులను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే.. ఆధార్‌పై ప్రత్యేక భద్రతావ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. 
ఉల్లంఘనే అంటూ పిటిషన్లు..కేంద్ర ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్ అనుసంధానించడం వ్యక్తిగత హక్కును ఉల్లంఘించడమేనని ఆందోళన వ్యక్తంచేస్తూ 2015లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది. ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు జులై 18న సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు ఉందా, లేదా అనే దానిపై చర్చించాలని, వీటిపై స్పష్టత వచ్చాకే ఆధార్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల విచారణను చేపడుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇప్పుడే తొలిసారి కాదు..వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టులో చర్చ జరగడం ఇదే తొలిసారి కాదు. 1954లో ఎంపీ శర్మ కేసులో భాగంగా వ్యక్తిగత గోప్యతపై చర్చ జరిగింది. ఆ తర్వాత 1963లో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ రెండు కేసుల్లో కూడా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం తేల్చింది. ఆ తర్వాత 1970, 80లలో సుప్రీంకోర్టులో వివిధ బెంచ్‌లు ప్రాథమిక హక్కేనని తీర్పునిచ్చినా.. సంఖ్యాపరంగా అవి చిన్న ధర్మాసనాలు కావడంతో.. 1954, 63లో ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆధార్ అనుసంధానం చేయడంతో మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. అయితే గతంలో పరస్పర విరుద్ధ తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని విసృ్తతమైన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఇంతకుముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. దీంతో తొమ్మిది మంది న్యాయమూర్తులతో విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. గతంలో ఇచ్చిన రెండు తీర్పులను కొట్టివేసింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవంగా తేల్చింది.

తదుపరి తీర్పే కీలకం.. ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులకు, మొబైల్ కంపెనీ సిమ్‌లకు ఆధార్ కార్డును అనుసంధానించడంపై సందిగ్ధత ఏర్పడింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని పేర్కొన్న సుప్రీంకోర్టు, ఆధార్‌పై అభ్యంతరాలను ప్రస్తావించలేదు. బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికి తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు, వ్యక్తిగత గోప్యత కిందకే వస్తాయని పలువురు న్యాయవాదులంటున్నారు. అయితే ఇప్పటికే ఆధార్ అనుసంధానం ప్రక్రియ 80 శాతం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారనే విషయమై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ అనుసంధాన ప్రక్రియ వ్యక్తిగత గోప్యత కిందకు వస్తుందా? వస్తే ప్రభుత్వం తప్పనిసరి చేస్తున్న ఆధార్ కార్డు వివరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ పీటముడిపై ఏర్పడిన సందిగ్థతను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ‘గోప్యత’ అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? లేదా అనే దానిపై తీర్పు చెప్పనుంది.

గోప్యత అంటే! వ్యక్తిగత అన్యోన్యత, కుటుంబ జీవితం, వివాహం, సంతానం, ఇల్లు, లింగ నేపథ్యం వంటి అంశాలన్నీ గోప్యత కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ‘తన జీవితం ఎలా ఉండాలో కోరుకోవటం గోప్యత అవుతుంది. భిన్నత్వాన్ని కాపాడుతూ.. మన సంస్కృతిలోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని గోప్యత సూచిస్తుంది. గోప్యతపై న్యాయపరమైన అంచనాలు సన్నిహితం నుంచి వ్యక్తిగతంలో, వ్యక్తిగతం నుంచి బహిరంగ అంశాల్లో వేర్వేరుగా ఉంటాయి. అయితే బహిరంగ వేదికపై వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకుండా చేయటం చాలా ముఖ్యం’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

సముద్ర గర్భ మిషన్‌ను ప్రారంభించనున్న భారత్ సముద్రం అడుగన ఉన్న సహజ వనరులను సరైన రీతిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సముద్ర గర్భ మిషన్ (డీప్ ఓషన్ మిషన్)ను చేపట్టనుంది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వశాఖ (Ministry of Earth Sciences) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2018 జనవరిలో ప్రారంభించనున్నారు. 
భారత్‌కు 7,500 కి.మీ. తీర ప్రాంతం.. 2.4 మిలియన్ చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) ఉంది. భారత్‌కు చెందిన సముద్ర జలాల్లో అపారమైన శక్తి, ఆహారం, ఔషధ వనరులు ఉన్నాయి.


కేసుల సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ: నీతిఆయోగ్ న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని ప్రతిపాదించింది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్్స (యూఎస్), సింగపూర్‌లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని సూచించింది.

ఒకేసారి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫార్సు 
దేశంలో 2024 నాటికల్లా లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో, తగ్గించడమో చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. 2017-18 నుంచి 2019-20 కోసం రూపొందించిన త్రైవార్షిక ప్రణాళికలో ఈ విషయాలను ప్రస్తావించింది. అలాగే దేశంలో నిరుద్యోగం ప్రధాన సమస్య కాదని, అర్హతలు, నైపుణ్యాలు ఉన్న వారికి ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు, వేతనాలు లభించకపోవడమే తీవ్ర సమస్యని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. తీరప్రాంత ఉపాధి మండళ్ల (సీఈజడ్)ను ఏర్పాటు చేస్తే కొన్ని బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.


వైవాహిక అత్యాచారం నేరం కాదు : కేంద్రం 
భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని, అలా చేస్తే వివాహ వ్యవస్థ అస్థిరమవుతుందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. భర్తలను వేధింపులకు గురిచేయడానికి భార్యలకు అది ఒక సులభమైన ఆయుధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని (మారిటల్ రేప్)ను నేరంగా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్రం ఆగస్టు 29న అఫిడవిట్ సమర్పించింది. ఐపీసీ సెక్షన్ 498 ఏ (గృహ హింస వ్యతిరేక చట్టం) దుర్వినియోగమవుతున్న సంగతి సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల దృష్టికి వచ్చిందని గుర్తుచేసింది. 


దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారందక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు. 

దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభంముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ర్టలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్‌లో ఉంటాయి.

కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు 
మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. 
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్ష మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విసృ్తతంగా వాడే కోబాల్ట్-క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ.1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి.


యూపీలో ఆన్‌లైన్‌లో మదరసాల నమోదు ఇస్లాం విద్యా సంస్థలు మదరసాల్లో అక్రమాలు నిరోధించేందుకు, వాటిని ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. మదరసాల్లో అక్రమాలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటి నమోదును ఆన్‌లైన్ చేయడం వల్ల మదరసాల నిర్వహణ, ఉపాధ్యాయులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని వక్ఫ్ మంత్రి మోహసిన్ రాజా చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్న డిజిటల్ విధానంలో ఈ చర్య ఓ భాగం.

మధ్యప్రదేశ్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మధ్యప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. అయితే.. అటవీ శాఖకు మాత్రం ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. 12వ తరగతిలో 75 శాతం లేదా, సీబీఎస్‌ఈలో 85 శాతం పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య ఖర్చును బీజేపీ భరిస్తుందని చౌహాన్ ప్రకటించారు. 


తమిళనాడులో ఒక్కటైన ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆర్నెల్ల విభేదాల అనంతరం ఏఐఏడీఎంకే లోని పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనమయ్యాయి. అధికార మార్పిడి విషయంలో రెండు వర్గాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం పార్టీ పగ్గాలు పన్నీర్ సెల్వం, ప్రభుత్వ బాధ్యతలు పళని స్వామి నిర్వర్తించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా పన్నీరు సెల్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలతోపాటు మరికొన్ని శాఖలను పన్నీర్ వర్గానికి ఇచ్చేందుకు కూడా సీఎం పళనిస్వామి అంగీకరించారు. ఇకపై పన్నీర్ సెల్వం అన్నాడీఏంకే సమన్వయకర్తగా, పళనిస్వామి ఉప సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 
డిప్యూటీగా పన్నీర్ ప్రమాణం అనంతరం గవర్నర్ విద్యాసాగర్‌రావు పన్నీర్‌సెల్వంతో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ చేయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం.. ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ శాఖలను నిర్వహిస్తారు. 


2018 నాటికి ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్2018 మార్చి నాటికి పాస్‌పోర్టుల జారీ కోసం పోలీసులు భౌతికంగా వెళ్లి వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదని హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. ఇందుకోసం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్టు(సీసీటీఎన్‌ఎస్)ను విదేశాంగ శాఖ నేతృత్వంలోని పాస్‌పోర్టు సేవలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల పోలీసులు భౌతికంగా వెరిఫికేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే వ్యక్తుల వివరాలు (గతంలో నేరచరిత్ర ఏమైనా ఉంటే) తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్టులో భాగంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21న న్యూఢిల్లీలో డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. 
దేశంలోని మొత్తం 15,398 పోలీస్ స్టేషన్లలో 13,775 స్టేషన్లను సీసీటీఎన్‌ఎస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 


రవాణా సేవలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి తెలంగాణలో రవాణా శాఖ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 23 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర సేవలకు ఆధార్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. 

ట్రిపుల్ తలాక్ చెల్లదు : సుప్రీంకోర్టు ముస్లింలు అప్పటికప్పుడు ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు ఆగస్టు 22న తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ చెల్లదనీ, ఇది చట్ట, రాజ్యాంగ విరుద్ధమని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు చెప్పింది. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ ఖురాన్ సూక్తులకు వ్యతిరేకమనీ, అంగీకారయోగ్యం కాదని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్‌లు ఇచ్చిన మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్ విడివిడిగా తీర్పులివ్వగా... జస్టిస్ లలిత్ మాత్రం నారిమన్ తీర్పుతో ఏకీభవించారు. అలా వీరిది మెజారిటీ తీర్పు అయి్యంది. కాగా మైనారిటీ తీర్పునిచ్చిన జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం విరుద్ధ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ట్రిపుల్ తలాక్ దీర్ఘకాలంగా వాడుకలో ఉన్నదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని... షరియా చట్టాలు కూడా ఆమోదిస్తున్నందున అది మతాన్ని ఆచరించే స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్-25 కిందకు వస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నెల్ల నిషేధం విధించాలనీ, ఆలోగా రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి ఈ అంశంలో చట్టం చేయడానికి ఏకతాటిపైకి రావాలని కోరారు. 
సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న సుమోటోగా ఓ పిల్‌ను చేపట్టింది. సుప్రీం పిల్‌కు షాయరా భానోతోపాటు మరో నలుగురు బాధిత మహిళల పిటిషన్లూ తోడయ్యాయి. మరో రెండు పిటిషన్లను ఇతర సంస్థలు వేశాయి. మొత్తం ఈ ఏడు పిటిషన్లను సుమోటో పిల్‌తో కలిపి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ తీర్పునిచ్చింది. 
‘ఇన్‌స్టంట్’కే నోసుప్రీంకోర్టు తీర్పు చెప్పింది... ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం (ఇన్‌స్టంట్) చెల్లదని మాత్రమే. అంతేకాని మొత్తం ట్రిపుల్ తలాక్ విధానాన్ని నిషేధించలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు మూడురకాలు.
తలాక్-ఎ-అహ్‌సాన్: ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్‌సాన్ అనే పదానికి అర్థం... అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం... భార్య రుతుక్రమంలో లేనప్పుడు... భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే... తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే. 
తలాక్-ఎ-హసన్: పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే... వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు. 
తలాక్-ఎ-బిద్దత్: ‘తలాక్... తలాక్... తలాక్’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్-ఎ-బిద్దత్. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు. 
క్షణికావేశంలో, అనాలోచితంగా నిర్ణయం తీసుకుని జీవిత భాగస్వామిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ... క్షణాల్లో విడాకులిచ్చేయడం సరికాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తలాక్‌ను 22 ముస్లిం మెజారిటీ దేశాలు నిషేధించడం గమనార్హం. 

డిజిటల్ పోలీస్ పోర్టల్సేవలు ప్రారంభండిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్‌వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్‌ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్‌ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్‌ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. 

ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో22 మంది మృతిఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

బిహార్ వరదల్లో 98 మంది మృతి బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్‌డీఆర్‌ఎఫ్, 92 ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ - 2017 భారత్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఆగస్టు 9, 10 తేదీల్లో బెంగళూరులో భారత సాంకేతిక సదస్సు జరిగింది. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవంవైపు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఏడాది ‘పారిశ్రామిక విప్లవం 4.0’ పేరుతో సదస్సు నిర్వహించారు.భారత్ పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు 10 అంశాలు కీలకమని భావించిన నిర్వాహకులు కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై చర్చలు జరిపారు. 
సదస్సులో భాగంగా వ్యవసాయంపై 200 మందితో వర్క్‌షాపు నిర్వహించారు. ఇక్రిశాట్, నాబార్డ్ ప్రతినిధులు పాల్గొన్న ఈ వర్క్‌షాపులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, కూలీలు, సాగులో జాగ్రత్తలపై చర్చలు జరిపారు.


రిజర్వేషన్ల కోసం మరాఠాల భారీ ర్యాలీవిద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మహారాష్ట్ర రాజధాని ముంబైలో మరాఠాలు ఆగస్టు 9న భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు, జెండాలతో ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. 12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. 
ర్యాలీతో వెంటనే స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, బీసీలకు మాదిరిగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించడాన్ని 2014లోనే బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003-04లోనూ మరాఠాలను ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది. 


ఐటీఐలకు బోర్డు ఏర్పాటు చేస్తాం: కేంద్రంసీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)కు జాతీయ స్థాయిలో ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలకు మానవవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ ఆగస్టు 9న వెల్లడించారు. ఐటీఐల్లో ప్రాక్టికల్‌కు 70 శాతం, ఎంచుకున్న సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు ఉండేలా జాతీయస్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు తరహాలో సర్టిఫికెట్లు జారీచేయడం వీలవుతుంది. 
 

సైగలతో జాతీయ గీతాలాపనసైగలతో జాతీయ గీతం ఆలపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆగస్టు 10న విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు. జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలని.. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నామని మంత్రి అన్నారు. 
గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తుంది. 


మదర్సాలు ‘పంద్రాగస్టు’ను చిత్రీకరించాలి: యూపీ ప్రభుత్వం ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడమేకాక, కార్యక్రమాన్ని ఫొటోలు తీసి, వీడియోలో చిత్రీకరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహించాలని పేర్కొంది. ఆదేశాల్ని పాటించని మదర్సాలపై చర్యలు తీసుకుంటామని మైనారిటీ సంక్షేమ సహాయ మంత్రి బల్‌దేవ్ హెచ్చరించారు. 

వితంతువుల పరిస్థితుల అధ్యయనానికి కమిటీ ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఆవేదన వ్యక్తం చేసింది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్ట వేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.


10 ప్రాజెక్టులకు క్లీన్ గంగా మిషన్ ఆమోదం బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లతో చేపట్టే 10 ప్రాజెక్టులకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆమోదం తెలిపింది. వీటిలో 8 ప్రాజెక్టులు మురుగు నీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినవి. మిగతా రెండు.. ఘాట్ల అభివృద్ధి, గంగా జ్ఞాన కేంద్రానికి సంబంధించినవి. 


బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు - 2017కు రాజ్యసభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది. లోక్‌సభ ఇంతకముందే ఈ బిల్లుని ఆమోదించింది. రుణ ఎగవేతదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేస్తూ సవరణ బిల్లు తీసుకొచ్చింది. 
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) విలువ రూ.6.41 లక్షల కోట్లు కాగా మొత్తం అన్ని బ్యాంకుల్లో కలిపి ఈ మొత్తం రూ. 8.02 లక్షల కోట్లుగా ఉంది.
 

2022 నాటికి 60 గిగావాట్ల పవన విద్యుదుత్పత్తి కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి దేశవ్యాప్తంగా 60 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆగస్టు 10న వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని చేరాలంటే ఏటా 5,500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 32.5 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 


ఓడీఎఫ్ ఆవాసాలుగా గంగా నది తీరంలోని గ్రామాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గంగా నది తీరం వెంట ఉన్న 4,480 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ఆవాసాలుగా(ఓడీఎఫ్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో నిర్వహించిన "గంగా గ్రామ్ సమ్మేళన్" లో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ మేరకు ప్రకటన చేశారు. నమామి గంగా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. అలాగే... గంగా నది తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణ-పునరుజ్జీవం, సేంద్రీయ వ్యవసాయం వంటి కోసం "గంగా గ్రామ్" అనే కార్యక్రమాన్ని తోమర్ ప్రారంభించారు. తొలి దశలో 24 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 


ఏనుగుల రక్షణకు గజ్ యాత్ర ప్రారంభం ప్రపంచ ఏనుగుల దినోత్సవం (ఆగస్టు 12న) సందర్భంగా దేశంలో ఏనుగుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ''గజ్ యాత్ర'' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. వేటగాళ్ల బారి నుంచి ఏనుగులను రక్షించడం, అడవిలో నిఘా వ్యవస్థలను మరింత మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఏటా ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 



గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఇందుకోసం రూ.85 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నామని కేంద్ర వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ వైద్య కళాశాలలో వారం రోజుల వ్యవధిలో 60కిపైగా చిన్నారులు చనిపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 


రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 35ఏ జమ్మూ కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ ‘35ఏ’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఆర్టికల్ లింగ వివక్షకు అనుకూలంగా ఉందా? రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తుందా? అన్న అంశాల్ని ఆ ధర్మాసనం పరిశీలించవచ్చని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 35ఏ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను.. అదే తరహా పెండింగ్ పిటిషన్‌లకు జతచేస్తూ వాటన్నింటిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు.


"భారత్ కే వీర్" పై లైవ్ ట్వీటర్ వాల్ భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా "భారత్ కే వీర్" (Bharat Ke Veer) పోర్టల్‌ను ప్రచారం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లైవ్ ట్వీటర్ వాల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం న్యూఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దేశ రక్షణలో అమరులైన సైనికులకు వందనాలు సమర్పిస్తూ hashtag Bharat Ke Veerతో చేసే ట్వీట్లు ఈ ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శితమవుతాయి. 
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీఏపీఎఫ్ అమరుల కుటుంబాలకు సహాయం చేసేందుకు 2017 ఏప్రిల్‌లో Bharat Ke Veer పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా విరాళాలు సమీకరిస్తారు. 


ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం కల్లోల కశ్మీర్‌ను మరొకసారి భూలోక స్వర్గంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దామంటూ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్య దూషణలతోనో, తూటాలతోనో పరిష్కారం కాదని.. అందుకు కశ్మీరీలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, వారితో మమేకం కావడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. సంప్రదాయ కుర్తా, పైజామా, రాజస్తానీ తలపాగాతో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ప్రధాని ఆగస్టు 15న ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రధానిగా నాలుగోసారి ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ.. గత మూడేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు, కీలక నిర్ణయాల్ని ప్రస్తావించారు. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలు సాహసోపేత నిర్ణయాలని అభివర్ణించారు. చైనాతో డోక్లాం వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సముద్రం, సరిహద్దులు ఎక్కడైనా సరే, ఎలాంటి భద్రతా సవాలునైనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందన్నారు. విశ్వాసాల పేరిట జరిగే హింస ఆమోదయోగ్యం కాదని, మతవాదం, కులతత్వం విషంతో సమానమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొన్న ప్రకృతి విపత్తులను, యూపీ ఆస్పత్రిలో ఇటీవలి చిన్నారుల మరణాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని.. వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. 

‘బ్లూవేల్’ లింక్‌లను తొలగించాలని కేంద్రం ఆదేశం ప్రమాదకర ‘బ్లూవేల్ చాలెంజ్’ గేమ్, ఆ తరహా ఆన్‌లైన్ ఆటలకు సంబంధించిన అన్ని లింక్‌లను తక్షణం తొలగించాలని కేంద్రం ఇంటర్నెట్ దిగ్గజ సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆగస్టు 11న గూగుల్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్‌లకు ఓ లేఖ రాసింది. 50 రోజులపాటు సాగే బ్లూవేల్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం. ఈ గేమ్‌లో లీనమై ఇటీవల మహారాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్‌లో ఒకరు పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 


75 ఏళ్ల ‘క్విట్ ఇండియా’పై తీర్మానంక్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 9న లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఉభయసభల్లో సంబంధిత తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

కేరళ, హరియాణాలో 100 శాతం పారిశుద్ధ్యంకేంద్రం నిర్వహించిన గ్రామీణ పారిశుద్ధ్య సర్వేలో కేరళ, హరియాణా ముందుండగా బిహార్ చివరి స్థానంలో నిలిచింది. సర్వే వివరాలను తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 8న విడుదల చేసింది. సర్వేలో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2016 మే-జూన్ మధ్యన దేశవ్యాప్తంగా 4,626 గ్రామాల్లోని 1.4 లక్షల గ్రామీణ గృహాలను పరిశీలించింది. కేరళ, హరియాణాల్లో దాదాపు అన్ని గ్రామీణ గృహాలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. బిహార్‌లో 30 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 37 శాతం ఇళ్లలోనూ, దేశంలో 62.45 శాతం ఇళ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది.

గోప్యత పరిరక్షణ ఓ విఫల యుద్ధం: సుప్రీంకోర్టువ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుండటం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి సాంకేతిక యుగంలో గోప్యత అనే భావనను పరిరక్షించడం కష్టసాధ్యమవుతోందని పేర్కొంది. గోప్యత పరిరక్షణ ఒక విఫల యుద్ధమని అభివర్ణించింది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చాలా? లేదా? అన్న అంశంపై మూడు వారాలు విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం ఆగస్టు 2న తన తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 27న లేదా అంతకు ముందు తీర్పును ప్రకటించొచ్చు. 
మన జీవితం ప్రతి అంగుళంలోకి చొచ్చుకొచ్చిన సాంకేతికత కారణంగా గోప్యత అనే భావన ప్రాభవం కోల్పోతోందని, గోప్యత మౌలిక లక్షణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ అభిప్రాయపడింది. భారత్‌లో ప్రైవసీ పదాన్ని నిర్వచించాల్సిన అవసరం ఉందని, సుమారు 130 కోట్ల మంది సమాచారం ప్రజాక్షేత్రంలో ఉందని పేర్కొంది. గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లయితే, దాని కిందికి ఏమేం వస్తాయో కూడా తామే చెప్పాల్సి ఉందని వెల్లడించింది. 


రత్లే, క్రిష్ణగంగ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు అనుమతి
జమ్మూ కశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న క్రిష్ణగంగ, రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను కొనసాగించుకోవచ్చని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే 1960నాటి సింధు జలాల ఒప్పందాన్ని అనుసరించి కొన్ని పరిమితులకు లోబడి ఆనకట్టల నిర్మాణాలు ఉండాలంది. పాకిస్తాన్, భారత్ నుంచి కార్యదర్శి స్థాయి అధికారులు తన వద్ద చర్చలు జరిపిన అనంతరం ఓ ప్రకటనను ప్రపంచ బ్యాంకు ఆగస్టు 1న విడుదల చేసింది. 
సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ నుంచి పాక్‌కు ప్రవహిస్తున్న పశ్చిమ నదులపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారత్... ఈ వ్యవహారంతో సంబంధంలేని ఇతర వ్యక్తి/సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. సింధునది ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై భారత్ 330 మెగావాట్ల సామర్థ్యంగల క్రిష్ణగంగ, 850 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రత్లే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణాలను ఇప్పటికే ప్రారంభించగా, వీటిపై పాకిస్తాన్ అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. ఈ ప్రాజెక్టుల ఆకృతులు సాంకేతికంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తున్నాయని పాక్ వాదిస్తోంది. వివాదాన్ని పరిష్కరించాలంటూ పాక్ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. తాజాగా పాక్, భారత్ కార్యదర్శి స్థాయి అధికారులు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో ఈ వారంలో భేటీ అయ్యారు. తదుపరి దఫా చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి. 


అన్ని రంగాల్లోనూ అవినీతి జాఢ్యం: సుప్రీందేశవ్యాప్తంగా అన్ని కీలక రంగాల్లోనూ అవినీతి వేళ్లూనుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశాభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇది తీవ్ర అవరోధంగా మారిందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. విధులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కోసమే తాము పనిచేస్తున్నామన్న సృ్పహ అధికారుల్లో ఉన్నప్పుడే అవినీతిని అరికట్టగలమని కోర్టు అభిప్రాయపడింది. 
20 ఏళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా భూమిని కేటాయించిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎస్ నీరా యాదవ్, ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్‌లకు విధించిన శిక్షను సమర్థించిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రజలు లంచగొండితనం, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించనంతవరకు ఈ జాఢ్యం నుంచి సమాజం విముక్తి పొందలేదని అభిప్రాయపడింది. అంతేకాకుండా బంధుప్రీతితో అనర్హులకు లబ్ధి చేకూర్చడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 


రహదారులపై 50 కి.మీ.కు ఓ వసతి కేంద్రం
జాతీయ రహదారులపై ప్రతి 50 కి.మీ.కు ఒక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కారీ ఆగస్టు 3న చెప్పారు. ఆ వసతి కేంద్రాల్లో ఆహార శాలలు, విశ్రాంతి గదులు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు తదితర సౌకర్యాలు ఉండనున్నాయి. జాతీయ రహదారుల గుండా వెళ్లే ప్రయాణికులు, డ్రైవర్లు సేద తీరేందుకు వసతి కేంద్రాలు ఉపయోగపడటంతోపాటు, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కూడా ఉపకరిస్తాయని గడ్కారీ వివరించారు.


విశాఖ పెట్రో వర్సిటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు- 2017ను లోక్‌సభ ఆగస్టు 4న ఆమోదించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఇప్పటికే విశాఖలోని తాత్కాలిక క్యాంపస్‌లో ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్‌కార్పొరేట్ చేసేందుకు గానూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రూ.600 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది.


హెలీ ట్యాక్సీ సేవలని ప్రారంభించిన బీఐఏఎల్ 
దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆగస్టు 4న ఈ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్‌పోర్టుకు చేరాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. దీంతో తుంబీ ఏవియేషన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బీఐఏఎల్ హెలీట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఒక హెలికాప్టర్‌లో ఐదుగురు, మరో హెలికాప్టర్‌లో 13 మంది ప్రయాణించవచ్చు.


మరణ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి 2017 అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు మినహా దేశమంతటా ఇది వర్తించనుంది. ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై రకరకాల డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయమై తమ అభిప్రాయాలను అక్టోబర్ 1 కల్లా తెలియజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. 


‘అయోధ్య’ పిటిషన్ల విచారణకు బెంచ్అయోధ్య-బాబ్రీ మసీదు వివాదంలో 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ను సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ ఆగస్టు 11 నుంచి పిటిషన్ల విచారణ ప్రారంభిస్తుంది. 
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖరా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని గతంలో అలహాబాద్ హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పునిచ్చింది. 
 

‘సంకల్ప్ పర్వం’గా ఆగస్టు 15స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న దేశప్రజలు ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషిచేస్తామని పౌరులు ఆ రోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ ఏడాది ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తాజా ఉత్తర్వులో పేర్కొంది. 


మసీదు నిర్మాణంపై షియా వక్భ్‌బోర్డు అఫిడవిట్ అయోధ్యలో రామ మందిరం-బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు ఆగస్టు 8న సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది. కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది. 
రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నియమించారు. 

పశువులకు ఆరోగ్య కార్డులు పశువుల సంఖ్య, ఆరోగ్య వివరాల సేకరణ కోసం కేంద్రం చేపట్టిన ‘యానిమల్ హెల్త్ కార్డ్’ కార్యక్రమాన్ని ఆగస్టు 8న తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాల మేరకు తమిళనాడులో వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు తదితర 105 కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా కోవై, సేలం, వేలూరు, విల్లుపురం, మదురై సహా ఏడు జిల్లాల్లో వీటిని అందజేస్తారు. 
మూడు రంగుల్లో కార్డులు పశువుల ఆరోగ్యాన్ని పరిశీలించడం, వాటి సంఖ్య, సంతానోత్పత్తి, వ్యాధులు తదితర వివరాలను సేకరించి ప్రతి పశువుకు 12 అంకెలు గల సిరీస్‌తో కార్డులో నమోదు చేస్తారు. సంకరజాతి, నాటు పశువు, బర్రె అని మూడు రకాలతో వేర్వేరు రంగుల్లో ఈ కార్డులను అందిస్తారు. పశువుల యజమానుల వద్ద పశువు ఫోటో, గుర్తులు, వయసు, గుర్తింపు నంబర్, పశువులకు వేసిన ఇంజెక్షన్ల వివరాలన్నీ ఉంటాయి. ఈ వివరాలన్నీ పశు సంరక్షణ విభాగ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. పశువులకు ప్రత్యేక కార్డులు ఇవ్వడం ద్వారా చోరీ సంఘటనలు, మాంసం కోసం అక్రమంగా తరలించడం వంటివి అడ్డుకోవచ్చునని పశు సంరక్షణ విభాగ అధికారులు తెలిపారు.


ఆక్రమణలో 33 లక్షల ఎకరాల అటవీ భూమిదేశంలో 33.21 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ ఆగస్టు 1న లోక్‌సభకు తెలిపారు. గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. తెలంగాణలో 7,551 ఎకరాలు, ఏపీలో 4,177 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు వెల్లడించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 13 లక్షల ఎకరాలు, అసోంలో 7 లక్షల ఎకరాలు ఆక్రమణకు గురైందన్నారు.

భారత్‌లో వ్యవసాయం ప్రమాదకరంభారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయం చేయడం ప్రమాదకరంగా పరిణమించిందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒక నివేదికలో పేర్కొంది. పంట ఎదిగే కాలంలో 20 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరిగే ప్రతి డిగ్రీకి 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగస్టు 1న ప్రచురితమైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌కు చెందిన జర్నల్‌లో వెల్లడించింది. 2050 నాటికి దేశంలో భూతాపోన్నతి మరో మూడు డిగ్రీలు పెరుగుతుందని, అప్పుడు రైతుల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. వారిలో 58 శాతం మంది రైతులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, పంటలు దెబ్బతిని ఏటా లక్షా 30 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.







జులై 2017 జాతీయం

బిహార్‌లో జేడీయూ-బీజేపీ ప్రభుత్వం లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. సీఎం నితీశ్ కుమార్(జేడీయూ) ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన జూలై 26న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోదీ.. నితీశ్‌కు మద్దతు తెలుపుతూ గవర్నర్‌కు లేఖనందించారు. దీంతో జూలై 27న బిహార్ సీఎంగా జేడీయూ నేత నితీశ్ ప్రమాణం చేశారు. 
2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. 243 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 178 స్థానాలు గెలిచాయి. జేడీయూ నేత నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లాలూ ఇద్దరు కుమారుల్లో ఒకరు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టగా మరొకరికి మంత్రి పదవి దక్కింది. అనంతరం.. లాలూ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో సీబీఐ, ఈడీ దాడుల నేపథ్యంలో.. ప్రజలకు వివరణ ఇవ్వాలని లాలూ కుమారులను నితీశ్ కొంతకాలం క్రితమే కోరారు. దీన్ని లాలూ కుటుంబం బాహాటంగానే ఖండించింది. జూలై 26న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ తన కుమారులు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పారు. దీంతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నడపటం కష్టమని భావించిన నితీశ్ కుమార్.. కూటమితో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. 
అసెంబ్లీలో బలాబలాలు
పార్టీ
సీట్లు
ఆర్‌జేడీ
80
జేడీ(యూ)
71
కాంగ్రెస్
27
బీజేపీ
53
ఇతరులు
12


కనీస వేతన బిల్లుకు కేబినెట్ ఆమోదంఅన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 27న ఆమోద ముద్ర వేసింది. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. 
కనీస వేతనాల చట్టం-1948, వేతనాల చెల్లింపు చట్టం-1936, బోనస్ చెల్లింపు చట్టం-1965, సమాన వేతనాల చట్టం-1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకుమించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.


గోప్యత హక్కుకి కొన్ని పరిమితులు ఉండాలి : కేంద్రంరాజ్యాంగం ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాలని కేంద్రం జూలై 26న సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గోప్యతకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాథమిక హక్కుగా పరిగణించకూడదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ తదితర 9 మంది సభ్యుల ధర్మాసనానికి నివేదించారు. ప్రైవసీకి సంబంధించిన చాలా అంశాలను ప్రాథమిక హక్కుల పరిధిలోకి తీసుకురాకూడదని పేర్కొన్నారు. 
పశ్చిమ బెంగాల్, పంజాబ్, పుదుచ్చేరి, పంజాబ్‌ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు.


బస్సులకు డిజైన్ కోడ్ప్రయాణికులు, డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐఎస్-052 కోడ్ పేరిట బస్ బాడీ కోడ్‌ను అమల్లోకి తేనుంది. 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో ఇక దేశవ్యాప్తంగా బస్సులన్నీ కేటగిరీల వారీగా ఒకే తరహాలో ఉండనున్నాయి. ప్రమాదాలను నివారించేలా, ఒకవేళ ప్రమాదాలు జరిగితే సులువుగా బయటపడేలా బస్‌బాడీ నిర్మాణం, ప్రయాణికులకు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు, డ్రైవర్ క్యాబిన్ విషయంలో ప్రత్యేక నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ విషయమై ఇప్పటికే బస్‌బాడీ నిర్మాణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిపై అవగాహన కల్పించేందుకు పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు ప్రతినిధులు దేశవ్యాప్తంగా ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు. 

ఐఐఎం బిల్లు - 2017కు లోక్‌సభ ఆమోదం దేశంలోని 20 అత్యుత్తమ ఐఐఎం(ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్)లకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఐఐఎం బిల్లు - 2017ను లోక్‌సభ జూలై 29న ఆమోదించింది. విద్యా, పరిశోధన రంగాల్లో ఐఐఎంలు ప్రపంచ ప్రమాణాలను అందుకునేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ విద్యా సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని చెప్పారు. 


భూకంపాల జోన్‌లో 29 నగరాలు దేశంలో 29 నగరాలు భూకంపాల జోన్‌లో ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) నివేదిక వెల్లడించింది. వాటిలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తొమ్మిది రాష్ట్రాల రాజధానులున్నాయి. ఇవి ఎక్కువగా హిమాలయాల పరిధిలో ఉన్నాయి. దీనికి ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలు సంభవించే ప్రాంతంగా గుర్తింపు ఉంది. 
ఢిల్లీ, పట్నా, శ్రీనగర్, కొహిమా, పుదుచ్చేరి, గువాహటి, గ్యాంగ్‌టక్, సిమ్లా, డెహ్రాడూన్, ఇంఫాల్, చండీగఢ్‌లు భూకంపం సంభవించే ప్రాంతాలలో మొదటి, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో భూకంపం సంభవించే ప్రాంతాలను ఐదు జోన్లుగా వర్గీకరించింది. ఐదో జోన్ అత్యంత తీవ్రత కలిగిన ప్రాంతం. ఈ జోన్‌లో ఈశాన్య ప్రాంతమైన జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని కచ్, ఉత్తర బిహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులున్నాయి. 


2022 నాటికి నవభారత నిర్మాణం : ప్రధాని మోదీ 2022 నాటికి(దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా) దేశంలోని కుల, మతతత్వాలతోపాటుగా పేదరికం, అవినీతి, ఉగ్రవాదం, చెత్తలను పారద్రోలేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జూలై 30న మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని.. జీఎస్టీని చారిత్రక ఘట్టంగా పేర్కొన్నారు. 
దేశానికి ప్రధాన సమస్యలుగా మారిన మతతత్వం, కుల వ్యవస్థ, అవినీతి, ఉగ్రవాదం, పేదరికాన్ని 2022 నాటికి దేశం నుంచి నిర్మూలించేలా ప్రతి భారతీయుడు కృషిచేయాలని.. ఈ దిశగా ప్రతిజ్ఞ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దీని ద్వారానే దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యేలోపు నవభారత నిర్మాణం జరుగుతుందన్నారు. 1942, ఆగస్టు 9న మహాత్ముడు ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం కారణంగానే.. 1947లో బ్రిటిషర్లు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లారని గుర్తుచేసిన మోదీ.. 2017లో నవభారత నిర్మాణానికి ప్రతి భారతీయుడు ప్రతినబూనటం ద్వారా 2022 కల్లా ఫలితాలు సాధించగలమన్నారు. 

జాతీయ బీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన 123వ రాజ్యాంగ సవరణ బిల్లు-2017 జూలై 31న రాజ్యసభ ఆమోదం పొందింది. విపక్షాలు సూచించిన విధంగా బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించి అమోదించారు. ఈ బిల్లును లోక్‌సభ ఏప్రిల్‌లో ఆమోదించి రాజ్యసభకు పంపింది.


టపాసులలో 5 లోహాల వినియోగంపై నిషేధం వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న 5 హానికర లోహాలను టపాసులలో వినియోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధ ర్మాసనం ఈ మేరకు జూలై 31న ఆదేశాలు జారీ చేసింది. టపాసుల తయారీలో లిథియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, ఆంటిమోని, లెడ్ లోహాలను వాడరాదని పేర్కొంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్‌ఓ) ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 


ఈశాన్య రాష్ట్రాలకు 2,350 కోట్ల వరద సహాయం ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో సమీక్షించిన మోదీ.. అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు.


ఐసిస్, చైనాలతోనే భారత్‌కు ముప్పుఐసిస్, వాతావరణ మార్పులు, చైనా దుందుడుకుతనం.. ఈ మూడు భారత్‌కు పొంచి ఉన్న ప్రధాన ముప్పులని అత్యధిక శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థ ‘ప్యూ’ చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ఐసిస్ వల్ల భారత్‌కు ముప్పు ఉందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. వాతావరణంలో మార్పుల వల్ల ఇబ్బందులు తప్పవని 47 శాతం మంది చెప్పారు. 44 శాతం మంది భారత్‌కు ఉన్న అతిపెద్ద ముప్పు చైనాయేనని పేర్కొన్నారు. మరో 43 శాతం మంది సైబర్ దాడులే అత్యంత ప్రమాదకరంగా మారాయన్నారు. అమెరికాతోపాటు ఐరోపా, ఆసియా ఖండాల్లోని 18 దేశాల్లో సర్వే చేసిన ప్యూ.. ఆ నివేదికలను ఆగస్టు 1న విడుదల చేసింది. చైనా, రష్యా, అమెరికాల్లో ఏది అత్యంత ప్రమాదకర దేశమని అడగ్గా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు చైనాయేనని చెప్పారు. 


దేశంలో రెండు టైమ్‌జోన్ల అమలు పరిశీలనదేశంలో రెండు వేర్వేరు టైమ్‌జోన్ల అమలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం జులై 19న లోక్‌సభలో తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉంది. కాబట్టి రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనితీరు మెరుగుపడుతుందని బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ లేవనెత్తిన అంశంపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుంది.


‘ఆహార భద్రత’కు సుప్రీం కోర్టు ఆదేశాలుజాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 31లోగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కార్యదర్శి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత కార్యదర్శులతో కనీసం ఒకసారైనా సమావేశమై చట్టం అమలవుతున్న తీరును సమీక్షించాలని పేర్కొంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒప్పించాలని సూచించింది. ఆహార కమిషన్‌లను ఏడాదిలోగా ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరింది. 


భారత్‌కు ‘మిగ్-35’ యుద్ధ విమానాలుభారత్‌కు మిగ్-35 యుద్ధ విమానాలు అమ్మేందుకు ఆసక్తిగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ అంశంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని, భారత్ కూడా ఆసక్తిగా ఉందని మిగ్ కార్పొరేషన్ చీఫ్ ఇల్యా టారసెంకో తెలిపారు. రష్యా రూపొందించిన అత్యాధునిక 4++ జనరేషన్ యుద్ధ విమానాలే మిగ్ 35. దాదాపు 50 ఏళ్లుగా భారత్ రష్యాకు చెందిన మిగ్ విమానాల్ని వినియోగిస్తోంది. 
మిగ్ -35 ప్రత్యేకతలు
  • ఒకరు లేదా ఇద్దరు పైలట్లు నడపొచ్చు. టేకాఫ్ సమయంలో గరిష్ట బరువు 29,700 కిలోలు
  • ఎత్తులో ఉన్నప్పుడు గరిష్ట వేగం గంటకు 2,400 కి.మీ. సముద్రమట్టంలో వేగం 1450 కి.మీ.
  • 1000 కి.మీ. పరిధిలో యుద్ధ విన్యాసాలు చేయగలదు.
  • గన్స్: జీఎస్‌హెచ్-301 ఆటోకేనన్ (150 రౌండ్స్)
  • రాకెట్‌లు : ఐదు
  • క్షిపణులు: గగనతలం నుంచి గగనతలం(రెండు), గగనతలం నుంచి భూఉపరితలంపైకి(ఒకటి), యాంటీ రేడియేషన్ మిస్సైల్, యాంటీ షిఫ్ మిస్సైల్
  • బాంబులు: కేఎబీ-500కేఆర్, కేఏబీ-500ఎల్, కేఏబీ-500ఎస్


ప్రతి పదినిమిషాలకో సైబర్ నేరం: సెర్ట్ ఇన్భారత్‌లో సగటున ప్రతి పది నిమిషాలకు ఒక సైబర్ నేరం నమోదైనట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌‌స టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) తెలిపింది. 2016లో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం జరిగేదని ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిందని సెర్ట్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2017 జనవరి నుంచి జూన్ మధ్య ఫిషింగ్, నెట్‌వర్క్ స్కానింగ్, సైట్లలోకి చొరబాటు, వైరస్, ర్యాన్సమ్‌వేర్ వంటి తదితర మొత్తం 27,482 సైబర్ కేసులు నమోదయ్యాయి.


మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సుకేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం షీ బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు) పేరుతో ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ఉండే ఈ బాక్స్ ద్వారా పనిచేసే ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయవచ్చు. మొదట దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపచేస్తారు.


వందేమాతరం తప్పనిసరి : మద్రాస్ హైకోర్టు తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలలో తప్పనిసరిగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో సోమ, శుక్రవారం అలాగే కార్యాలయాల్లో నెలకు ఒకసారి తప్పనిసరిగా పాడాలని న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్ తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులతో వారానికి రెండుసార్లు జాతీయ గేయాన్ని ఆలపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా నెలకు ఒకసారైనా వినిపించాలని అన్నారు. బెంగాలీ, సంస్కృతంలో పాడటం కష్టంగా ఉంటే దాన్ని తమిళంలోకి తర్జుమా చేయాలన్నారు.


పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా గుజరాత్పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాల జాబితాను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకన మిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) జూలై 18న ప్రకటించింది. మొత్తం 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం(ఢిల్లీ)తో రూపొందిం చిన ఈ జాబితాలో గుజరాత్‌కు మొదటి స్థానం దక్కింది. ఢిల్లీ రెండో స్థానంలో నిల వగా; ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మూడు, ఐదు స్థానాలు లభించాయి. వీటితో పాటు హరియాణా(4), తమిళనాడు(6), కేరళ(7), కర్ణాటక(9), మధ్యప్రదేశ్(10).. టాప్ 10లో నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లో లభించే కార్మిక శక్తి, మౌలిక వసతులు, ఆర్థిక వాతావరణం, పాలన-రాజకీయ స్థిరత్వం, అవగాహన, భూములు వంటి ఆరు ముఖ్యాంశాలు, 51 ఉప అంశాలను బేరీజు వేసి ర్యాంకులను నిర్ణయించారు. 2016 జాబితాతో పోలిస్తే గుజరాత్, ఢిల్లీలు తిరిగి తమ స్థానాలను నిలబెట్టుకోగా.. హరియాణా, తెలంగాణ వేగంగా టాప్-5లోకి అడుగుపెట్టాయి. ఆర్థిక వాతావరణానికి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో నిలవగా..మౌలిక సదుపాయాల కల్పనలో ఢిల్లీ తొలి ర్యాంకు సాధించింది. కార్మిక సమస్యలను తీర్చడంలో తమిళనాడు, భూముల విషయంలో మధ్యప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి.

నదుల అనుసంధానానికి 30 లింకుల గుర్తింపుదేశంలో నదుల అనుసంధానానికి 30 లింకుల్ని గుర్తించినట్లు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఎనిమిది లింకులు ఆంధ్రా, తెలంగాణ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానం కోసం గుర్తించిన 30 లింకుల్లో 16 నైరుతి రాష్ట్రాల్లో, 14 హిమాలయ ప్రాంతాల్లో ఉన్నట్లు వెల్లడించారు. వీటిపై సర్వే, పరిశోధన అనంతరం నైరుతి రాష్ట్రాల్లోని 14 లింకుల్ని, హిమాలయ ప్రాంతంలోని 2 లింకుల్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు. వీటికి డీపీఆర్‌లు రూపొందించేటప్పుడు పర్యావరణ, సామాజిక ఆర్థిక ప్రభావాలపై అధ్యయనం చేస్తామన్నారు.
ఆంధ్ర, తెలంగాణల్లో గుర్తించినవిమహానది(మణిభద్ర)-గోదావరి(ధవళేశ్వరం)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(పులిచింతల)
గోదావరి(ఇచ్ఛంపల్లి)-కృష్ణా(నాగార్జునసాగర్)
గోదావరి(పోలవరం)-కృష్ణా(విజయవాడ)
కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా
కృష్ణా (శ్రీశైలం)-పెన్నా
కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా(సోమశిల)
పెన్నా(సోమశిల)- కావేరి (గ్రాండ్ ఆనికట్)

పారామిలటరీ వైద్యుల ‘రిటైర్మెంట్’ పెంపుకేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ జూలై 12న నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ మొదలైన కేంద్ర బలగాలతోపాటుగా అస్సామ్ రైఫిల్స్‌లో పనిచేస్తున్న జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసును మరో ఐదేళ్లు పెంచాలంటూ చాలాకాలంగా ప్రతిపాదన ఉంది. ఈ మేరకు వీరితోపాటుగా స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసునూ 60 నుంచి 65కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరితోపాటుగా కల్యాణి (పశ్చిమబెంగాల్), నాగ్‌పూర్ (మహారాష్ట్ర) ఎయిమ్స్ ఆసుపత్రులకు ఒక్కో డెరైక్టర్ పోస్టును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపింది. 


మహారాష్ట్రలో ఉచిత గర్భనిరోధక ఇంజెక్షన్లు దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత గర్భ నిరోధక ఇంజెక్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. "అంతర" పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా.. గర్భ నివారణకు మాత్రలు వాడే మహిళలకు ఉచితంగా గర్భ నిరోధక ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భ నిరోధకానికి ఇది సురక్షితమైన పద్ధతని పేర్కొన్న ప్రభుత్వం... ఈ ఇంజెక్షన్ 3 నెలల పాటు పనిచేస్తుందని పేర్కొంది. 


‘సుస్థిర అభివృద్ధి’లో 116వ స్థానంలో భారత్
 
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల తాజా జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. మొత్తం 157 దేశాల్లో 17 అంతర్జాతీయ లక్ష్యాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 58.1 పాయింట్లు పొందిన భారత్.. నేపాల్, ఇరాన్, శ్రీలంక, భూటాన్, చైనా కన్నా వెనుకంజలో ఉంది. పాకిస్తాన్ 122వ స్థానంలో నిలిచింది. 
నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్న దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలేమీ కావని నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానంలో ఉండగా డెన్మార్క్, ఫిన్‌లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 


గంగా నది ప్రక్షాళనకు నూతన మార్గదర్శకాలు 
కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఈ మేరకు నదిని పరిరక్షించేందుకు జూలై 13న మార్గదర్శకాలు జారీ చేసింది. 
మార్గదర్శకాలు..
  • ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్‌మెంట్ జోన్)గా హరిద్వార్- ఉన్నావోల మధ్య గంగా నది తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో తీరం నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దు.
  • నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్ చేయరాదు.
  • నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా.
  • నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంజీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలి.


గుజరాత్‌లో హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం దేశంలో తొలి హైస్పీడ్ రైలు శిక్షణ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు కానుంది. 2023 నాటికి దేశంలో తొలి హై స్పీడ్ రైలుని ప్రవేశపెట్టాలన్న ప్రణాళికలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 2020 నాటికి ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. హైస్పీడ్ రైలు వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. 


సహకార ఎన్నికల్లో పోటీకి కనీస అర్హత నిర్ణయించిన రాజస్తాన్ దేశంలోనే తొలిసారిగా రాజస్తాన్ ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, చేనేత, డైరీ తదితర సొసైటీలకు జరిగే పాలకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 5 నుంచి 8వ తరగతి విద్యార్హతలు నిర్దేశిస్తూ జూలై 13న కొత్త నిబంధనలు జారీ చేసింది.


రైల్వేల్లో బహుళ సేవలకు ‘సార్థి’ యాప్బహుళ రైల్వే సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా రైల్వేశాఖ ‘రైల్ సార్థి’ అనే సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. టికెట్ బుకింగ్, భోజనం ఆర్డర్ ఇవ్వడం, మహిళల రక్షణ తదితర అంశాలున్న ఈ యాప్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు జూలై 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ యాప్ వల్ల ప్రయాణికులకు వేర్వేరు వెబ్‌సైట్లను వెతికే ఇబ్బంది తప్పుతుందన్నారు. రైల్వే సేవలన్నీ ఒకేచోట లభించడమే ఇందుకు కారణమన్నారు. సార్థి యాప్ ద్వారా విమానం టికెట్లను సైతం బుక్ చేసుకోవచ్చని ప్రభు తెలిపారు. 


కరువు నిర్ధారణకు కొత్త మార్గదర్శకాలు
కరువు నిర్ధారణ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తీవ్ర కరువు, మధ్యస్థ కరువు, సాధారణ కరువు కేటగిరీలున్నాయి. వాటిల్లో మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేస్తూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు రెండు కేటగిరీలే ఉంటాయి. ఇక సాధారణ కరువు అంటే కరువు లేనట్లేనని ప్రకటించే అవకాశముంది. మధ్యస్థ కరువు ప్రాంతాలన్నీ కూడా సాధారణ కరువు కేటగిరీలోకి రానున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అంటే తీవ్ర కరువుగా గుర్తిస్తే తప్ప ఆయా రాష్ట్రాల రైతులకు జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఆర్థిక సాయం వచ్చే పరిస్థితి ఉండదని అంటున్నారు. 
6 అంశాల ఆధారంగా కరువు నిర్ణయం
కేంద్ర నిబంధనల ప్రకారం ఆరు అంశాలను కరువు నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు. అందులో 
1) వర్షాభావ పరిస్థితులు 
2) వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రెస్పైల్) 
3) తేమ సమగ్ర సూచిక (ఎంఏఐ) 
4) నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వెజిటేషన్ ఇండెక్స్ (ఎన్‌డీవీఐ), నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వాటర్ ఇండెక్స్ (ఎన్‌డీడబ్ల్యూఐ) 
5) సాగు విస్తీర్ణం 
6) దిగుబడుల లెక్క
  • వీటిలో ఐదు అంశాలు అనుకూలంగా ఉంటే కరువుగా ప్రకటిస్తారు. ఒక్కోసారి సడలింపులు ఇస్తారు. అప్పుడు నాలుగింటిని గీటురాయిగా తీసుకుంటారు.
  • వర్షపాతం విషయానికి వస్తే 50 శాతానికి తక్కువగా ఉండాలి. వర్షానికి వర్షానికి మధ్య 21 రోజులకు మించి అంతరం ఉండాలి.
  • సాగు విస్తీర్ణాన్నీ లెక్కిస్తారు. పంటల దిగుబడి 50 శాతానికి పడిపోవాలి. పశుగ్రాసానికి కొరత ఏర్పడాలి. అందులో ఇప్పటివరకు మధ్యస్థ, తీవ్ర కరువు ఉన్నప్పుడు కరువు మండలాలు ప్రకటించారు. ఆ ప్రకారం కేంద్రం సాయం ప్రకటించేది. ఇకనుంచి కరువు సాధారణంగా ఉంటే ఆయా మండలాలను లెక్కలోకి తీసుకోరని అధికారులు అంటున్నారు. మధ్యస్థ కరువు అనే కేటగిరీని ఎత్తివేయడం వల్ల కరువు మండ లాలు తగ్గే అవకాశముందని అంటున్నారు. మొత్తంగా తీవ్ర కరువు పరిస్థితులను ఈ ఆరు అంశాల తీవ్రతను బట్టి నిర్ణయిస్తారని తెలుస్తోంది.


ప్రజాదరణలో మోదీ సర్కారు టాప్ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ చూరగొన్న ప్రభుత్వాల జాబితాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అగ్రస్థానం దక్కించుకుంది. 2016 సంవత్సరానికి ‘ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ’(ఓఈసీడీ) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 73 శాతం భారతీయులు ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కేవలం 30% అమెరికన్లు మాత్రమే మద్దతు పలికారు. 
అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రభుత్వాలు
స్థానందేశంప్రజాదరణ శాతం
1భారత్73 %
2కెనడా62 %
3టర్కీ58 %
4రష్యా58 %
5జర్మనీ55 %
6దక్షిణాఫ్రికా48 %
7ఆస్ట్రేలియా45 %
8యూకే41 %
9జపాన్36 %
10అమెరికా30 %
 

ఫేస్‌బుక్ యూజర్లలో భారత్ టాప్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. మొత్తం 241 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లతో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో 240 మిలియన్ మందే యాక్టివ్ యూజర్లున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ యాక్టివ్ యూజర్లున్న దేశాల్లో అమెరికాను భారత్ అధిగమించిందని నెక్స్ట్‌వెబ్ సంస్థ జూలై 13న వెల్లడించింది. గత ఆరునెలల కాలంలోనే భారత్‌లో యాక్టివ్ యూజర్లు 27 శాతం పెరిగారు. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తంగా 2 బిలియన్ యూజర్ల మార్కును దాటినట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది. 


సీఎస్‌ఐ సర్వేలో రాయ్‌పూర్ విమానాశ్రయం టాప్ 2017 జనవరి - జూన్ మధ్య కాలానికి గాను వెల్లడించిన ప్రయాణికుల సంతృప్తి సూచీ (సీఎస్‌ఐ)లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ స్వామి వివేకానంద విమానాశ్రయం తొలి స్థానంలో నిలిచింది. ఓ స్వతంత్ర ఏజెన్సీ.. రవాణా, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకొని 49 విమానాశ్రయాలతో ఈ జాబితాను రూపొందించింది. ఇందులో మొత్తం 5 మార్కులకు గాను రాయ్‌పూర్ విమానాశ్రయం 4.84 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఉదయ్‌పూర్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాశ్రయాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


సౌరవిద్యుత్‌తో నడిచే తొలి రైలు ప్రారంభం 
సౌరవిద్యుత్(1600 హెచ్‌పీ) వ్యవస్థతో కూడిన తొలి డీఈఎమ్‌యూ(డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలుని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు జూలై 14న సఫ్దర్‌జంగ్(న్యూఢిల్లీ) రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సరై రోహిల్లా - హర్యానాలోని ఫరూక్‌నగర్ మధ్య నడుస్తుంది. రైలులోని చివరి ఆరు భోగీల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక్కో భోగీలో 16 సోలార్ పలకలను అమర్చారు. భోగీల్లోని లైట్లు, ఫ్యాన్లకు వీటి ద్వారా విద్యుత్ సరఫరా అవుతుంది. 


కేరళలో ఆటజిం ఇనిస్టిట్యూట్ ఆటిజం వ్యాధి(మెదడు అభివృద్ధిలో లోపాలు)తో బాధపడే చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేరళలో Center for Autism and other Disabilities Rehabilitation Research and Education (CADRRE) ఏర్పాటు కానుంది. 2017 సెప్టంబర్‌లో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 
National Institute of Speech and Hearing (NISH) ఫౌండర్ డెరైక్టర్ జి.విజయరాఘవన్ ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు చేపడతారు. 


రాష్ట్రపతి ఎన్నికలో 99 శాతం పోలింగ్భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక జూలై 17న ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా 99 శాతం పోలింగ్ జరగగా.. అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరిల్లో వందశాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో 99 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక శాతం పోలింగ్. 
ఢిల్లీలో ఓటేయాల్సిన 717 మంది ఎంపీల్లో 714 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పోటీ చేయగా.. యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ చేశారు. 


మహిళా సిబ్బందితో నడిచే తొలి రైల్వే స్టేషన్ దేశంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే మొదటి రైల్వే స్టేషన్‌గా ముంబైలోని మతుంగా సబర్బన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. టికెట్ బుకింగ్ క్లర్క్, టీటీ, రైల్వే పోలీస్ తదితర హోదాల్లో ఈ స్టేషన్‌లో మొత్తం 30 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ స్టేషన్‌కు మేనేజర్‌గా ఉన్న మమతా కులకర్ణి.. సెంట్రల్ రైల్వేలో ఈ హోదా పొందిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. 


గోప్యత హక్కుపై 9 మంది సభ్యుల ధర్మాసనంభారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత వివరాల గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జూలై 18న నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోప్యత హక్కుకు సంబంధించి 1950 నాటి ఎం.పీ.శర్మ కేసు, 1960 నాటి ఖరక్ సింగ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల్లో కూడా తప్పులున్నాయేమో సరిచూస్తామంది. గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ కేసుల్లో సుప్రీంకోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. 
9 మంది సభ్యుల ధర్మాసనం జూలై 19 నుంచే విచారణ ప్రారంభించి.. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల కిందకు గోప్యత వస్తుందా లేదా అనే విషయాన్ని తేలుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఆధార్ పథకం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ వచ్చిన కొన్ని పిటిషన్లను విచారిస్తూ కోర్టుపై ఆదేశాలిచ్చింది. 


కర్ణాటకకు ప్రత్యేక జెండాకు కమిటీ ఏర్పాటు రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం.. జెండా రూపకల్పనకు 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా.. ప్రత్యేక జెండా ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని సీఎం సిద్ధరామయ్య తన చర్యను సమర్థించుకున్నారు. 
దేశానికంతటికీ త్రివర్ణ పతాకం ఒక్కటే ఉంటుందని.. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక జెండా ఏర్పాటు చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదని కేంద్రం కర్ణాటకకు స్పష్టం చేసింది. గతంలో డీవీ సదానంద గౌడ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రత్యేక జెండా ప్రతిపాదనలను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రానికి ప్రత్యేక జెండా అనేది జాతీయ సమగ్రతను, ఐక్యత స్ఫూర్తి దెబ్బతీసేవిధంగా ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
కర్ణాటకకు ప్రత్యేక జెండా వచ్చినట్లయితే జమ్మూ కశ్మీర్ తర్వాత ప్రత్యేక జెండా కలిగిన రెండో రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది. 


భారత్ - ఇజ్రాయెల్ మధ్య 7 ఒప్పందాలు ఉగ్రవాదంతో పాటుగా వీరికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించటంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రవాద పరిస్థితులు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న వారిపై సంయుక్తంగా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా జూలై 5న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదం, దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైఇరువురు చర్చించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావటంలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు జెరూసలేంలో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
ఏడు ఒప్పందాలపై సంతకాలు
  • ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు ఉగ్రవాదంపై పోరాటంలోనూ పరస్పర సహకారం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
  • అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయం రంగాలతోపాటు నీటి పరిరక్షణ అంశంలో ఇరుదేశాల మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి.
  • భారత్-ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), సాంకేతిక సృజనాత్మకత కోసం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.259 కోట్లు) నిధిని ఏర్పాటు చేసేందుకు ఇరువురు ప్రధానులు అంగీకరించారు.
  • నీటి సంరక్షణతో పాటుగా భారత్‌లో నీటి వినియోగ సంస్కరణలు తీసుకురావటంపై పరస్పర అంగీకారం.
  • అణు గడియారాలు, చిన్న శాటిలైట్ల కోసం ఎలక్ట్రిక్ చోదక ఇంజన్‌లు, జియో-లియో (GEO&LEO) ఆప్టికల్ లింక్‌పైనా సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.


రాజస్తాన్‌లో ఆవుల పోషణకు రోజుకి రూ. 70ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్తాన్ ఆవుల పోషణకు (ఒక్కో ఆవుకి) రోజుకు రూ.70 అందించనుంది. దూడ కూడా ఉంటే మరో రూ.35 అదనంగా ఇవ్వనుంది. సంరక్షణ లేక వేలాది ఆవులు చనిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి వివిధ రకాల లావాదేవీలపై 10 శాతం చొప్పున ఆవు పన్ను విధించారు. ఈ మొత్తం సరిగ్గా వినియోగమవుతుందా లేదా అన్నది చూసేందుకు గోశాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. 
రాజస్తాన్‌లో సామాన్యులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఒక్కొక్కరికి రూ.26.65. ఇక్కడ నగరాల్లో నివసిస్తూ రోజుకు రూ.28 కంటే తక్కువ సంపాదిస్తున్న వారిని దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే గ్రామాల్లో రూ.25.16 కంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ఈ కేటగిరీలోకి చేర్చింది. 
 

జీఎస్టీని ఆమోదించిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీవస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుపై ప్రతిపాదించిన తీర్మానాన్ని జమ్మూకశ్మీర్ అసెంబ్లీ జూలై 5న ఆమోదించింది. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హసీబ్ డ్రాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేషనల్ కాన్ఫరెన్‌‌స(ఎన్‌సీ), కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ సభ్యుడు తీర్మానాన్ని వ్యతిరేకించారు. విపక్షాల అభ్యంతరాలపై మంత్రి సమాధానమిస్తూ 370 ఆర్టికల్ ద్వారా జమ్మూకశ్మీర్‌కు సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక పన్నుల విధానానికి ఎలాంటి ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. 
కశ్మీర్ అసెంబ్లీ తీర్మానంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు జీఎస్టీ అమలుకు ఆమోదం తెలిపినట్లు అయింది. 


కశ్మీర్‌లో అమల్లోకి వస్తు సేవల పన్ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) జూలై 6 అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోనూ అమల్లోకి వచ్చింది. జమ్మూకశ్మీర్ జీఎస్టీ బిల్లు-2017ను మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ట్ర ప్రత్యేక హోదాకు విఘాతం కలుగుతుందని విపక్షాలు ఆరోపించగా.. జీఎస్టీ అమలుపై నెలకొన్న ఆందోళనలను పరిష్కారిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు. 
 

సైబర్ భద్రతలో భారత్‌కు 23వ ర్యాంకుప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతలో మొత్తం 165 దేశాల్లో భారత్ 23వ స్థానంలో నిలిచినట్లు ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) తెలిపింది. ఈ మేరకు ప్రపంచ సైబర్ భద్రతా సూచీ(జీసీఐ) 2వ నివేదికను జూలై 6న విడుదల చేసింది. ఇందులో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. అమెరికా, మలేసియా, ఒమన్, ఇస్తోనియా, మారిషస్, ఆస్ట్రేలియాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
ఈ జాబితాలోని 77 దేశాలు సైబర్ భద్రత కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని ఐటీయూ తెలిపింది. గతేడాది పంపిన మొత్తం ఈ మెయిల్స్‌లో 1 శాతం సైబర్ దాడులకు ఉద్దేశించినవేనని ఐటీయూ తెలిపింది. 


ఆధార్‌కు ఎఫ్‌ఎస్‌బీ ప్రశంసలుభారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ పథకం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బ్యాంకింగ్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయడానికి, నగదు వ్యవహారాలను తగ్గించడానికి భారత్ ఆధార్‌ను వినియోగిస్తోందని ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్(ఎఫ్‌ఎస్‌బీ) అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ఆధార్ వినియోగం వల్ల రెమిటెన్‌‌స చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక విధానాలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కరస్పాండెంట్ బ్యాంకింగ్ కోఆర్డినేషన్ గ్రూప్(సీబీసీజీ)ను ఎఫ్‌ఎస్‌బీ ఏర్పాటుచేసింది. 


మైనారిటీలకు 100 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుమైనారిటీ యువత సంక్షేమం కోసం రానున్న ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో గరీబ్ నవాజ్ పేరిట వృత్తి విద్యా నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జూలై 6న ప్రభుత్వ రంగ సంస్థ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సమావేశంలో కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నోయిడా, లక్నో, ముంబై, నాగపూర్, భోపాల్, పట్నా, రాంచీ తదితర జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 


సూరత్‌లో పింక్ ఆటో సర్వీస్ మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే ఆటో సేవలను గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) ప్రారంభించింది. ‘పింక్ ఆటో సర్వీస్’ పేరుతో జూలై 2న ఆరంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలు గౌరవప్రదంగా జీవించేందుకు కార్పొరేషనే వారికి డ్రైవింగ్ నేర్పించి ఆటో కొనుక్కోవడానికి బ్యాంకు రుణాలను ఇప్పించింది. ఇందులో 25 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారు నెలకు రూ.18 వేల వరకు సంపాదించగలుగుతుందని ఎస్‌ఎంసీ భావిస్తోంది. 


ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్ ఈ గౌరవాన్ని అందుకుంది. యునెస్కో నిర్ణయంతో భారత్ చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 
 

డిజిటల్‌లోకి మూడు విద్యా కార్యక్రమాలువిద్యారంగానికి సంబంధించిన మూడు డిజిటల్ కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 9న ప్రారంభించారు. 
‘స్వయం’ ద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ సదుపాయంతో ఆన్‌లైన్‌లో క్లాసులు వినొచ్చు. 
‘స్వయం ప్రభ’ ద్వారా డీటీహెచ్ రూపంలో విద్యార్థులు వారి ఇంట్లోని టీవీల్లో వచ్చే 32 విద్యా చానళ్ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సేవలు ఉచితం కాగా డీటీహెచ్ ఏర్పాటుకు మాత్రం రూ.1,500 ఖర్చవుతుంది. 
అలాగే విద్యార్థులందరి ధ్రువపత్రాలను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరచడం కోసం ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ని కూడా ప్రణబ్ ప్రారంభించారు.
 

‘విద్య’లో ముస్లింల వెనుకబాటువిద్యాపరంగా మైనార్టీలలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ప్యానెల్ వెల్లడించింది. కేంద్ర పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు మూడంచల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ముస్లింలలో సాధికారత వస్తుందని సూచించింది. వారికోసం 211 పాఠశాలలు, 25 కమ్యూనిటీ కాలేజీలు, 5 జాతీయ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పాలని పేర్కొంది. పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలు లేదా నవోదయ విద్యాలయాల మాదిరిగా నడపాలని సూచించింది. 
మైనార్టీల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నిధుల ద్వారా నడిచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గతేడాది డిసెంబర్ 29న 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర మాజీ కార్యదర్శి అఫ్జల్ అమానుల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.


సింథటిక్, నైలాన్ మాంజాలపై నిషేధంగాలిపటాలకు ఉపయోగించే నైలాన్, సింథటిక్ మాంజాల వినియోగంపై దేశవ్యాప్తంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించే నైలాన్, సింథటిక్ మాంజాల తయారీ, క్రయ విక్రయాలపై కూడా ఎన్జీటీ నిషేధం విధించింది. 
దేశంలో అనేక పండుగలకు గాలిపటాలను ఎగర వేయడం మన సంస్కృతిలో భాగమైపోయింది. అయితే, వీటికి నైలాన్, సింథటిక్, చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనతో పాటు, పక్షులకు, జంతువులకు పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా కొన్ని ప్రాణాంతక ప్రమాదాలకూ కారణమవుతున్నాయని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వం లోని బెంచ్ వ్యాఖ్యానించింది. 


పశువుల విక్రయంపై ‘స్టే’ ఇక దేశవ్యాప్తంకబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తెచ్చిన నోటిఫికేషన్‌పై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు జూలై 11న దేశానికంతటికీ వర్తింపజేసింది. స్టేను ఎత్తివేయాలని తాము కోరడం లేదనీ, సలహాలు, ఫిర్యాదులను స్వీకరించి సవరించిన నోటిఫి కేషన్‌ను త్వరలోనే తెస్తామని కేంద్రం తరఫున్యాయవాది కోర్టుకు చెప్పారు. కేంద్రం నుంచి ఏ అభ్యంతరం లేకపోవడంతో ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్టేను దేశవ్యాప్తంగా అమలు చేసింది. అలాగే కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దానిపై ఏమైనా అభ్యంతరాలుంటే.. అది అమల్లోకి రాకముందైనా సరే ఎవరైనా సుప్రీం తలుపు తట్టవచ్చని ధర్మాసనం పేర్కొంది. జంతు వధశాలల కోసం పశువులను రైతులు అమ్మకుండా, వ్యాపారులు కొనకుండా నిషేధం విధిస్తూ కేంద్రం మే 23న నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.


వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసువివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం-1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతాఅప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించింది. 
వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది.

అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడిజమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్‌కు చెందిన యాత్రికుల బృందం అమర్‌నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

ఓటరు నమోదు కోసం ఫేస్‌బుక్‌తో ఈసీ జట్టు ఓటర్ల నమోదు కార్యక్రమం గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ఫేస్‌బుక్ భారత ఎన్నికల కమిషన్‌తో కలిసి పనిచేయనుంది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర 13 భారతీయ భాషల్లో జూలై 1 నుంచి 4 మధ్యలో భారత్‌లోని ఫేస్‌బుక్ యూజర్లకు రిమైండర్లు పంపనుంది. ఇందులోని రిజిస్టర్ నౌ బటన్‌ను .. నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం చేశారు.


స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డబ్బుస్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015తో పోల్చితే 2016లో ఈ డబ్బు సగం తగ్గి, రూ.4,500 కోట్లుగా(676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నమోదయి్యంది. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ)తాజా గణాంకాల ప్రకారం.. భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో ప్రత్యక్షంగా ఉన్న మొత్తం 664.8 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. ట్రస్టీల రూపంలో ఉన్న మొత్తం 11 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వరుసగా మూడేళ్ల నుంచీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గుతూ వస్తోంది.
1987 నుంచీ స్విస్ తన బ్యాంకుల్లో విదేశీయుల డబ్బు గణాంకాలను ప్రకటిస్తోంది. ఆ తర్వాత భారతీయుల డబ్బు ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2006లో ఇక్కడ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయి రూ.23,000 కోట్లుగా నమోదైంది. 2016లో ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో విదేశీ క్లెయింట్ల డబ్బు రూ.96 లక్షల కోట్లకు(1.42 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరింది. 2015లో ఈ మొత్తం 1.41 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్.

ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉప రాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 29న షెడ్యూల్ జారీ చేసింది. జూలై 4న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. జూలై 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఉపసంహరణ గడువు 21తో ముగుస్తుందని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఆగస్టు 5న పోలింగ్ నిర్వహిస్తామని, అదే రోజు కౌంటింగ్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
2016లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పోలింగ్‌లో ప్రత్యేక పెన్నులు ఉపయోగించనున్నారు. ఓటర్లు ఈ పెన్నుతో మాత్రమే తమ అభ్యర్థికి మార్కింగ్ చేయాలి. వేరే ఏ పెన్ను వాడినా ఓట్లు చెల్లదు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి విప్ జారీ చేయడానికి వీల్లేదనీ ఈసీ స్పష్టం చేసింది. 


సౌని యోజన కింద అజి డ్యాంకు నీటి తరలింపు సౌని యోజన (Saurashtra-Narmada Avataran Irrigation Yojana) కింద గుజరాత్‌లోని రాజ్‌కోట్ వద్ద ఉన్న అజీ జలాశయాన్ని నర్మదా నది నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 29న ప్రారంభించారు. ఈ పథకం కింద నర్మదా నదిలో అధిక ప్రవాహం ఉన్నప్పుడు సౌరాష్ట్ర పరిధిలోని 115 జలాశయాలకు నీటిని తరలిస్తారు. తద్వారా 10 లక్షల 22 వేల 589 ఎకరాలకు నీటిని అందిస్తారు.


నాథులా మార్గం ద్వారా మానస సరోవర యాత్ర రద్దుచైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సిక్కిం నాథులా మార్గం ద్వారా ఏటా సాగే కైలాస మానస సరోవర యాత్రను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 30న నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చైనా-భారత్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా దళాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అయితే ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ నుంచి వెళ్లే యాత్ర షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది. 
15,160 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవర యాత్ర రెండు మార్గాల ద్వారా ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులకు ఇది అత్యంత పవిత్రమైన యాత్రాస్థలం. 


పిల్లల చదువుకు సగటు ఖర్చు రూ. 12 లక్షలుభారత్‌లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం చేస్తున్న సగటు ఖర్చు రూ.12.22 లక్షలని హెచ్‌ఎస్‌బీసీ ‘ద వ్యాల్యూ ఎడ్యుకేషన్’ సిరీస్ ‘హయ్యర్ అండ్ హయ్యర్’ నివేదిక పేర్కొంది. ఇది.. ప్రాథమిక పాఠశాల నుంచి పన్నెండో తరగతి వరకు అవుతున్న వ్యయం. ప్రపంచ సగటు రూ.28.58 లక్షల (44,221 డాలర్లు)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇందులో ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, రవాణా, వసతి తదితర ఖర్చులన్నీ ఉన్నాయి. అలాగే 59% మంది భారత తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం వేతనాల నుంచి ఖర్చు చేస్తుండగా, మరికొంతమంది సేవింగ్‌‌స, పెట్టుబడులు, ఇన్సూరెన్‌‌స ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే... హాంకాంగ్ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం అత్యధికంగా సగటున రూ.85.42 లక్షలు ఖర్చు పెడుతున్నారు. తరువాతి స్థానాల్లో యూఏఈ (రూ.64.23 లక్షలు), సింగపూర్ (రూ.45.85 లక్షలు) ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉండగా... ఫ్రాన్‌‌స రూ.10.8 లక్షలతో అట్టడుగున ఉంది. 
పీజీకే అధిక ప్రాధాన్యం భారత్‌లోని ప్రతి పది మందిలో 9 మంది (94 శాతం) తల్లిదండ్రులు తమ పిల్లలతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయించాలని భావిస్తున్నారు. వీరిలో 79 శాతం మంది అందుకు తగిన నిధులు కూడా సమకూర్చుకుంటున్నారు. 


గుజరాత్‌లో టెక్స్‌టైల్ ఇండియా - 2017 సదస్సు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో టైక్స్‌టైల్ ఇండియా - 2017 ప్రదర్శన జరిగింది. జూన్ 30న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రదర్శన జూలై 2 వరకూ కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర జౌళి శాఖ - పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య 65 ఒప్పందాలు కుదిరాయి. 


ఇన్నోవేట్ ఇన్ ఇండియా ప్రారంభం బయో ఫార్మాసూటికల్స్ అభివృద్ధి కోసం కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇన్నోవేట్ ఇన్ ఇండియా - i3 కార్యక్రమాన్ని జూలై 1న ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఉన్న బయో ఫార్మాసూటికల్స్ పరిశ్రమలను విద్యా సంస్థలతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. తద్వారా దేశీయ ఫార్మా తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం.
ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం కోసం భారత్ 250 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్‌ఏసీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 


యువత కోసం ప్రధాని మోదీ పుస్తకం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కోసం ఓ పుస్తకం రాయాలని సంకల్పించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడం, ఏకాగ్రత కోల్పోకుండా ఉండటం, మార్కుల కంటే విజ్ఞానం ఎందుకు ముఖ్యం, భవిష్యత్తు బాధ్యతను ఎలా స్వీకరించాలనే కీలక అంశాలను ఇందులో ప్రస్తావించనున్నారు. తద్వారా పదవిలో ఉండగా పుస్తకం రాస్తున్న తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ (పీఆర్‌హెచ్) ఇండియా ప్రచురిస్తున్న ఈ పుస్తకం డిసెంబర్‌లో పలు భాషల్లో మార్కెట్‌లోకి రానుంది. దీనికి స్వచ్ఛంద సేవాసంస్థ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సాంకేతిక విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది. 


పర్యాటక కేంద్రంగా మోదీ టీ స్టాల్ప్రధాని మోదీ చిన్నతనంలో టీ అమ్మిన దుకాణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్‌లోని మెహ్‌సన జిల్లా వడ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్లాట్‌ఫాంపై ఆ టీ స్టాల్ ఉంది. మోదీ జన్మస్థలాన్ని ప్రపంచ పర్యాటక పటంలో కనిపించేలా తీర్చిదిద్దే భారీ ప్రాజెక్టులో భాగంగా టీ స్టాల్‌ను పర్యాటక ప్రాంతంగా మార్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు పురావస్తు శాఖల అధికారులు వడ్‌నగర్ పట్టణాన్ని సందర్శించారు. 


ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనఇజ్రాయెల్, భారత్‌లు కలసికట్టుగా ముందుకు సాగితే మరిన్ని అద్భుతాలు సాధించగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జూలై 4న ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఇజ్రాయెల్ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం (70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ) వేచిచూస్తున్నామని.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో మాట్లాడారు. సంయుక్త మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మోదీ, నెతన్యాహూలు ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు ఒకే రకమైన ముప్పును, సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాటిపై కలసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. 
ఓ పువ్వుకు మోదీ పేరు..మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ పేరు పెట్టారు.